కొట్టలేదు.. కొట్టదలచుకుంటే ఎవరూ ఉండరు: ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్

ఫిబ్రవరి 15 : రాష్ర్టాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్ర నేతలు చేస్తున్న డిమాండ్‌పై సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే సీమాంధ్ర నేతల్లారా ఖబడ్దార్.. యూటీ, గీటీ జాన్తా నై అని స్పష్టం చేశారు. ఎవరైనా మాకు వెన్నుపోటు పొడవాలని చూస్తే పోటుకు నాలుగు పోట్లు పడ్తాయని హెచ్చరించారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడం ఖాయమని, విద్యార్థులు, తెలంగాణ వాదులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఇక్కడ టీ జేఏసీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో అంజన్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటికే వేలాది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను సీమాంధ్రులు ఆగం పట్టించిన్రు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మీరు ఏమన్నా కొట్లాడుకోండి కానీ, మా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఒక్క హైదరాబాదీ వంద మందితో సమానం అని టీ బిల్లుకు ఆటంకం కలిగిస్తున్న సీమాంధ్ర నేతలను హెచ్చరించారు. మా తెలంగాణ ఉద్యమం నిజమైన ఉద్యమమని, మీ సీమాంధ్ర ఉద్యమం కాగజ్‌కా పూల్ (కాగితపు పువ్వు) లాంటిదని ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. మాటిమాటికీ హైదారాబాద్‌ను యూటీ చేయమంటారు?, హైదరాబాద్‌లో ఇతర రాష్ర్టాల ప్రజలు బతకడం లేదా? మీరు ఉండటానికి ఇబ్బంది ఏమిటి? మీకేం రోగం పుట్టింది అని ప్రశ్నించారు. మాది మీలాగా బాంబుల సంస్కతి కాదు.. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుంటామన్నారు. మేం ఇప్పటివరకు ఎవరినీ కొట్టలేదు.

ఒకవేళ కొట్టదలచుకుంటే ఎవ్వరూ ఉండరు. ఒక్క అవాజ్ చేస్తే ఢిల్లీలో మస్తుమంది జమైతరు. మేం ధమ్కీ ఇవ్వదల్చుకుంటే హైదరాబాద్‌లో ఎవరూ ఉండరు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటూ తెలంగాణ ప్రజలను దోఖా చేస్తున్నాడని ఆరోపించారు. ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయానికి సోనియాగాంధీ వచ్చారని, ఈ నెల 17న లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.