కేసీఆర్‌తోనే తెలంగాణకు రాజకీయ గుర్తింపు: కోదండరాం

కేసీఆర్‌తోనే తెలంగాణకు రాజకీయ గుర్తింపు: కోదండరాం
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సమస్యకు రాజకీయ గుర్తింపు వచ్చిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన దీక్షే ప్రజలను కదనరంగంలో సైనికులుగా మార్చిందని చెప్పారు. కేసీఆర్ దీక్ష తరువాత జరిగిన అనేక పరిణామాల వల్లే నేడు తెలంగాణ సాకారం అవుతోందని అన్నారు. కేసీఆర్ దీక్షతో మళ్లీ తెలంగాణ ఉద్యమ కదనరంగంలోకి దిగిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ఉద్యమం చేపట్టిన తరువాత తెలంగాణ అంటే టీఆర్‌ఎస్ అనే స్థాయికి చేరిందని అన్నారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ముల్కీ రూల్స్ నుండి మొదలైతే, మలిదశ పోరాటం 14ఎఫ్ నుండి ప్రారంభమైందన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే 14ఎఫ్ రద్దయిందని, తెలంగాణ రాష్ట్రం సాకారం అవుతోందని అన్నారు. తెలంగాణ రాదనే ధీమాతోనే జగన్, చంద్రబాబు తెలంగాణ అనుకూల లేఖలిచ్చారని అన్నారు.

bomma

తెలంగాణ సమాజం సంపూర్ణ తెలంగాణను మాత్రమే ఒప్పుకుంటుంది తప్ప మరేదీ అంగీకరించదని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. తెలంగాణపై పునరంకితం అయ్యేందుకే కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నవంబర్ 29న దీక్షాదివస్‌గా జరుపుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పునర్నినిర్మాణంలో మరిన్ని త్యాగాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్ చేసిన దీక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.
అనంతరం నాయకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీక్షలో కూర్చున్న నాయకులకు కేకే పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో కఠోరదీక్ష చేసిన కేసీఆర్ వల్లే తెలంగాణ సాకారం అవుతోందని అన్నారు. జీవోఎం త్వరగా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేస్తుండడం చూసి చంద్రబాబు, జగన్, కిరణ్ ఇంత తొందందుకంటున్నారని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందనే భావన ప్రజల్లో ఉందని వారు గుర్తించాలన్నారు.

టీఆర్‌ఎస్ విలీనం కావొద్దంటున్నారు: కేటీఆర్
పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసి 14వ ఏట పట్టాభిశక్తులయ్యారని, నేడు టీఆర్‌ఎస్ కూడా 13 యేళ్ల అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకోబోతోందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. 4వ తేదీన జరిగే కేబినెట్‌లో బిల్లు వస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ ఏ పార్టీలోనూ కలవొద్దని తెలంగాణలోని 99శాతం మంది కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌తోనే పునర్నిర్మాణం సాధ్యమవుతుందనే భావన ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇచ్చిన వాగ్దానాలు, హామీలను అమలు చేస్తామని అన్నారు. 2009 ఎన్నికల్లో 10 సీట్లే గెలిచినప్పుడు వైఎస్ ఆనాడు ఈటెల రాజేందర్‌ను తల ఎక్కడ పెట్టుకుంటావన్నాడని, కానీ నేడు టీఆర్‌ఎస్ పార్టీ ఫీనిక్స్‌బర్డ్‌లా లేచిందని, దీనికి కేసీఆరే కారణమన్నారు. కేంద్రం రాజకీయ అనివార్యత వల్లే తెలంగాణ ఇస్తోందని అన్నారు. కిరణ్, జగన్, చంద్రబాబు తమ వికృత నైజాన్ని వీడటం లేదని విమర్శించారు. నాలుగు నిమిషాలు కూడా తెలుగు మాట్లాడలేని సీఎం కిరణ్ తెలుగుజాతి ఐక్యత అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని నల్గొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందుంచకుండా, పరివాహక ప్రాంతంలోలేని రాయలసీమ ప్రాజెక్టులను చూ పారని అందువల్లే నేడు నష్టం జరుగుతోందన్నారు.
ktr
ప్రస్తుతం సుప్రీంలో స్టే ఉందని, స్టే ఎత్తివేసే వరకు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు కనుక త్వరలో రాబోయే తెలంగాణలో నష్టం జరగకుండా చూస్తామన్నారు. బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు రూ.5-10లక్షల నష్టపరిహారంతో పాటు, వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ 10 జిల్లాల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో దోస్తీకి సిద్ధమని, లేకుంటే కుస్తీకి తయారని అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామని, అదే సమయంలో 10 జిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే తమకు కావాలని అన్నారు. లేకుంటే 1969 కంటే గొప్ప పోరాటాన్ని చూపిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ వల్లే తెలంగాణ ఏకతాటిపైకి
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ కేసీఆర్ సాధించిన గొప్ప పోరాటం వల్లే నేడు యావత్తు తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చిందని, ఇదే స్ఫూర్తితో సంపూర్ణ తెలంగాణ సాధించుకుందామన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దీక్షతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమంలోకి కదిలివచ్చారని చెప్పారు. దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి కదిలివచ్చాక నేను తెలంగాణ వాడిని అని చెప్పుకునే ధైర్యం వచ్చిందని అన్నారు. కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కృషి మరువలేనిదన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కేసీఆర్ వల్లే తెలంగాణ జాతిమొత్తం ఏకతాటిపైకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్, విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్ ఆలీ, గ్రేటర్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు ఎర్రొళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, బొంతు రామ్మోహన్, సూదగాని వెంకటేష్, బాబా ఫసియోద్దీన్, గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు. జేఏసీ నేతలు ఎల్లన్న, దానకర్ణచారి, అడ్వకేట్ జేఏసీ నేతలు ఉపేందర్, గోవర్ధన్‌రెడ్డి, టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడారు.
కేసీఆర్ పోస్టర్‌కు పాలాభిషేకం
కేసీఆర్ దీక్ష చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన చిత్రపటానికి టీఆర్‌ఎస్ నేత జీవన్‌సింగ్ ఆధ్వర్యంలో 500లీటర్ల పాలతో అభిషేకం చేశారు. భారీ సైజులో ఏర్పాటు చేసిన కేసీఆర్ చిత్రపటం ఇందిరాపార్క్‌లో హైలెట్‌గా నిలిచింది. దీక్షాదివస్ కార్యక్రమంలో భాగంగా కళాకారుడు సాయిచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో చివరగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు అవిశ్రాంత పోరాటంతో పాటు, తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటామని అక్కడున్న తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ కేడర్‌తో ప్రతిజ్ఞ చేయించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.