గోవా కొత్త సీఎంగా పర్సేకర్

గోవా 22వ ముఖ్యమంత్రిగా  లక్ష్మీకాంత్ పర్సేకర్  శనివారం ప్రమాణం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజ్‌భవన్‌లో పర్సేకర్‌తో గోవా గవర్నర్ మృదులాసిన్హా ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు ఫ్రాన్సిస్ డిసౌజా, దయానంద్ మండ్రేకర్, రమేశ్ తవాడ్కర్, మహదేవ్ నాయక్, దిలీప్ పారులేకర్, మిలింద్ నాయక్, అలినా సల్దానా (బీజేపీ), సుదిన్ ధావాలికర్, దీపక్ ధావాలికర్ (ఎంపీజీ) బాధ్యతలు స్వీకరించారు. వీరంతా గత పారికర్ ప్రభుత్వంలో సభ్యులే. pareskar ఉపముఖ్యమంత్రిగా ఫ్రాన్సిస్ డిసౌజా కొనసాగనున్నారు. ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని పర్సేకర్ తెలిపారు. ముఖ్యమంత్రిగా తనను ఎంపికచేస్తారని ముందే ఊహించానని చెప్పారు. 25 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కృషిచేయడంతోపాటు ఆరెస్సెస్‌తో సంబంధా లు కూడా తనను సీఎంగా ఎంపికచేయడానికి కారణాలని ఆయన మీడియాకు వివరించారు. సీఎంగా ప్రమాణం చేసిన పర్సేకర్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. బీజేపీఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎంపిక అంతకుముందు బీజేపీఎల్పీ నేతగా పర్సేకర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆయన పేరును మాజీ సీఎం పారికర్ ప్రతిపాదించగా, సీనియారిటీ ప్రాతిపదికన సీఎం పదవి తనకే ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా బలపర్చారు. బీజేపీ ఎల్పీ నేతగా పర్సేకర్‌ను ఎంపికచేసినట్టు పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రకటించారు. బీజేపీ ఎల్పీ సమావేశానికి రూడీతోపాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పరిశీలకుడిగా వ్యవహరించారు. డిసౌజా అసమ్మతిగళం వినిపించడంతో బీజేపీ ఎల్పీనేత ఎంపిక క్లిష్టంగా మారుతుందని భావించారు. అయితే బీజేపీ హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి పర్సేకర్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపికచేసింది. అంతేకాదు పర్సేకర్ క్యాబినెట్‌లో కొనసాగేలా డిసౌజాను ఒప్పించగలిగింది. తనను ముఖ్యమంత్రిగా ఎంపికచేయకపోతే డిప్యూటీ సీఎంగా కొనసాగనని హెచ్చరించిన డిసౌజా సీఎంగా పర్సేకర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాటమార్చారు. పర్సేకర్ పేరును అగ్రనాయకత్వం సూచించగా, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎంపికచేశారని, ఎంపిక ప్రక్రియపై తనకు ఎలాంటి అసంతృప్తిలేదని చెప్పారు. డిప్యూటీ సీఎంగా కొనసాగుతానని స్పష్టంచేశారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.