చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు

CPIJAC-నారాయణతో టీజేఏసీ నేతల భేటీ
– ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్వహించి తీరుతాం: కోదండరాం
తెలంగాణ సాధన కోసం నిర్వహించే చలో అసెంబ్లీకి సీపీఐ మద్దతు ప్రకటించింది. చలో అసెంబ్లీకి మద్దతు కోరుతూ టీజేఏసీ చైర్మన్ కోదండరాం సహా మిగిలిన నేతలు బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే నారాయణను కలిశారు. చలో అసెంబ్లీకి మద్దతు కోరారు. సుమారు గంటకుపైగా సమావేశమయ్యారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ చలో అసెంబ్లీకి మద్దతిస్తున్నామని, ప్రత్యక్షంగా తాము పాల్గొంటామని ప్రకటించారు. నియంతృత్వ పద్ధతుల్లో ఉద్యమాన్ని అణచివేయాలని సీఎం కిరణ్ ప్రయత్నిస్తే కుదరదన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ చలో అసెంబ్లీని భగ్నం చేయాలని ముఖ్యమంత్రి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము చలో అసెంబ్లీని నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష నెరవేరేవరకు ఉద్యమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. చలో అసెంబ్లీకి మద్దతిచ్చినందుకు కోదండరాం సీపీఐ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అజీజ్‌పాష, పల్లా వెంకటరెడ్డి, చాడా వెంకటరెడ్డి, జేఏసీ ప్రతినిధులు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీ ప్రసాద్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.