కోడలు పనిమనిషి కాదు : సుప్రీం

కోడళ్లను రాచి రంపాన పెట్టే కుటుంబాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. తమ కొడుక్కు అర్ధాంగిగా వచ్చిన కోడలిని సొంత ఇంటి మనిషిలాగే చూడాలి తప్ప.. పనిమనిషిలా చూడొద్దని స్పష్టం చేసింది. ఏ సమయంలోనైనా సరే ఆమెను మెట్టినింటినుంచి పంపడానికి వీల్లేదని తెలిపింది. కోడళ్లను అత్తగారిళ్లలో హింసిస్తున్నారని, నిప్పంటించి తగులబెడుతున్నారని బుధవారం జస్టిస్ రాధాకృష్ణన్, దీపక్ మిశ్రాలతో కూడిన సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. చిత్ర హింసలు పెట్టిన కారణంగా గృహిణి ఆత్మహత్య చేసుకోవడంతో కింది కోర్టు ఆమె భర్తకు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘కోడలిని ఎట్టిపరిస్థితుల్లో కొత్త మనిషిగా చూడరాదు. ఆమెను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని మనసుకు హత్తుకోవాలి. పనిమనిషిలా కాదు.. కుటుంబసభ్యురాలిలా చూడాలి. చాలా ఇళ్లల్లో కట్టుకున్న భర్త, ఆడబిడ్డ, బంధువులు ఆమె పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ధర్మాసనం పేర్కొంది. కట్నంపేరిట వారిని వేధిస్తున్నారని, మానసికంగా, శారీరకంగా వారిని హింసిస్తూ, వారి కలలను తుడిచివేసి ఆఖరికి వారే స్వయంగా ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రవర్తిస్తున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని పేర్కొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.