గోల్‌మాల్.. గోకుల్

మొన్న లీజు భూములు.. నిన్న గురుకుల్ ట్రస్టు భూములు.. నేడు పైగా భూములు…అన్యాక్రాంతం అవుతున్న తెలంగాణ భూసంపదకు ఇవే సజీవ సాక్ష్యాలు. హైదరాబాద్ నడిబొడ్డున వలసవాదుల ఆధిపత్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలిచాయి ఈ భూ ఆక్రమణలు. గత సీమాంధ్ర ప్రభుత్వాల అండదండలతో లక్షల కోట్ల విలువ చేసే భూములు కళ్ల ముందే కబ్జాకు గురవుతున్నా ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో తెలంగాణ ప్రజానీకం నిన్నటివరకూ మిన్నకుండిపోయింది. ఇక వారి ఆటలు సాగవు. నీళ్లు నిధులే కాదు..మనగడ్డపై ఉంటూ మన భూములనే కబ్జా చేస్తూ గల్లా ఎగరేసుకుని తిరిగిన సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇక తోక ముడవాల్సిందే.
400 యేళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరాన్ని ఏలిన నిజాం నవాబు ధారాదత్తం చేసిన ఇనామీ, జాగీరు భూములను సైతం విడిచిపెట్టలేదు సీమాంధ్రులు. 1949లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్స్ 1358 ఎఫ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఇనామ్ గ్రామాలైన హైదర్‌నగర్, హఫీజ్‌పేటల్లోని పాయిగా భూములను సైతం వదల్లేదు. హఫీజ్‌పేట సర్వేనెంబరు 78లోని 214 ఎకరాల భూమి సింహభాగంలో పాగా వేసి ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర యేడాది బడ్జెట్ విలువ కలిగిన భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్న సీమాంధ్రులపై ప్రత్యేక కథనం…

పైగా భూములంటే…
హైదరాబాద్ సంస్థానంలో నిజాం రెవెన్యూ, రక్షణ వ్యవస్థల నిర్వహణలో భాగంగా సేవకులకు పలు రకాల జాగీర్లు, ఇనాములు ఇచ్చారు. నిజాం సైన్యంలో కీలకపాత్ర పోషించిన ఖుర్షీద్‌జా పూర్వీకులకు సైతం నగరంలో విస్తతంగా జాగీరులు ఇచ్చారు. దీనినే పైగా అని పేర్కొన్నారు.

ఇనాం భూముల్లో హైదర్‌నగర్, హఫీజ్‌పేట
ఖుర్షీద్‌జా సొంత ఆస్తిని అప్పట్లో రైల్వేలైన్ వేసేందుకు ఉపయోగించగా, దానికి బదులుగా హైదర్‌నగర్, హఫీజ్‌పేట శివారు గ్రామాలను ఇనాముగా ఇస్తూ నిజాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రెండు గ్రామాలపై వచ్చే పన్నులను ఖుర్షీద్‌జాకు నష్టపరిహారం కింద చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 1949లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సమయంలో అమలు జరిగిన జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్స్ 1358ఎఫ్ యాక్ట్ ప్రకారం ఇనాం గ్రామాలైన హైదర్‌నగర్, హఫీజ్‌పేటలను జాగీర్ అడ్మినిస్ట్రేషన్ పైగా నుంచి స్వాధీనం చేసుకుంది. స్వాధీనంపై ఎటువంటి ఆక్షేపణలు ఉన్నా తెలియజేయాలని కోరగా, ఖుర్షీద్ జా వారసుడు హిమావత్ నవాబ్ జంగ్ రెండు గ్రామాల స్వాధీనాన్ని ఆక్షేపించారు.

కాగా జాగీర్ అడ్మినిస్ట్రేషన్ ఖుర్షీద్ జా ఆక్షేపణను విచారణ జరిపి తిరస్కరించింది. హిమావత్ నవాబ్‌జంగ్ అడ్మినిస్ట్రేషన్ తీర్పును సవాల్ చేస్తూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ముందు అప్పీలు చేసుకున్నారు. దీంతో తీర్పులో ఇనాములు రద్దు అయ్యేవరకూ పన్ను వసూలు చేసుకోవచ్చని, గ్రామాలను తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అనంతరం అతియాత్ ఎంక్వైరీ యాక్ట్ 1956 ప్రకారం ఇనాములను రద్దు చేశారు. రద్దు చేసిన గ్రామాల జాబితాలో హైదర్‌నగర్ హఫీజ్‌పేట గ్రామాలను సీరియల్ నెంబరు 380, 381గా పేర్కొన్నారు. సదరు తీర్పును ఖుర్షీద్‌జా వారసులు హైకోర్టులో సవాలు చేయగా తిరస్కరించారు. దీంతో హైదర్‌నగర్, హఫీజ్‌పేట గ్రామాల భూములు ప్రభుత్వానికే చెందినట్లుగా తేలిపోయింది. రెండు గ్రామాల్లోని భూములపై హక్కులను కౌలుదారులకు మాత్రం మినహాయింపు ఉండేవిధంగా అబాలిషన్ ఆఫ్ ఇనామ్స్ యాక్ట్ 1955 సెక్షన్ 5,6,8 వెల్లడించడంతో కౌలుదారులు వారికి హక్కుగల భూములపై క్రయవిక్రయాలు కొనసాగించారు.

జాగీర్ భూములు ప్రైవేట్ పరమైన వైనం…
ఖుర్షీద్ జా వారసులు 1955లో ఆస్తిని పంపకాలు చేయాలని సివిల్ కోర్టులో కేసు వేయగా అది హైకోర్టుకు బదిలీ అయ్యింది. ఇనాం భూములను పంచుకునే హక్కు లేదని, వాటిపై తీర్పునిచ్చే అర్హత న్యాయస్థానానికి లేదని, రెండు గ్రామాలు ఇనాం భూములని సూచిస్తూ హైకోర్టు పేర్కొంది. పంచాల్సిన ఆస్తిని వారసులందరూ స్వాధీనం చేసేందుకు కోర్టు ఓ న్యాయవాదిని రిసీవర్‌గా నియమించి బట్వాడా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సదరు రిసీవర్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హఫీజ్‌పేట, హైదర్‌నగర్ గ్రామాలను తనకు స్వాధీనం చేయాలని అప్పీల్ నెంబరు 19/1973, 114/1973 వేయగా, అప్పటి ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అప్పీలును సవాలు చేయలేదు. దీంతో హైకోర్టు రెండు గ్రామాలను రిసీవర్‌కు స్వాధీనం చేయాలని ఆదేశించింది. తదనంతరం దీనిపై జరిగిన విచారణల్లో సైతం గ్రామాలను అప్పగించాల్సి అవసరం లేదనే విషయం తేలిపోయింది. ఖుర్షీద్ జా వారసులు పంపకాలు చేసుకోకుండా తమకు సంక్రమించిన భూములను నిజాం నవాబుకు, అతని అల్లుడు కాజీమ్ నవాబ్ జంగ్‌కు విక్రయించారు. నిజాం మరణానంతరం అతని కార్యదర్శి ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ పేరిట ఆస్తిని 17/3/67లో రిజిస్ట్రేషన్ చేయించాడు.

నిజాం వారసులు సదరు రిజిస్ట్రేషన్ చెల్లదని అప్పీలు నెంబరు 82/67లో కౌంటరు వేసి అనంతరం కేసు ఉపసంహరించుకున్నారు. దీంతో భూములపై హక్కులను ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ పొందిన అనంతరం ఎఫ్.ఇ.సైరస్ ఇన్‌వెస్ట్‌మెంట్‌గా పేరు మార్చుకుని డాక్టర్ పి.ఎస్‌పసాద్‌ను జీపీఏగా నియమించింది. అనంతరం భూములను ప్రసాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ సంస్థకు అసైన్ చేసింది. గతంలో న్యాయస్థానాలు జాగీరు ఆస్తులుగాపభుత్వఆస్తి) తేల్చిన భూములపై ఎలాంటి హక్కులు లేని ఖుర్షీద్‌జా వారసులు, నిజాం, అతని అల్లుడు హిమాయత్‌నవాబ్ జంగ్ ద్వారా చివరికి గోల్డ్‌స్టోన్ సంస్థకు హక్కులు సంక్రమించాయి. భూముల కేటాయింపుపై గతంలో జరిగిన వివాదాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సర్వేనెంబరు 78లోని 215 ఎకరాల్లో 107 ఎకరాలు కౌలుదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులకు, కాజీమ్ నవాబ్ జంగ్‌లకు వర్తించేలా హైకోర్టు తీర్పు వెల్లడించింది.

గోకుల్ ప్లాట్స్ ఏర్పడిందిలా..
జాగీర్ ఆస్తుల్లో కౌలుదారులకు సంక్రమించిన 107 ఎకరాల భూములను కె.రామస్వామి, ఎం.సాయన్న, ఎం.మల్లయ్య, బి.రాములు, ఈ.సత్తయ్య, రామక్రిష్ణారెడ్డి, ఎం.సత్తయ్య, జి.గురువులు, జి.చ్రందశేఖర్‌రెడ్డి, ఎం.ఎ.అజీజ్, అన్సార్ అహ్మద్, అబ్దుల్ అలీం, అబ్దుల్ సలీం, మహ్మద్‌యాకూబ్ కొనుగోలు చేశారు. మరో 107 ఎకరాలపై హక్కులు దక్కించుకున్న ఖాజీమ్‌నవాబ్‌జంగ్ తన వాటాలోని 50 శాతాన్ని కె.రామస్వామి అండ్ అదర్స్‌కు విక్రయించాడు. దీంతో రామస్వామి అండ్ అదర్స్‌కు సంక్రమించిన 162 ఎకరాల్లో 1973లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం గోకుల్‌ప్లాట్స్ లే అవుట్‌ను రూపొందించి ప్లాట్ల అమ్మకాలు కొనసాగించారు. మొత్తం 162 ఎకరాల్లో 1800 ప్లాట్లుగా విభజించి వంద నుంచి 600 గజాల చొప్పున విక్రయించారు.

లే అవుట్ లేకుండా కేవలం స్థలాలను మాత్రమే చూసుకుని వందలాది మంది ప్లాట్లను కొనుగోలు చేయడం విడ్డూరం. గోకుల్‌ప్లాట్స్‌కు ఒకవైపు హౌసింగ్‌బోర్డు, వసంతనగర్ కాలనీ, మరోవైపు హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ ప్రాంతాలు కిలోమీటరు దూరంలో జాతీయ రహదారి ఉండటంతో నగరం విస్తరిస్తున్న సమయంలో ఈ భూముల విలువ గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కాలనీలో సీమాంధ్ర ప్రాంత వాసులు స్థిరపడ్డారు. కాలక్రమంలో గోకుల్ కూతవేటు దూరంలో హైటెక్‌సిటీ ఐటీ జోన్ వచ్చి చేరడంతో భూముల, ఇండ్ల అద్దెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

సర్కార్ ఆదాయానికి భారీ గండి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణంగా ఇంటినిర్మాణం చేపట్టాలంటే కచ్చితమైన అనుమతులు తీసుకోవాల్సిందే. గోకుల్‌ప్లాట్స్‌లో మాత్రం మూడు దశాబ్దాలుగా కనీసం ఒక్క అనుమతి కూడా లేకుండా వేల నిర్మాణాలు జరిగాయి. కారణమేదైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్ట వ్యతిరేకం. సీమాంధ్ర బిల్డర్లు ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఒకవేళ అక్రమ నిర్మాణలపై ఫిర్యాదులు వచ్చిన సమయంలో చర్యలు తీసుకునేందుకు వెళ్లినా తూతూమంత్రంగా కూల్చివేతలు చేసి చేతులు దులుపుకున్నారు. దీనికి తోడు ఎటువంటి ధ్రువపత్రాలు లేకుండానే విద్యుత్ అధికారులు నిర్మాణాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం గమనార్హం.

కోట్లాది రూపాయల ప్రజాధనంతో రోడ్లు, మంచినీరు, ఇతరత్రా సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇదిలాఉండగా బహుళ అంతస్తుల నిర్మాణాల వల్ల కాలనీలోనే భాగస్వామ్యులైన వంద గజాల స్థలం కలిగిన నిరుపేదలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని, సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని గోకుల్‌ప్లాట్స్‌లోని నిరుపేదలు వేడుకుంటున్నారు. 50 అక్రమ నిర్మాణాలను గుర్తించి బుధవారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో గోకుల్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసు బందోబస్తు లేని కారణంగా కూల్చివేతలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.