కేసీఆర్ ఆఫర్‌పై కాంగ్రెస్‌లో మథనం

 

botsa
అధిష్ఠానం ఆదేశంతో రంగంలోకి దిగిన బొత్స
– మంత్రి జానా నివాసంలో కేకేతో భేటీ
– వివేక్ నివాసంలో ఎంపీల రహస్య సమావేశం
– టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చ
తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్‌లో చేరాలన్న ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చద్రశేఖర్‌రావు ఆఫర్‌పై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్ నేతలు సోమవారం ఇదే అంశంపై జోరుగా మంతనాలు సాగించారు. కేసీఆర్ ఆహ్వానంపై టీ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమలో తాము చర్చించుకున్నట్టు తెలిసింది. అధిష్ఠానం ఆదేశంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగి.. సీనియర్ నేతలతో మంతనాలు సాగించారు. రెండు రోజులు జిల్లాల పర్యటన ముగించుకొని పీసీసీ అధ్యక్షుడు బొత్స హైదరాబాద్‌కు వచ్చిరావడంతోనే టీ ఎంపీలను బుజ్జగించే ప్రయత్నం మొదలుపెట్టారు. మంత్రి జానాడ్డి నివాసానికి సీనియర్ నేత కే కేశవరావును పిలిపించుకుని చర్చలు జరిపారు. అంతుకుముందు ఉదయం ఎంపీ వివేక్ నివాసంలో టీ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్యతోపాటు పీసీసీ మాజీ చీఫ్ కేకే రహస్యంగా భేటీ అయ్యారు. తెలంగాణపై కాంగ్రెస్ అనుసరిస్తున్న నాన్చివేత ధోరణితో కొంతమంది టీ కాంగ్రెస్ ఎంపీలు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎంతగా చెప్పినా అధిష్ఠానం వినిపించుకోవడం లేదని వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారడం తప్ప మరో మార్గంలేదనే నిర్ణయానికి వచ్చారు. టీ కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం అధికార పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది. హైకమాండ్ తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసినందునే తాము పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని పీసీసీ చీఫ్ బొత్సతో భేటీలో కేకే తేగేసి చెప్పినట్లు తెలిసింది. ‘తెలంగాణలో ఏం జరుగుందో మీకు అంతా తెలుసు. ఇచ్చిన మాటను అమలు చేయాలనే కోరుతున్నాం. తెలంగాణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మేం పదవి అడగటంలేదు. మేం పార్టీ బాగు కోసమే పోరాటం చేస్తున్నాం. 12 ఏళ్లుగా తెలంగాణపై హైకమాండ్‌తో కొట్లాడుతున్నాం. ఇంకెంత కాలం వేచి చూడాలి. ఇంతకంటే ఇంకేమి చెప్పాలి’ అని బొత్సను కేకే నిలదీసినట్లు సమచారం. అందుకు బొత్స కూడా అంగీకరించినట్లు తెలిసింది.

తెలంగాణలో జరగుతున్న పరిణామాలన్ని మరోసారి హై కమాండ్ దృష్టికి తీసుకు కూడా చెప్పినట్లు సమాచారం. ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లి అన్ని విషయాలపై ఒక నివేదికను ఇవ్వనున్నట్లు బొత్స హామి ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి జానాడ్డి కూడా పరిస్థితి సీరియస్‌గా ఉందని వివరించినట్లు సమాచారం. కాగా ఉదయం వివేక్ నివాసంలో జరిగిన ఎంపీల భేటీలో టీఆర్‌ఎస్‌లో చేరికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణ శక్తులను కలుపుకుని ఫ్రంట్‌ను ఏర్పాటు చేద్దామనుకున్న టీ కాంగ్రెస్ నేతల సూచనను కేసీఆర్ తిరస్కరించడమే కాకండా పార్టీలో చేరడానికి ఈ నెల 27 డెడ్‌లైన్ పెట్టినట్లు కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఎంపీ మందా జగన్నాథం దాదాపు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేకే కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. వరంగల్ ఎంపీ రాజయ్య కూడా ఇదే బాటలో సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వివేక్ ముందుగా ఓకే చెప్పినప్పటికీ కొంత ఊగిసలాటను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా తొలుత పార్టీని వీడెందుకు సుముఖంగా లేకపోయినప్పటికీ.. సోమవారం మిగతా ఎంపీలు నచ్చజెప్పడంతో కొంత మెత్తబడినట్లు తెలిసింది. ప్రజావూపతినిధిగా ఉంటేనే ప్రజల్లో గౌరవం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేస్తే గెలిచే పరిస్థితి లేదనే విషయాన్ని కేకేతోపాటు మందా జగన్నాథం కూడా నచ్చజెప్పడంతో కాస్త మెత్తబడినట్లు సమచారం. కాగా పార్లమెంట్ సమావేశాల వరకు వేచి చూద్దామనే ధోరణిపై చర్చించినట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతను ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పినట్లు తెలిసింది.

ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చా: బొత్స
గత రెండు రోజులుగా తాను హైదరాబాద్‌లో లేనని, ఎంపీలు పార్టీ మారుతారనే ప్రచారం మీడియా ద్వారానే చూశానని పీసీసీ చీఫ్ బొత్స తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ జరుగుతుందో తెలుసుకునేందుకు స్వయంగా వచ్చినట్లు చెప్పారు. టీ ఎంపీలు మెత్తబడ్డారా? అని మీడియా ప్రశ్నించగా.. గట్టిగా ఉంటేగా మెత్తబడటానికి అని దాటవేశారు.

తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమే: కేకే
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కేకే మరోసారి స్పష్టం చేశారు. తాము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, మమ్మల్ని ఎవరూ మార్చలేరని ఆయన పేర్కొన్నారు. మంత్రి జానా నివాసంలో బొత్సతో భేటీ అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, నన్ను మెత్త పర్చడం ఎవరితరం కాదు’ అని స్పష్టంచేశారు. తాను జహీరాబాద్ లేదా సికింవూదాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల నుంచి ఎంపీగా పోటి చేస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ప్రజల ఆకాంక్ష మేరకే నడుచుకుంటానని వరంగల్ ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు. సోమవారం ఎంపీ వివేక్ నివాసంలో భేటీ అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలను కలుపుకుని సమావేశాలను అడ్డుకుంటామని, అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.