కేసీఆర్ అంటే ఏమిటో చూపిస్తా!

బయ్యారం గనుల కేటాయింపు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “బయ్యారం గనులు తెలంగాణకు దక్కకపోతే భూకంపం సృష్టిస్తానని నేనంటే.. ఏదీ సృష్టించు చూద్దామని అంటాడా? భూకంపం సృష్టిస్తే, ఆపే సత్తా ఉందని చెబుతాడా? కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నాడు? నేనంటే ఏంటో చూపిస్తా” అని అన్నారు. కేసీఆర్‌ సీఎంపై నిప్పులు చెరిగారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ దెబ్బ ఏంటో కిరణ్‌కుమార్‌రెడ్డికి రుచి చూపించాలన్నారు. ఈ మేరకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. తాము డిమాండ్ చేసినట్లుగా ఈ మూడు జిల్లాల్లోని ఇనుప ఖనిజం నిల్వలను ఎక్కడికీ తరలించకుండా నిరోధించాలనీ, వరంగల్ లేదా ఖమ్మం జిల్లాలో లేదా రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు ఆందోళనలు చేపట్టాలనీ నిర్ణయించారు. తద్వారా సీఎం కిరణ్‌కు కునుకు లేకుండా చేయాలన్న కేసీఆర్.. ఆందోళనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణను సిద్ధం చేయాలని పార్టీ నేతలను నిర్దేశించారు. బయ్యారం గనుల్లో లభ్యమయ్యే ఇనుప ఖనిజం నాణ్యతపై సందేహాల నివృత్తి, ఒకవేళ అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను సింగరేణి యాజమాన్యానికి అప్పగిస్తే నిర్వహణ సామర్థ్యం ఏ మేరకు ఉంటుందనే అంశాలపై చర్చించటానికి కేసీఆర్ కోల్ ఇండియా చైర్మన్ నర్సింగరావుతో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ఈనెల 15 నుంచి జూన్ 5 వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీల బాధ్యులకు రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రతి రోజు ఆరు చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో శిబిరాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా అనుకొన్నారు. కాగా.. కేసీఆర్‌ను తిడితే కాంగ్రెస్‌కు సీమాంధ్రలో ప్లస్ పాయింట్ అవుతుందనే సీఎం టీఆర్ఎస్ అధినేతపై అంతగా నోరు చేసుకొన్నారని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.