గెజిట్ వచ్చిన రోజే నోటిఫికేషన్ తేదీ: జైరాం

రాష్ట్ర విభజనకు సంబంధించి గెజిట్ వచ్చిన రోజును నోటిఫికేషన్ తేదీ అంటారని, ఆరోజు నుంచి కొత్త రాష్ట్రం అమలులోకి వస్తుందని జైరాం రమేష్ అన్నారు. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు పాసైందని, బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతామన్నారు. ఆ తర్వాత గెజిట్ విడుదలవుతుందని పేర్కొన్నారు. గెజిట్ వచ్చిన రోజునే నోటిఫికేషన్ తేదీ అంటారని వివరించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నోటిఫికేషన్ తేదీ తర్వాత 3 నెలలకు అధికారికంగా కొత్త రాష్ర్టాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. దాన్నే అపాయింటెడ్ తేదీ అంటారని తెలిపారు. అపాయింటెడ్ తేదీ నుంచే రెండు రాష్ర్టాలకు కొత్త సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలు, పీఐబీలు అమలులోకి వస్తారని వివరించారు.

తెలంగాణ అపాయింటెడ్ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
తెలంగాణ అపాయింటెడ్ తేదీపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైరాం స్పష్టం చేశారు. దానికి ఇంకా మూడు నెలల సమయం ఉందని వెల్లడించారు. అపాయింటెడ్ తేదీపై ప్రధాని కూడా రాజ్యసభలో ప్రకటన చేశారని గుర్తు చేశారు. విభజనకు సంబంధించి కేడర్, ఆస్తులు, అప్పుల పంపిణీ ఇతర వ్యవహారాల పూర్తవడంపైనే అపాయింటెడ్ తేదీ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇపుడు ఆ పని మొదలు పెట్టామని అందుకు రెండు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగుల పంపిణీకి మొదటి కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే విభజించాం

రాష్ట్ర విభజన రాజ్యాంగబద్దంగా జరిగిందని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్పష్టం చేశారు. రాష్ర్టాల పునర్వ్యస్థీకరణలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సంపూర్ణాధికారం కేంద్రానికే ఉందని నాలుగు కేసుల్లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే వ్యవహరించామని తెలిపారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలపై ఆయన మాట్లాడారు. పూర్తి రాజ్యాంగబద్ధంగానే గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సూచనల ఆధారంగానే గవర్నర్ పనిచేస్తారని తెలిపారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అదనపు బాధ్యతలతోపాటు అంతర్గత రక్షణ బాధ్యతలు కేటాయించామని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.