కైనీడల కింద కత్తులు మొలుస్తయ్!

మట్టి కంటి సూపుల మీద
మన్నుగప్పే రాజ్య ద్రోహం
ఇదొక అప్రకటిత యుద్ధం
బతుకిప్పుడు పొయిమీద కుండ
తుకతుక రగిలే మనాది
వాడి బొంద వాడే

తవ్వుకుంటున్న ఇగురం!
నాలుగోస్తంభాన్ని నిలువునా
కూల్చాలని కలగంటున్న ఏలిక
దుబ్బ సెల్కల మీద ఇది
పరాయి గాలిదుమారం

పెరడును కత్తుల కొయ్యలు చేసి
నిత్యగాయాల బహుమానాలు!
పత్తికాయ పగిలినట్టు
ఇక్కడ గుండెలు పగులుతున్నయి
పహారా కాస్తున్నందుకు
కంటిప్పల్ని కట్టడిచేసే భూతం
పొయికి ఒత్తుకుండ తోడైనట్టు

రక్తసంబంధాన్ని మించిన
పేగు బంధం ఇక్కడి మట్టిబంధం
దారులు కలిసిపోయినట్టు
ఇక్కడ మనుషులు కలిసిపోతరు
పుల్లలేర్కొచ్చి పిడికిల్ల అగ్గిరాజేస్తరు
గోడలు కట్టి అక్షరాల

ఎవడు మాత్రం ఆర్పగలడు!
దిక్కులు పిక్కటిల్లే గొంతుకలను
పిసికేయాలనుకుంటే..
కైనీడల కింద కత్తులు చిగురిస్తయ్

మట్టిపొరల్లో..
పోరాట విత్తనాలు మొలుస్తయి
రాబందుల కూల్చే కొత్తసిరా పుడ్తది
అక్షరాల్ని బహిష్కరించాలనుకుంటే
ఆయుధాలై లేస్తయ్
కలాల యుద్ధంలో నీ పతనం ఖాయం!!

-పసునూరి రవీందర్
(జర్నలిస్టులపై కక్షగట్టిన సర్కారు దుష్టనీతికి నిరసనగా)

This entry was posted in POEMS.

Comments are closed.