కేసీఆర్ ఆఫర్ నిజమే

– ధ్రువీకరించిన టీ కాంగ్రెస్ ఎంపీలు
– 28 తర్వాత ఆలోచిస్తామన్న మందా
తెలంగాణపై నాన్చుతున్న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసే పార్టీతో కలిసి ఉద్యమించాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునివ్వడంపై తెలంగాణ ఎంపీలు స్పందించారు. కేసీఆర్ టీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలపై ఆచి తూచి మాట్లాడారు. మధుయాష్కి తప్ప ఇతరులు కేసీఆర్ వాఖ్యలపై ఖండించకపోవడం గమనార్హం.

కేసీఆర్ ఆఫర్ ఆలోచిస్తా: మందా
తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానం కట్టుబడి ఉండకపోతే నేను ప్రజా ఉద్యమంతోనే ఉంటాను. అఖిల పక్షం ప్రకటన తర్వాత సోనియాతో భేటీ అయిన సందర్భంలో మేం ఇదే విషయం మాట్లాడుకున్నాం. నాటి హోం మంత్రి చిదంబరం ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో కనుమరుగవుతుంది. ఇదే విషయాన్ని సోనియాకు చెప్పాం. కేసీఆర్ పిలుపు గురించి చెప్పాలంటే తెలంగాణపై తేల్చకుంటే తెలంగాణ ప్రజాఉద్యమంతో కలిసి పనిచేస్తా. అఖిలపక్షంలో ఏమీ తేల్చకుంటే కేసీఆర్ ఆఫర్ పై ఆలోచిస్తా. ఇప్పుడే పార్టీని వీడే విషయం చర్చించడం సరికాదు.

వేచి చూద్దాం: వివేక్
తెలంగాణపై జరిగే అఖిలపక్షంలో పార్టీలన్నీ తమ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. కేసీఆర్ తన పార్టీలోకి నన్నే కాదు కాంగ్రెస్ ఎంపీలందరికీ ఆఫర్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ బలపడితే తెలంగాణ రాదు: యాష్కీ
రాష్ట్ర సాధన రాజకీయ పార్టీలు బలోపేతం కావడం వలన రాదు. పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుంది. మాకు తెలంగాణ ప్రయోజనమే మఖ్యం. రాజకీయ ప్రయోజనాలు కాదు.

టీడీపీ తెలంగాణకు జై కొట్టనుంది: పొన్నం
తెలంగాణపై ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మాట్లాడుతుందన్న విశ్వాసం ఉంది. డిసెంబరు 28నాటి భేటీలో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుందని నాకు తెలుసు. కాంగ్రెస్‌ను వీడే విషయంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఇది సమయం కాదు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.