గులాబీ ఆపరేషన్ గుండెల్లో రైళ్లు

 

TRS-car
-తెలంగాణ ఉద్యమ సెగలతో ఎన్నికలం గుబులు
-తేల్చని అధిష్ఠానంతో తలపట్టుకున్న టీ కాంగ్రెస్ నేతలు
-తెలంగాణ తొవ్వపట్టని బాబుతో టీడీపీ టీ ఫోరం నేతల వెతలు

మరో ఏడాదిలో ముందుకు రానున్న సార్వవూతిక ఎన్నికలు.. కాలం కలిసిరాకపోతే ముందస్తు వచ్చే ప్రమాదం.. ఏదేమైనా తెలంగాణలో మా టార్గెట్‌కు అంతా కలిసిరావాల్సిందేనని దూకుడుగా సవాళ్లు విసురుతున్న టీఆర్‌ఎస్.. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీల్లోని నేతలు బెంబేపూత్తుతున్నారు. తామున్న పార్టీలకు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. కొందరు అప్పుడే ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మారిన రాజకీయ పరిస్థితులతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర అయోమయం నెలకొంది. బయటికి దిలాసాగా కనిపించినా, తమ రాజకీయ భవిష్యత్తుపై వారు కలవరపడుతున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా తెలంగాణలో చిక్కులు తప్పవని తేలిపోవడంతో నాయకులకు వారి రాజకీయ అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది.

ఇక చేసేదేమీ లేదన్న భావనతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే డెడ్‌లైన్ పెట్టి, ఎవవరు తమ పార్టీలోకి వస్తారో ముందుగానే రావాలని ప్రకటించడంతో టీ కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ ఫోరం నేతల్లో కలకలం రేగింది. ఏ పార్టీలో చేరితే రాబోయే ఎన్నికల్లో తమకు భరోసా లభిస్తుందన్న విషయంపై మీమాంసతో ఈ పార్టీల కీలక నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మాట తప్పి మోసం చేసిందన్న భావన బలపడటంతో ముందస్తు ఎన్నికలే వస్తే పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రజలు అధికార పార్టీని ఇక విశ్వసించరనే బెంగ పట్టుకుంది. దీంతో టీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికలకు ముందే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమై ఇప్పటికే ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే కొందరు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో నేరుగా మంతనాలు జరుపుతుంటే, ఆ పార్టీ కీలక నేతలతో మరికొందరు చర్చిస్తున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథ్‌తో కేసీఆర్ ముఖాముఖి చర్చలు జరపడంతోపాటు తెలంగాణ లక్ష్య సాధనకు రాజకీయ ఎత్తుగడలు కీలకంగా భావించి పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు ఇంటికి కూడా వెళ్లి, మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరేవారికి ఆహ్వానం కూడా ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా తమ దారి వెతుక్కోవాలని కొందరు నేతలు ఆలోచిస్తుండగా, మరికొందరు కేసీఆర్ విధించిన గడువుకు ముందే ఓ నిర్ణయానికి రావాలని తలపోస్తున్నారు.

టీడీపీ తెలంగాణ ఫోరంలోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన నిర్ణయం ఇదని సోమవారం తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్ అధినేతను స్వయంగా కలిసి, ఆ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు మరికొందరు ఆయన దారిని అనుసరించేందుకు లోపాయకారీగా చర్చలు జరుపుతున్నారని, ఇందులో టీ ఫోరంలో కొంత బాధ్యతగా వ్యవహరించినవారు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకరిద్దరు భారతీయ జనతాపార్టీ వైపు వెళ్లేందుకు ఆలోచిస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీ బలం, బలగం అంతంత మాత్రమే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండి, రాష్ట్రవ్యాప్తంగా కూడా పేరున్న నాగం జనార్దన్‌డ్డి కొన్నాళ్లు టీఆర్‌ఎస్ ఉద్యమంలో, తెలంగాణ రాజకీయ జేఏసీలతోపాటు తెలంగాణ అంశాలపై చురుకుగా పాల్గొన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌లో తాను ఆశించిన స్థానం లభించదనే అనుమానంతో ఇటీవల బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తే, బీజేపీ నుంచి నాగం బరిలోకి దిగుతారనే ప్రచారం ఉన్నప్పటికీ.. టీఆర్‌ఎస్ నుంచి తనకు సముచిత ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకం కుదరితే ఆయన వైఖరిలో మార్పు ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఇక ఒకే సామాజికవర్గం అనే కోణంలో కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసేందుకు ఆలోచిస్తున్నప్పటికీ… ఆ అడుగులు తడబడుతున్నాయి. తెలంగాణ విషయంలో జగన్ వైఖరి స్పష్టం కాకపోవడంతోపాటు తెలంగాణ పట్ల ఆ పార్టీ అనుకూలంగా కూడా వ్యవహరించకపోగా సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ లోక్‌సభలో జగన్ ప్లకార్డును ప్రదర్శించడం తెలంగాణ ప్రజల మనోఫలకం నుంచి ఇంకా చెరిగిపోలేదు. దీంతో వైఎస్సార్ సీపీ కూడా తమ రాజకీయ భవిష్యత్తుకు రాచమార్గం కాదనే అభివూపాయం ఆ సామాజికవర్గ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంవూతిగా వైఎస్ రాజశేఖరడ్డి ఉన్న సమయంలో ఆయన ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన కొందరు కాంగ్రెస్ నేతలు జగన్ వైపు వెళ్తారనే ప్రచారం ఉన్నప్పటికీ.. వైఎస్సార్‌సీపీ తెలంగాణలో అంతగా ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపడం లేదు.
తెలంగాణలో వైఎస్సార్‌సీపీకి ఉన్న వ్యతిరేకత పలు సర్వేల్లో కూడా వ్యక్తం కావడంతో ఆ పార్టీలోకి చేరాలనుకునే నేతలు గుబులు పడుతున్నారు.

ఇక, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, తెలంగాణ పట్ల ఆయన వైఖరి కారణంగా కూడా తెలంగాణ ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత కొనసాగుతోంది. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం వారిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సాగించిన పాదయావూతగానీ, బీసీల డిక్లరేషన్, ఇతర తాయిలాలేవీ తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఉపకరించడం లేదని.. ఆయన పర్యటనతో పార్టీకి ప్రజల మద్దతు పెరగలేదని, పైగా తెలంగాణలో టీడీపీ నేత ప్రభావం ఏ మాత్రం పనిచేయదని టీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కీలకనేతలు సుముఖంగా ఉన్నప్పటికీ.. వారికి ఇతర భయాందోళనలు కూడా ఉన్నాయి. తాము టీఆర్‌ఎస్‌లో చేరితే సముచిత గౌరవం లభించేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌లో తమ భవిష్యత్తుకు తగిన భరోసా లభిస్తే కీలక నేతలతోపాటు అనేక మంది ఈ పార్టీలో చేరి తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.