కోల్‌ స్కాంలో దాసరి

 

dasari-జిందాల్ నుంచి రూ.2.25 కోట్ల లంచం
– కోల్‌బ్లాకుల కేటాయింపునకు ప్రతిఫలం
– సౌభాగ్య మీడియాలో పెట్టుబడుల రూపం
– రూ.28 షేరు.. 100కు కొనుగోలు
– తాజా చార్జిషీటులో సీబీఐ ఆరోపణ
-మాజీ మంత్రి, ఎంపీలపై కేసులు నమోదు
– జిందాల్, దాసరి కార్యాలయాల్లో తనిఖీలు
– చట్టం తన పని తాను చేసుకుపోతుంది:సీబీఐ చార్జిషీటుపై హోం మంత్రి షిండే
ఇప్పటికే అనేక ఆరోపణలతో తలకిందులవుతున్న యూపీఏకు మరో షాక్ తగిలింది. దేశాన్ని కుదిపివేస్తున్న బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ, పారిక్షిశామికవేత్త నవీన్‌జిందాల్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. బొగ్గు బ్లాకులు కేటాయించినందుకు ప్రతిఫలంగా జిందాల్ నుంచి దాసరికి రూ.2.25 కోట్లు ముడుపులు అందాయని ఆరోపించింది. వీరిద్దరూ మోసానికి, అక్రమార్జనకు, నేరపూరిత ప్రవర్తనకు పాల్పడ్డారని బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో సమర్పించిన 12వ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. దాసరి, నవీన్ జిందాల్‌తోపాటు.. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, జిందాల్‌కు చెందిన ఇతర కంపెనీలు జిందాల్ రియల్టీ, న్యూఢిల్లీ ఎగ్జిమ్, దాసరికి చెందిన సౌభాగ్య మీడియాపైనా సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఈ కేటాయింపులను క్లియర్ చేసిన స్క్రీనింగ్ కమిటీలోని గుర్తు తెలియని వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల్లోని గుర్తు తెలియని డైరెక్టర్లపైనా కేసులు నమోదు చేసింది. జిందాల్, దాసరికి చెందిన న్యూఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లోని 19 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ తన ఎనిమిది నెలల దర్యాప్తు కాలంలో ఒక మాజీ కేంద్ర మంత్రి స్థాయి నేతపై కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి. దాసరి నారాయణరావు బొగ్గుశాఖ సహాయ మంత్రిగా ఉన్న కాలంలో 2008లో జార్ఖండ్‌లోని బిర్భుమ్‌లోని అమరకొండ ముర్గండంగల్ బొగ్గు బ్లాకును నవీన్‌జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్‌లు దక్కించుకున్నాయని, ఈ కేటాయింపులో అవకతవకలు ఉన్నాయని సీబీఐ వర్గాలు తెలిపాయి.

భూమి, నీటి సరఫరా, గతంలో జరిగిన కేటాయింపులు.. ఈ మూడు విషయాల్లోనూ జిందాల్ కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని తెలిపాయి. జిందాల్ స్టీల్ అండ్‌పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) అప్పటికే కనీసం ఆరు బ్లాకులు పొంది ఉన్నప్పటికీ.. తమకు మూడు బ్లాకులే ఉన్నట్లు 2007లో కొత్త బ్లాకుల కోసం దరఖాస్తున్న చేసిన సమయంలో చెప్పిందని సీబీఐ వర్గాలు ఆరోపించాయి. ఒకే కంపెనీకి ఎక్కువ బ్లాకులు కేటాయిస్తే సదరు కంపెనీ ఈ రంగంలో గుత్తాధిపత్యం వహిస్తుందని భావించిన ప్రభుత్వం.. ఎక్కువబ్లాకులు ఇప్పటికే ఉన్న కంపెనీలకు కొత్త బ్లాకులు నిరాకరించింది. అయితే.. జిందాల్ కంపెనీ తప్పుడు సమాచారం ఇవ్వడంతో సదరు కంపెనీకి కొత్త బ్లాకులు కేటాయించేందుకు అవకాశం కలిగింది.

కానీ.. జేఎస్‌పీఎల్ ఇచ్చిన తప్పుడు సమాచారంలో ఆ కంపెనీకి కేటాయించిన బ్లాకులు 11కు చేరుకున్నాయి. జేఎస్‌పీఎల్‌కు ఒక బ్లాకు కేటాయించిన ఏడాదికే దాసరికి చెందిన సౌభాగ్య మీడియా షేర్లు గణనీయంగా పెరిగాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటిదాకా రూ.28 ఉన్న షేరును జిందాల్‌కు చెందిన న్యూఢిల్లీ ఎగ్జిమ్ కంపెనీ ఒకటి ఏకంగా రూ.100 చొప్పున కొనుగోలు చేసింది. ఈ మొత్తం షేర్ల కొనుగోలు విలువ 2.25 కోట్లు ఉంది. ఇదంతా అక్రమంగా దాసరి కంపెనీలోకి వచ్చిన సొమ్మేనని సీబీఐ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ ఎగ్జిమ్ సంస్థ ఖాతా పుస్తకాలు పరిశీలిస్తే ఈ సొమ్ము నికరమైనదేనని చెప్పేందుకుగాను జిందాల్ రియల్టీ నుంచి అప్పుగా తీసుకున్నట్లు.. ఆ సంస్థ గగన్ స్పాంజ్ ఐరన్ నుంచి దాని రుణంగా పొందినట్లు పేర్కొన్నారని తెలిసింది.

దీన్ని ధ్రువీకరించుకున్నాకే దాసరిపైనా, నవీన్ జిందాల్‌పైనా కేసులు నమోదు చేసినట్లు తెలిపాయి. కేసుల నమోదు నేపథ్యంలో జిందాల్‌కు చెందిన ఢిల్లీలోని 6-పృథ్వీరాజ్‌రోడ్ నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బికాజీ కామా ప్లేస్‌లోని ఆయన కార్యాలయం, కోల్‌కతాలోని ఆయన కార్యాలయం సహా పలు చోట్ల సోదాలు జరిపారు. సోదాలు జరిగిన సమయంలో జిందాల్ ఇంట్లో లేకపోవడంతో కొన్ని కప్‌బోర్డులు, గదులకు సీబీఐ అధికారులు తాళాలు వేశారు. జిందాల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో వాటిని తెరువనున్నారు. ఇక హైదరాబాద్‌లో దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. రాజ్యసభ మాజీ సభ్యుడైన దాసరి నారాయణరావు 2004-2006, 2006-2008 మధ్యకాలంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో ఒకసారి దాసరిని సీబీఐ ప్రశ్నించింది.

బొగ్గు కుంభకోణంలో విచారణను మరింత విస్తృతం చేయనున్న సీబీఐ.. త్వరలో కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వివాదం నెలకొన్న బొగ్గు గనుల కేటాయింపులు ఆయన పదవీకాలంలో జరిగినవే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. సీబీఐకి కేంద్రం నుంచి అనుమతి రాలేదు. బొగ్గు గనుల కేటాయింపుల స్క్రీనింగ్ కమిటీకి గుప్తా 2006 నుంచి 2009 వరకూ నేతృత్వం వహించారు.

ప్రస్తుతం గుప్తా కార్పొరేట్ వ్యవహారాల శాఖ పరిధిలో కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ సంస్థ అధిపతిగా ఉన్నారు. గుప్తాను ప్రశ్నించేందుకు అనుమతి నిరాకరించడం ప్రధాని మన్మోహన్‌ను రక్షించే ప్రయత్నమేనన్న వాదనలు ఉన్నాయి. దీంతో మరిన్ని ఆధారాలు సేకరించిన సీబీఐ.. మరోసారి ఆయనను ప్రశ్నించేందుకు ప్రభుత్వాన్ని అవకాశం కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

సీబీఐకి పూర్తిగా సహకరిస్తాం: జేఎస్‌పీఎల్ ప్రతినిధి
ఈ పరిణామంపై జేఎస్‌పీఎల్ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి మనూకపూర్ స్పందిస్తూ.. తమ సంస్థ చట్టబద్ధంగా పని చేసేదని అన్నారు. బలమైన నైతిక ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా పని చేస్తున్నదని చెప్పారు. బొగ్గుబ్లాకుల కేటాయింపుపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతున్నదని, ఈ సమయంలో సీబీఐకి పూర్తిగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది: షిండే
కాంగ్రెస్ ఎంపీ నవీన్‌జిందాల్, కేంద్ర మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ కేసుల నమోదు, వారి కార్యాలయాల్లో తనిఖీలపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తిరస్కరించారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మాత్రం చెప్పారు. ఈ అంశాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజ్‌బబ్బర్ అన్నారు. జిందాల్, దాసరిపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

దోషులపై కఠిన చర్యలు: జైస్వాల్
బొగ్గు కుంభకోణంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ చెప్పారు. 2003 నుంచి 2009 వరకూ వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తాము సీబీఐకి నివేదించినట్లు ఆయన తెలిపారు. వాటిని సీ బీఐ పరిశీలిస్తున్నదని, అక్రమాలకు పా ల్పడినవారిపైన, తప్పుడు ప్రకటనలు స్టే ట్‌మెంట్లు ఇచ్చినవారిపైన కఠిన చర్యలు తప్పవని ఒక వార్తా చానల్‌కు చెప్పారు.

12 కంపెనీలకు బొగ్గు శాఖ షోకాజ్ నోటీసులు
బొగ్గు గనుల విషయంలో పడకేసిన కంపెనీలపై తన యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే దిశగా బొగ్గుశాఖ సమాయత్తమవుతోంది. కేటాయించిన బొగ్గుబ్లాకులను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో జూన్ 30లోగా చెప్పాలని కోరుతూ ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్నవాటిలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, సెయిల్ సహా 12 కంపెనీలు ఉన్నాయి. నిర్ణీత తేదీలోగా సమాధానాలు రానిపక్షంలో సదరు కేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించింది. గతంలో ఇదే కారణంపై జేఎస్‌పీఎల్, మొన్నెట్ ఇస్పాత్, ఎన్టీపీసీ, జీవీకే పవర్ సహా 11 కంపెనీలకు గతవారం కేంద్ర బొగ్గు శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజా షోకాజ్ నోటీసులు జారీ అయిన కంపెనీల్లో టీవీఎన్‌ఎస్, దామోదర్‌వ్యాలీ కార్పొరేషన్, భూషణ్ స్టీల్ అండ్ పవర్, మధ్యవూపదేశ్, మహారాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్లు, పశ్చిమబెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితరాలు ఉన్నాయి.

దాసరి నివాసంలోసీబీఐ సోదాలు

-కూతురు ఇల్లు, సౌభాగ్య మీడియాలోనూ
-పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!
బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజా ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయ మంవూతి దాసరి నారాయణరావు నివాసంతోపాటు ఆయన కూతురు ఇల్లు, సౌభాగ్య మీడియా కార్యాలయంలో, ఫాంహౌజ్‌లో సీబీఐ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. బొగ్గు కేటాయింపుల్లో ..దాసరి అవకతవకలకు పాల్పడ్డారని, బ్లాకుల కేటాయింపునకు ప్రతిఫలంగా నవీన్‌జిందాల్ కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారని తాజాగా సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీ నుంచి సీబీఐ అధికారుల బృందాలు రెండు హైదరాబాద్ వచ్చాయి. స్థానిక సీబీఐ అధికారుల సహాయంతో జూబ్లీహిల్స్‌లోని దాసరి నివాసం, సౌభాగ్య మీడియా సంస్థ, మియాపూర్‌లోని ఆయన కూతురి ఇంటిలో సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మీడియా ప్రతినిధులు మాట్లాడటానికి ప్రయత్నించగా కేసు విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడించలేమని అధికారులు చెప్పారు. మొయినాబాద్‌లోని దాసరి ఫాంహౌస్‌లోనూ సీబీఐ సోదాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. మీడియా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే వేచి ఉన్నా.. సోదాలు జరిగిన వాతావరణం కనిపించలేదు.

వేలం పద్ధతికి దాసరి, సొరేన్ అడ్డుపుల్ల!
దాసరి 2004, మే 23 నుంచి 2008, ఏప్రిల్ 6 వరకు బొగ్గుశాఖ సహాయమంవూతిగా ఉన్నారు. ఆ తరువాత 2008, ఏప్రిల్ 7 నుంచి 2009, మే 29 వరకు రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోష్ బగ్రోడియా ఈ పదవిలో ఉన్నారు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన అమల్లో జాప్యం మొత్తం దాసరి హయాంలోనేనని కాగ్ తన నివేదికలో తేదీలవారీగా చెప్పింది. దాసరి పేరును నేరుగా ప్రస్తావించకుండా ‘బొగ్గు శాఖ సహాయ మంత్రి’ అని పేర్కొంది.

క్యాప్టివ్ విధానం వల్ల ప్రైవేట్ కంపెనీలకు ఎలా, ఎంత లబ్ధి కలుగుతుందో వివరిస్తూ అప్పటి బొగ్గుశాఖ కార్యదర్శి పరేఖ్.. దాసరికి 2004, జూలై 16న నివేదిక సమర్పించారు. అందులో వేలం ద్వారా బొగ్గు గనులను కేటాయించేందుకు సమగ్ర ప్రతిపాదనను సూచించారు. ఆ సమయంలో కేంద్ర బొగ్గుశాఖ మంత్రిగా శిబూ సోరెన్ ఉన్నారు. ఆ ప్రతిపాదన వాయిదాపడుతూ వచ్చింది. ఈ కాలంలోనే బొగ్గుశాఖ చేతులు మారుతూ వచ్చింది. హత్యకేసులో వారెంటు జారీ అయి సోరెన్ రాజీనామా చేయడంతో ప్రధాని చేతికి వచ్చిన బొగ్గుశాఖ.. ఆయన జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఆయన వద్దకే చేరింది. జార్ఖండ్ సీఎంగా సోరెన్ వెళ్లడంతో మళ్లీ ప్రధాని ఆధ్వర్యంలోకి చేరిన శాఖ.. ఆయన మెజార్టీ నిరూపించుకోలేక సీఎం పదవికి రాజీనామా చేసి, మళ్లీ బొగ్గుశాఖ అమాత్యుడయ్యారు.

ఈ కాలంలో వేలం ప్రతిపాదనపై పెద్దఎత్తున లేఖాయణం జరిగిందని కాగ్ తెలిపింది. ప్రతి సందర్భంలోనూ సోరెన్, దాసరి వేలం పద్ధతిని ప్రస్తుతానికి పక్కనపట్టాలంటూ నోట్‌లు రాశారని పేర్కొంది. వేలం పద్ధతిని అనుసరించేందుకు గాను మైన్స్ అండ్ మినరల్స్ చట్టాన్ని సవరించాలని కేంద్రం నిర్ణయించినప్పుడు కూడా దాసరి, సోరెన్‌లు అభ్యంతరం పెట్టారు. ఫలితంగానే మైన్స్ అండ్ మినరల్స్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో పె రెండేళ్లు పట్టింది. ఈలోపే కొన్ని సంస్థలకు పాత పద్ధతిలోనే గనుల కేటాయింపులు జరిగాయి. దీని వల్లనే ఇంతటి భారీ నష్టం జరిగిందని కాగ్ తేల్చింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.