గుండె చెదిరి రైలుకు ఎదురేగిమరో బలిదానం

 

die
– హైటెక్ సిటీ స్టేషన్‌లో అలజడి రేపిన ఆత్మహత్య
– టీ కాంగ్రెస్, టీడీపీ నేతలవి రాజకీయ నాటకాలు
– ప్రత్యేక రాష్ట్రం కోసం ఇకనైనా రాజీనామాలు చేయాలి
– సూసైడ్‌నోట్‌లో ఆటో డ్రైవర్ నవీన్‌చారి
అదే కోరిక.. అదే కల.. తెలంగాణ సాకారం కావాలని! ఒక న్యాయమైన డిమాండ్ కోసం సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తున్న ఉద్యమకారులు!! పట్టుసడలని దీక్షతో సాగుతున్న పోరాటం ఇది! ఇదేమీ పట్టని రాజకీయవేత్తలు కొందరు!! వీరివల్లనే తెలంగాణ ఆలస్యమైపోతోందన్న ఆవేదనతో ఇప్పటికే ఎందరో తమ విలువైన ప్రాణాలను తృణవూపాయంగా వదిలేశారు. ఆత్మత్యాగాలొద్దు.. బరిగీసి కొట్లాడుదాం అంటున్నా కొందరు ఆ దారిని ఎంచుకోవడం విషాదకరం. తాజాగా ఓ బీజేపీ కార్యకర్త ఆత్మబలిదానం జ్ఞాపకం వీడకముందే మరో ఉద్యమకారుడి ఆత్మత్యాగం! కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆడుతున్న దొంగనాటకాలకు కలతచెందిన ఓ ఆటోడ్రైవర్ హైదరాబాద్ నగరంలోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న రైలును ఢీకొని ప్రాణాలు వదిలాడు. తన మరణంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాడు. తెలంగాణ ఇవ్వకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించాడు. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు పార్టీల నేతలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని తేల్చిచెప్పాడు. ఈ మేరకు నవీన్‌చారి తన ఆత్మహత్యకు ముందు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సూసైడ్‌నోట్ రాశాడు. ఆదివారం ఉదయం జగద్గిరిగుట్టకు చెందిన నవీన్‌చారి (35) సూసైడ్ నోట్ రాసి చేతిలో గులాబీ జెండాలను పట్టుకుని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌లో వేగంగా వస్తున్న రైలుకు ఎదుళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దండుమల్కాపురం గ్రామానికి చెందిన నవీన్‌చారి పదేళ్ల కిందట బతుకుదెరువుకోసం కుటుంబంతో సహావచ్చి జగద్గిరిగుట్ట ముగ్ధుంనగర్ శ్రీరాంనగర్ కాలనీలో ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన దగ్గరి నుంచి పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇటీవల కేపీహెచ్‌బీ డివిజన్ బీసీ సెల్‌లో సభ్యునిగా నియమితుడయ్యాడు.

టీఆర్‌ఎస్, జేఏసీ ఏ విధమైన ఉద్యమం తలపెట్టినా తూచా తప్పకుండా పాల్గొనేవాడు. నిత్యం తెలంగాణపై చర్చ జరిపేవాడని తెలంగాణ ఎప్పుడొస్తదిరా మన బతుకులు ఎప్పుడు బాగుపడుతయిరా అంటూ ఆవేదన వ్యక్తం చేసేవాడని తోటి ఆటోవాలాలు నవీన్‌చారి గురించి చెప్పుకోవడం అందరినీ చలింపజేసింది. తెలంగాణ కోసం ఏదైనా చేయాలని గత రెండు మూడురోజులుగా కసిగా అంటూ వచ్చాడని, కానీ ఇలాంటి పనికి పాల్పడుతాడనుకోలేదని తోటి ఆటోవాలాలు బాధపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే వేలాదిమంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలంటే సీమాంధ్ర సర్కార్‌కు విలువలేకుండా పోయిందని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల ఉసురుపోసుకుంటున్న సీమాంధ్ర ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చెల్లుతాయన్నారు. నవీన్‌చారి ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలుసుకున్న భార్య భాగ్యలక్ష్మితోపాటు అతని తల్లిదంవూడులు శ్రీహరి, బాలమణి శోకసమువూదంలో మునిగిపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన భర్త నవీన్‌చారి ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాడని టీఆర్‌ఎస్, జేఏసీ ఏ కార్యక్షికమం తలపెట్టినా క్రమంతప్పక పాల్గొనేవాడని భార్య భాగ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పేర్కొంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంటే పడిచచ్చేవాడని, ఆయన ప్రసంగాన్ని ఎంతో ఉత్కం టీవీలలో వీక్షించేవాడని అతని పిలుపును తూచా తప్పక పాటిస్తానని శపథం చేసేవాడని తెలిపింది. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున అతని నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు.

తెలంగాణ కోసం ప్రాణాలను బలిస్తున్నాను.. కేసీఆర్‌కు ఆఖరి లేఖ..
‘‘ప్రియాతి ప్రియమైన టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు గారికి.. నవీన్‌చారి అనబడే నేను తెలంగాణ సాధన కోసం నా ప్రాణాలను బలిస్తున్నాను. నా ఆత్మబలిదానాన్ని చూసైనా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలకు కనువిప్పు కలగాలి. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు రాజీనామాలు ఇగ చేస్తం.. అగచేస్తం.. అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే మాటకు కట్టుబడి లేరు. టీ మంత్రులు, టీ టీడీపీ నాయకుల మాటలు తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇకనైనా రాజీనామాలు చేసి తెలంగాణ సాధించాలి’’

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.