గబరా మత్‌.. తెలంగాణ ఆయేగా!-దిగ్విజయ్‌

జనవరి 31 : మీ తెలంగాణ అయిపోయింది. బాస్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తాం. ఎన్నికలకు ముందే తెలంగాణ ఇచ్చేస్తున్నాం అని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తనను కలిసిన టీ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ భరోసా ఇచ్చారు. గుల్బర్గా వెళ్లేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన దిగ్విజయ్‌ను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు.
marteds ఈ సందర్భంగా తెలంగాణ నేతలు అసెంబ్లీలో బిల్లుపై ముగిసిన చర్చ, ఆ సందర్భంగా సీఎం, సీమాంధ్ర నేతలు వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఒకింత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే అసెంబ్లీలో చివరి రోజు పరిణామాలతో తెలంగాణ ఏమాత్రం ఆగే పరిస్థితి లేదని ఆయన వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికల విషయంలో దిగ్విజయ్ సింగ్ టీ నేతలతో ఆరా తీశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది.

అలాంటిదేమీ ఉండబోదని, తెలంగాణ ఇచ్చిన సోనియాకు, పార్టీకి ఎమ్మెల్యేలు రుణపడి ఉంటారని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? అని అడిగినప్పుడు, వారి వ్యవహారం తమకు తెలియదని, ఒక వేళ తమకు బాధ్యతలు అప్పగిస్తే వారిని కూడా పార్టీ ఆదేశాల మేరకు నడుచుకునేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అంతకు ముందు రాజ్యసభ అభ్యర్థులతో విడిగా సమావేశమైన దిగ్విజయ్.. పార్టీ అభ్యర్థుల్లో ఎవ్వరూ ఓడిపోకుండా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసినందుకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పార్టీ పెద్దలను కలిసి కతజ్ఞతలు తెలియజేసేందుకు టీ మంత్రులం ఫిబ్రవరి 3న ఢిల్లీకి వస్తున్నామని, అపాయింట్‌మెంట్ ఇప్పించాలని ఈ సందర్భంగా జానారెడ్డి, ఉత్తంకుమార్‌లు దిగ్విజయ్‌ను కోరినట్లు తెలిసింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.