గొంగిడి ఇలాకాలో జంగిలి పాలన!!

రామరాజ్యంలో రాక్షసక్రీడ కొనసాగుతోంది. బడుగు బలహీనవర్గాల పక్షపాతి సీఎం కేసీఆర్..  బడుగులు ఆత్మగౌరవంతో బతికేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు.. కానీ ఆలేరు టీఆర్ఎస్‌ కేడర్‌ మాత్రం పార్టీకి కలంకం తెచ్చే పనులు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఓ కులాన్ని గ్రామం నుంచి వెలేశారు. ఈ దుర్మార్గానికి పాల్పడింది ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డి అనుచరులు కావడం శోచనీయం.

బెల్టుషాపు వేలాన్ని అడ్డుకున్నారన్న నెపంతో కాటేపల్లి సర్పంచ్‌ భర్త..  గౌడ కులస్తులను గ్రామం నుంచి వెలేశాడు. వాళ్లకు పాలు, నీళ్లు పోయొద్దని హుకుం జారీ చేశాడు. ఏందీ అరాచకం. కాటేపల్లి గ్రామం ఏమైనా నాగిరెడ్డి అయ్య జాగీరా? నాగిరెడ్డికి ఎందుకింత కులమదం? ఎందుకింత దురహంకారం. ఎందుకింత కండకావరం.. ప్రజాస్వామ్య పాలనలో.. అందునా  కేసీఆర్‌ లాంటి గొప్ప ఆదర్శవాది సీఎంగా ఉన్న తెలంగాణలో ఆటవిక తీర్పు చెప్పడానికి నాగిరెడ్డికి ఎంత ధైర్యం? ఓ వైపు ప్రభుత్వం బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతుంటే నాగిరెడ్డి మాత్రం బహిరంగ వేలం వేయడమే కాకుండా.. వేలాన్ని అడ్డుకున్నందుకు  ఓ కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించాడు. గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి అండ చూసుకునే నాగిరెడ్డి రెచ్చిపోతున్నాడని కాటేపల్లి గ్రామస్తులంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. గొంగిడి ఇలాకాలో ఈ జంగిలి పాలనేంటి. ఇంత జరిగినా ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి బాధితులను పరామర్శించలేదు. కనీసం ఖండించలేదు. పైపెచ్చు నాగిరెడ్డిని విడుదల చేయాలని వీరి అనుచరులే పోలీస్ స్టేషన్‌ ముందు ధర్నా చేయడం దుర్మార్గం. గతంలో బలహీనవర్గానికి చెందిన వంగపల్లి సర్పంచ్‌ జహంగీర్‌ విషయంలోనూ మహేందర్‌రెడ్డి దురుసుగా వ్యవహరించారు. రాజకీయ కక్ష్య సాధింపునకు దిగారు. విషయం పెద్దల వరకూ వెళ్లడంతో ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఓ  మంత్రిగారు గొంగిడి దంపతులను తీవ్రంగా మందలించారు.

https://youtu.be/_ta45lXW8qI

ఓ వైపు దళితులకు మూడెకరాల భూమి.. మత్స్యకారులకు చేపల పంపిణీ, యాదవ, కురుమలకు గొర్ల పంపిణీ, చేనేతలకు చేయూతనిస్తూ..బలహీనవర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. ఆలేరు నియోజకవర్గంలో మాత్రం గొంగిడి అనుచరులు ఇలాంటి పిచ్చి పనులతో బడుగు బలహీనవర్గాలను టీఆర్ఎస్‌ పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నారు. వీరి చర్య వల్ల టీఆర్ఎస్‌ పార్టీ అపఖ్యాతి మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గ్యాంగ్, రేవంత్‌ రెడ్డి గ్యాంగ్‌ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తుంటే.. సొంత పార్టీలోని రెడ్డివర్గం ఇలా ఆటవిక తీర్పులు చెప్పి ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *