గెరిల్లా పోరుతోనే తెలంగాణ

– ఆత్మహత్యలు వద్దు.. అధైర్యపడొద్దు
– రియల్ మాఫియాలకు బుద్ధి చెప్తాం
– మెదక్ జిల్లా మావోయిస్టు పార్టీ హెచ్చరిక
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గెరిల్లా పోరాటాలతోనే సాధ్యమవుతుందని సీపీఐ మావోయిస్టు పార్టీ మెదక్ జిల్లా కమిటీ పేర్కొంది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తెగించి పోరాడాలని కోరింది. ఈ మేరకు గురువారం రాత్రి మావోయిస్టు జిల్లా కార్యదర్శి తలారి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు నవీన్ పేరిట దుబ్బాక విలేకరులకు ఒక లేఖ అందింది. తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారని ఆ లేఖలో ఆరోపించారు. స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగస్వాములవుతున్న తెలంగాణా ప్రాంత అమాయక ప్రజలను ఈ నాయకులు మోసం చేస్తున్నారన్నారు.

పూటకో మాట, రోజుకో ప్రకటనలతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రకటనలను చూసి గుండె చెరువైన యువత, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థిలోకం ఏమాత్రం అధైర్యపడకుండా మోసపూరిత ప్రకటనలు చేసే నాయకుల భరతం పట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను దగాచేస్తూ వచ్చిన పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడే విధానాలకు స్వస్తి చెప్పి, తెలంగాణ లక్ష్య సాధనకు ఆత్మాహుతి దళాలుగా మారాలన్నారు. మావోయిస్టు పార్టీ నేతృత్వంలోని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)లో చేరాలని పిలుపునిచ్చారు. రాజీనామాల నాటకాలతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించి ప్రజలను వంచించే కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దన్నారు. సోనియాగాంధీ వద్ద నోరుపెగలని నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే దళిత, బహుజన, సామాజిక వర్గాల తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు సిద్ధం కావాలని కోరారు.

రియల్ మాఫియాకు బుద్ధి చెప్తాం
తెలంగాణ ఉద్యమాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా సొమ్ముచేసుకునేందుకు వాడుకుంటున్నారని లేఖలో మావోయిస్టు నేతలు ఆరోపించారు. దొమ్మాట (దుబ్బాక) ప్రాంతంతోపాటు సిద్దిపేట ప్రాంతానికి చెందిన కొన్ని ముఠాలు ఈ రియల్ దందాను నడుపుకుంటూ ఉద్యమ లక్ష్యాలను మలినం చేస్తున్నాయని ఆరోపించారు. స్వార్థ రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ మాఫియాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 1933 నుంచి అనేక పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన తమ పార్టీ కార్మిక, కర్షక వర్గాలు, దుబ్బాక, సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, చేగుంట, నర్సాపూర్ ప్రాంతాల నుంచి అనేక మంది ఉద్యమ బిడ్డలను అందించిందన్నారు. ఈ పోరాటంలో అమరులైనవారి ఆశయాల సాధన కోసం మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, పోరాటాల పురిటిగడ్డలో అన్యాయంపై తిరుగుబాటు బావుటా ఎగరేస్తామని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.