కొశ్చన్ పేపరే కాదు.. కీ కూడా లీకైంది

మెడికల్ పీజీ ప్రవేశపరీక్ష స్కాంను సీఐడీ ఛేదించింది. ఈ కేసులో ఇద్దరు బ్రోకర్లు, ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రమే కాకుండా.. కీ పేపర్‌ను కూడా బ్రోకర్లు లీక్ చేయించారు. వాటితో కొందరు విద్యార్థులకు ఎర వేసి.. వారిని ముంబై తీసుకెళ్లి.. మూడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ ప్రాక్టీస్ చేయించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.75లక్షల నుంచి.. కోటిన్నర వరకూ వసూలు చేశారు.
scam
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ స్కాం వివరాలను సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ సీట్లను ఇప్పించే రెండు కన్సల్టెన్సీలు పీజీ ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశాయని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో కడప జిల్లా రాయచోటికి చెందిన కొమ్మూరి మునీశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయినాథ్ ప్రధాన పాత్రధారులని తెలిపారు. మునీశ్వర్‌రెడ్డి 2006లో హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో వర్టెక్స్ అనే కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీట్లు ఇప్పించటం ఇతడి బిజినెస్. ఇతడికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లో మంచి పరిచయాలున్నాయి. దీనిని అడ్డంపెట్టుకొని మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌లో మొదటి వందలోనే మెరిట్ ర్యాంక్ వచ్చేలా చేస్తానని చెప్పి విద్యార్థులకు వల వేశాడు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో కన్సల్టెన్సీ నడుపుతున్న సాయినాథ్‌ని కూడా ఈ వ్యవహారంలో కలుపుకున్నాడు. వీరి కన్సల్టెన్సీల ద్వారా ఉన్న పరిచయాలతో మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌కు ప్రిపేర్ అవుతున్న వంద మంది విద్యార్థులకు ఆశ చూపారు. హైదరాబాద్‌కు చెందిన భూషణ్‌రెడ్డి, ముంబయిలో కన్సల్టెన్సీ నడిపే అంజూ సింగ్, బెంగళూరుకు చెందిన సురేష్, బస్వరాజు, బీహార్‌కు చెందిన చౌహాన్‌లను కూడా ఈ స్కాంలో కలుపుకొన్నారు.

ఇలా పేపర్ లీక్…: బెంగళూరులో ప్రింట్ అయిన ప్రశ్నాపత్రాన్ని అక్కడే కన్సల్టెన్సీ నడుపుతున్న సురేష్ ద్వారా మునీశ్వర్, సాయినాథ్‌లు లీక్ చేయించారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాన్యానికి డబ్బు ఆశ చూపి ప్రశ్నాపత్రంతోపాటు కీ పేపర్‌ను కూడా తీసుకువచ్చారు. అయితే ఇదంతా ఫిబ్రవరి 25కు ముందే జరిగిందని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ చెప్పారు. నిందితులు తాము ఎంపిక చేసుకున్న విద్యార్థులకు ప్రశ్నాపత్రంపై ప్రత్యేకంగా శిక్షణ తరగుతులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వరకు ముంబైలోని గోరెగావ్‌లో శిక్షణ ఇచ్చారని కృష్ణప్రసాద్ తెలిపారు. ర్యాంక్ వచ్చేందుకు ష్యూరిటీగా కొన్ని బ్లాంక్ చెక్కులతో పాటు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఎంబీబీఎస్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా విద్యార్థుల నుంచి మునీశ్వర్, సాయినాథ్‌లు డిపాజిట్ చేసుకున్నారు.

ముఠా చాకచక్యం.. పేపర్ లీక్ చేసిన ఈ ముఠా చాకచక్యంగా వ్యవహరించింది. మెరిట్ ర్యాంక్‌లు సాధించవచ్చంటూ విద్యార్థులకు మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్ పదే పదే ఫోన్లు చేశారు. మునీశ్వర్‌రెడ్డి కొత్తగా నాలుగు సిమ్ కార్డులు కేవలం ఈ వ్యవహారం కోసమే తీసుకున్నాడు. 9030314444, 9980099968, 9030132828, 9030132121 అనే నంబర్ల నుంచి విద్యార్థులందరికీ ఫోన్లు చేశాడు. శిక్షణ క్లాస్‌ల కోసం విద్యార్థులను ముంబై తీసుకెళ్లగానే వారి ఫోన్లను ఈ ముఠా స్వాధీనం చేసుకుంది. శిక్షణ పూర్తయిన తర్వాత విమానం ఎక్కే ముందు ఎవరి సెల్‌ఫోన్లను వారికి ఇచ్చేశారు.

మెరిట్ కోసం కటకటాల్లోకి వెళ్లారు.. పీజీ సీటు కోసం ఆశపడి అక్రమమార్గాన్ని ఎంచుకున్న విద్యార్థులు కటకటాల పాలయ్యారు. కరీంనగర్‌కు చెందిన సీహెచ్ సాయిసుధ 2వ ర్యాంక్ పొందారు. ఇదే జిల్లాకు చెందిన బెరెల్లి శ్రీనివాస్, డీ శ్రావణి 3, 28వ ర్యాంక్ పొందారు. ఒంగోలుకు చెందిన బీ వెంకటేశ్వరరావు 45వర్యాంక్, కడపకు చెందిన జగదీప్ 12వ ర్యాంక్, గురివిరెడ్డి 8వ ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన ఏవీ ఆనంద్ 16వ ర్యాంక్, గుంటూరుకు చెందిన భీమేశ్వర్‌రావు 25వర్యాంక్ సాధించారు. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, లభించిన ఆధారాల ద్వారా వీరందరితో పాటు కన్సల్టెన్సీ నిర్వాహకులు మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్‌లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

కోటిన్నర వరకు..: మెడికల్ పీజీలో విద్యార్థులు ఎంచుకునే సబ్జెక్టును బట్టి మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్‌లు డబ్బులు డిమాండ్ చేశారు. రేడియాలజీ కోసం రూ.1.5 కోట్లు, పిడియాట్రిక్ పీజీ సీటు కోసం పరీక్ష రాస్తున్న విదార్థుల నుంచి రూ.70లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా ముందుగా కొంత డబ్బు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. 12వ ర్యాంక్ పొందిన జగదీప్ నుంచి రూ.10లక్షల నగదుతో పాటు 20 బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. ఏవీ ఆనంద్ నుంచి ఎంబీబీఎస్ ఒరిజినల్ పట్టా ష్యూరిటీగా తీసుకున్నారు. భీమేశ్వర్రావు నుంచి రూ.8లక్షలు ఎంబీబీఎస్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నారు. సాయిసుధ నుంచి రూ.35లక్షల నగదు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. బెరెల్లి శ్రీనివాస్ నుంచి రూ.25లక్షల నగదు, శ్రావణి నుంచి రూ.10లక్షల నగదు అడ్వాన్స్‌గా వసూలు చేశారు. ఒంగోలు వెంకటేశ్వర్రావు నుంచి రూ.10లక్షల నగదు, రూ.95 లక్షలకు పది బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు.

అతంటా బ్రాంచ్‌లు..: మునీశ్వర్‌రెడ్డికి బెంగళూరు, ముంబైల్లోనూ కన్సల్టెన్సీ ఏజెన్సీ బ్రాంచ్‌లున్నాయి. అక్కడ కూడా మెడిసిన్‌లో మెనేజ్‌మెంట్ సీట్లు ఇప్పించే బిజినెస్ చేస్తున్నాడు. ఇంజినీరింగ్, ఎరోనాటిక్స్.. ఇలా ప్రతి విభాగంలో మునీశ్వర్‌రెడ్డి పరిచయాలు పెంచుకొని భారీ స్థాయిలో డబ్బు వసూలు చేశాడు. కేవలం హైదరాబాద్‌లోనే మూడుసార్లు తన కన్సల్టెన్సీ ఆఫీస్‌ను మార్చాడు. ఇలాంటి మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఆఫీస్‌ను షిఫ్ట్ చేశాడని సీఐడీ చీఫ కృష్ణప్రసాద్ చెప్పారు.

కేసు పూర్తి కాలేదు..: కేవలం ఈ ఎనిమిది మంది అరెస్ట్‌తో ఈ కేసు పూర్తి కాలేదని సీఐడీ చీఫ్‌కృష్ణప్రసాద్ చెప్పారు. ఇంకా ఈ కేసులో చాలా అరెస్ట్‌లు జరగాల్సి ఉందని తెలిపారు. కొందరు నిందితులు వివిధ దేశాలకు పారిపోయారని, వారితోపాటు మరో 12మంది కన్సెల్టెన్సీల నిర్వాహకులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. యూనివర్సిటీలో కూడా మునీశ్వర్, సాయినాథ్‌లకు సహకరించిన వారిపై నిఘా పెట్టామని, వారిని ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించామని, సరైన ఆధారాలు లభించగానే వీరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. దర్యాప్తుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని తెలిపారు. పూర్తి విచారణ, అరెస్ట్‌ల తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని సీఐడీ కృష్ణప్రసాద్ చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.