గంటావారి ఘరానా కబ్జా!

శూన్యంలో బ్రహ్మాండం సృష్టించడం ఎలా? ఖాళీగా ఉన్న భూమిని దర్జాగా కబ్జా చేయడం ఎలా? కబ్జా చేసిన భూములకు తప్పుడు పత్రాలు సృష్టించడానికి మార్గాలేంటి? కొత్త యజమానులను ఎలా రంగంలోకి దించాలి? కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నా.. కోట్ల రూపాయల దందా కొనసాగించడంలో కిటుకులేంటి? అక్రమ దందా నిర్వహిస్తూ ప్రభుత్వ రక్షణలు పొందటానికి ఏమేం చేయాలి?.. ఈ రహస్యాలు తెలిసిన కొద్ది మంది రాజకీయ నేతల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు! హఫీజ్‌పేట్‌లోని హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూముల స్వాహా కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ! తన బినామీలను భూమి యజమానులుగా ముందుకు తెచ్చి.. తప్పుడు పత్రాలు సృష్టించిన మంత్రి గంటా శ్రీనివాసరావు.. హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన భూమిలో రూ.350 కోట్ల విలువైన పాతికెకరాలను కబ్జా చేశారని ఆ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు!
అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీలో గంటా ఉంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న గంటా.. తదుపరి చిరంజీవి పీఆర్పీని స్థాపించినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో పార్టీ ఫిరాయించారన్న వాదనలు లేకపోలేదు. పీఆర్పీ అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించేందుకు ప్రధాన భూమిక పోషించినవారిలో గంటా కూడా ఒకరన్న బలమైన విమర్శలు ఉన్నాయి. తరచూ పార్టీల మార్పు వెనుక రాజకీయ అధికారం కన్నా..

భూ దందాకు రక్షణ కల్పించుకోవడమే ప్రధాన లక్ష్యమన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన భూముల కబ్జా ఈ నేపథ్యంలోనిదేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి ఉద్యోగులకు చెందినదిగానే సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ.. కొనసాగుతున్న వివాదాల కారణంగా రికార్డుల్లో దానిని ఖాళీ భూమిగా ప్రభుత్వం పేర్కొంది.

ఇదే అంశాన్ని అవకాశంగా చేసుకున్న గంటా.. బినామీలను రంగంలోకి తెచ్చి.. తప్పుడు రికార్డులు సృష్టించి.. పాతికెకరాలను తన వశం చేసుకున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. టీడీపీ నేతగా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఈ భూమిని గుర్తించిన గంటా.. అక్రమ తవ్వకాల కేసులో ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఒక న్యాయవాది సహకారం తీసుకుని తప్పుడుడాక్యుమెంట్లు సృష్టించారని అంటున్నారు. అంతే.. ఈ భూములకు నకిలీ యజమానులను ముందుకు వచ్చారు. సదాశివరెడ్డి అనే వ్యక్తి పేరున 2002లో అన్‌రిజిస్టర్డ్ అసైన్ డీడ్ తయారైంది. 2004లో ఈ భూమిని ప్రభుత్వం రిలీజ్ చేసిన తరువాత 2005లో ప్లాన్ ప్రకారంగా ఎవరి పేరునైతే అసైన్డ్ చేశారో సదరు అసైన్‌దారుడి నుంచి తాము సృష్టించుకున్న వెదిరె ఎస్టేట్ సంస్థ పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు.

అన్‌రిజిస్టర్డ్ అసైన్ డీడ్ చెల్లదు!
చట్టరీత్యా అన్‌రిజిస్టర్డ్ అసైన్ డీడ్‌లు చెల్లుబాటు కావు. ఈ విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చట్టంలోని సెక్షన్ 17 (ఈ) స్పష్టం చేస్తున్నది. అయినా అన్‌రిజిస్టర్డ్ అసైన్ డీడ్‌తో మూసాపేట సబ్‌రిజిస్ట్రార్ సదరు భూమిని ఎలా రిజిస్టర్ చేశారన్నది ప్రశ్న. ఏ అధికారి అయినా ఒక భూమిని రిజిస్టర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. ప్రభుత్వ రికార్డులను పక్కాగా పరిశీలించిన తరువాతే భూమిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఈ భూమిని హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ 1981లోనే రిజిస్టర్ చేయించుకుంది. ఆ తరువాత సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో ఈ భూమిని ప్రభుత్వం వీరికి మ్యుటేషన్ చేయలేదు. హెచ్‌ఏఎల్ ఉద్యోగులు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడంతో 1999లో ఈ భూమిని హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, ఇప్పటికీ వాళ్లే పొజిషన్‌లో ఉన్నందున రెవెన్యూ రికార్డులో వారి పేరుతో అప్‌డేట్ చేయవచ్చునని సీసీఎల్‌ఏకు అప్పటి శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి లేఖ రాశారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా ఈ భూమి హెచ్‌ఏఎల్ సొసైటీ కొనుక్కున్నదని ధ్రువీకరించింది.

ఈ నేపథ్యంలో 2002లో సుప్రీంకోర్టు కూడా వ్యాజ్యాన్ని కొట్టి వేస్తూ ఈ భూమి ప్రైవేట్ వారిదేనని తెలిపింది. సుప్రీం ఆదేశాల మేరకు 5-11-2004లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ భూమిని కొనుక్కున్న వారికే మ్యుటేషన్ చేయడానికి ఆదేశించింది. కానీ అప్పటికే ఈ భూమిపై కన్నేసిన గంటా చెల్లుబాటు కానీ అసైన్డ్ డీడ్‌తో 25 ఎకరాల భూమిని తిరిగి 2005లో అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రెండోసారి రిజిస్ట్రేషన్ చట్టరీత్యా నేరం
హెచ్‌ఏఎల్ హౌసింగ్‌సొసైటీ పేరుతో భూమి 1981లోనే రిజిస్టర్ అయింది. అలా ఒక్కసారి రిజిస్టర్ అయిన భూమిని రెండోసారి రిజిస్టర్ చేయడం చట్ట రీత్యానేరం. అలా చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చెల్లుబాటు కాదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం మొదటిసారి ఎవరి పేరున భూమి రిజిస్టర్ అవుతుందో వారికే చట్టపరంగా హక్కులు సంక్రమిస్తాయి. కానీ ఇక్కడ బలవంతుడిదే రాజ్యమైంది. గంటా బినామీ సంస్థగా చెప్పే వెదిరె ఎస్టేట్‌కు ఈ భూమిని రిజిస్టర్ చేసే నాటికి కూడా రెవెన్యూ రికార్డులో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా చూపించడం గమనార్హం. పైగా వ్యవసాయ భూమిని ఒకరి పేరు నుంచి మరొకరి పేరుతో రిజిస్టర్ చేయాలంటే విధిగా పాస్‌బుక్ ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా రిజిస్ట్రార్ ఏ విధంగా భూమిని రిజిస్టర్ చేశారన్నదే అసలు కిటుకు.

ఆక్రమించిన భూమిని టోకున అమ్మాలని..
కబ్జా చేసిన భూమిని ఒక నిర్మాణ సంస్థకు టోకున అమ్మేందుకు గంటా బృందం ప్రయత్నం చేసిందని, అయితే గొంతెమ్మ కోర్కెలు కోరడంతో సదరు నిర్మాణ సంస్థ అప్పటికే ఆ భూమి విషయంలో పది కోట్లు ఖర్చు చేసినా.. వారి అత్యాశకు భయపడి డీల్‌ను వదులుకున్నదని సమాచారం. ఈ డీల్ వ్యవహారం సినిమాల్లో మాదిరిగా సాగిందని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని సదరు నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. కబ్జా చేసిన మొత్తం 25 ఎకరాల 35 గుంటల భూమిని రూ.175 కోట్లకు బేరానికి పెట్టారు. ఈ డీల్‌కు అంగీకరించిన నిర్మాణ సంస్థ రెండు ప్రముఖ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. డీల్‌కు సిద్ధమైన నిర్మాణ సంస్థ అవసరమైన నిధులు సమీకరించుకుంది. ఇక సంతకాలు జరగాల్సిన సమయంలో గంటా శ్రీనివాసరావు మెలిక పెట్టారు. ధరలు పెరిగినందున 300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికే ప్రాజెక్టు వర్కు, డిజైన్‌ల పేరుతో దాదాపు పది కోట్లు వెచ్చించిన సదరు నిర్మాణ సంస్థ.. లాభం రాకపోయినా.. నష్టంలేకుండా ఉంటే చాలుననుకుని సరేనంది.

అక్కడి నుంచి గంటా బృందం నుంచి కొసరు డిమాండ్లు మొదలయ్యాయి. వెదిరె ఎస్టేట్స్ కంపెనీలో ఐదుగురు భాగస్వాములం ఉన్నామని, అందరికీ తలా ఒక బీఎండబ్ల్యూ కారు ఇవ్వాలని కోరారు. ఇందుకూ నిర్మాణ సంస్థ ఒప్పుకుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత నిర్మాణ సంస్థకు చెందిన ఒక ప్రతినిధిని ఆపిన వెదిరె పాండురంగారెడ్డి.. నిర్మాణం పూర్తయ్యే నాటికి ఇంకా లాభాలు వస్తాయని, భయపడవద్దని చెబుతూనే.. నిర్మాణ కంపెనీ ఇచ్చే డబ్బు మొత్తం పైవాళ్లే పట్టుకుపోతారని, తమకు మిగిలేది ఒక్క బీఎండబ్ల్యూ కారేనని, కనుక అగ్రిమెంట్ వ్యవహారం సాఫీగా జరగాలంటే కంపెనీకి వచ్చే లాభాల్లో సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కంగుతిన్న కంపెనీ ప్రతినిధి.. డీల్ వద్దూ.. భూమి వద్దు.. అంటూ డ్రాప్ అయిపోయారు. ఈ విషయంలో తమకు పది కోట్లు నష్టం వచ్చిందని పేరు రాయటానికి ఇష్టపడని సదరు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ డీల్ కుదరకపోవడంతో ఆ తర్వాత ఆ స్థాయిలో టోకున భూమి కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అది ఆగిపోయింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీమాంధ్రుల భూ అక్రమాల భరతం పట్టాల్సిందేనని తెలంగాణ ఉద్యమకారులు కోరుతున్న తరుణంలో అదే జరిగితే తమ కబ్జా భూమి తమకు కాకుండా పోతుందన్న ఉద్దేశంతోనే గంటా శ్రీనివాసరావు సమైక్య ఉద్యమానికి వెన్నుదన్నులిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

గంటా ఎదిగిన తీరు కూడా..
ప్రకాశం జిల్లాలో పుట్టిపెరిగిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, విశాఖ కేంద్రంగా షిప్పింగ్ కార్యకలాపాలు చేపట్టే వరకు కూడా అతి సామాన్య కుటుంబమే. కానీ ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తికి యాజమాని అయ్యాడని చెబుతున్నారు. ఇప్పటి వరకు గంటా ఆస్తులపై విచారణ చేపడితే ఆయన అక్రమ పద్ధతుల్లో సంపాదించిన ఆస్తి అంతా బయటకు వస్తుందని అంటున్నారు. తెలంగాణను ముంచి సంపాదించిన ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా గంటా షిప్పింగ్ యార్డ్‌లో కొంత భాగాన్ని లీజుకు తీసుకొని దందాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్దన్‌రెడ్డి అక్రమంగా తవ్వించిన ఖనిజాన్ని గంటాయే తరలించారన్న అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. ఖనిజం తరలింపునకు వాడిన వాహనాలు గంటా బినామీలవేనని సమాచారం. ఇదే సమయంలో వెదిరె ఎస్టేట్స్ ద్వారా హైదరాబాద్, బెంగళూరులలో రియల్ ఎస్టేట్ దందాలు చేపట్టారని అంటారు. హైదరాబాద్‌లో పైసా పెట్టుబడిలేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అతనిని దగ్గరగా పరిశీలించిన వారు అన్నారు.

భూ స్కామ్‌పై విచారణ జరపాలి: పొన్నం డిమాండ్
టీ మీడియా, కరీంనగర్: హెచ్‌ఏఎల్ ఉద్యోగుల స్థలం కబ్జాపై విచారణ జరపాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘సమైక్య భూ స్కామ్’ కథనంపై ఆయన కరీంనగర్‌లో స్పందించారు. ఈ భూమి కబ్జా ఎవరున్నారనేదానిపై వాస్తవాలు బయటకు రావాలంటే రెవెన్యూశాఖ విచారణ చేపట్టాలని అన్నారు. దీనిపై సంబంధిత మంత్రిని కలిసి కోరుతానని చెప్పారు. ఉద్యోగులు తెలంగాణ, సీమాంధ్రకు చెందిన వారైనా వారికి దక్కాల్సిన భూములను కబ్జా చేయడం సహించరానిదన్నారు.

ఉద్యోగులకు అండగా నిలబడుతాం: గంగుల
హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు అండగా నిలబడుతామని, తిరిగి ఉద్యోగులకు భూములు దక్కేంతవరకు టీఆర్‌ఎస్ తరఫున తమవంతు పోరాటం కొనసాగిస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. గురువారం ఆయన ‘టీ మీడియా’తో మాట్లాడుతూ పైసా పైసా కూడగట్టి హెచ్‌ఏఎల్ ఉద్యోగులు కొనుకున్న భూమిని సీమాంధ్ర ముసుగులో కబ్జాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పేదల, ఉద్యోగుల భూములను సీమాంధ్ర నేతలు మింగేస్తున్నారని, సమైక్య ముసుగులో సాగిస్తున్న కబ్జాలకు ఇదో నిదర్శనమని చెప్పారు.

గంటా బినామీ సంస్థ వెదిరె ఎస్టేట్స్
వెదిరె ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటును పరిశీలిస్తే హైదరాబాద్‌లో గంటా దందా దశాబ్దాల కాలం నుంచే కొనసాగుతున్నదా? అన్న సందేహాలు వ్యక్తమవుతాయి. ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను సరఫరా చేసేందుకు జ్యోతి కంప్యూటర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయడం వెనుక గంటా కీలక పాత్ర పోషించారని అంటుంటారు. టీడీపీ హయాంలో వచ్చిన ఈ సంస్థ ఇప్పటికీ కొనసాగుతున్నది. జ్యోతి కంప్యూటర్స్‌కు చెందిన వెదిరె పాండురంగాడ్డి గంటాకు బినామీ అన్న ప్రచారం ఉంది. ఆయన 2000 సంవత్సరంలో వెదిరె ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న గంటా సొంత సంస్థకు చెందిన ఉద్యోగి వీ రాజారావు వెదిరె ఎస్టేట్‌కు చైర్మన్ అయ్యారు. హైదరాబాద్‌లో వెదిరె ఎస్టేట్ వ్యవహారాలన్నీ పాండురంగారెడ్డి చూస్తుంటారని సమాచారం. ఈ క్రమంలోనే హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన 62 ఎకరాల భూమిలో 25 ఎకరాల 35 గుంటలను వెదిరె ఎస్టేట్స్ పేరుతో రిజిస్టర్ చేయించారు. తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు కాలు మోపడంతో ప్రశ్నించడానికి వెళితే.. ఎవరైనా ఇక్కడకు వచ్చి ఈ భామి మాదంటే కాల్చిపారేస్తామని పాండురంగాడ్డి బెదిరించారని ఉద్యోగులు వాపోతున్నారు. తనకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందని, ఈ భూమి గంటా శ్రీనివాసరావుదని ఆయన హెచ్చరించి పంపారని వారు చెబుతున్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.