కేటాయింపులకు, ఖర్చులకు పొంతనేది?

 

XDFDH– బడ్జెట్ రూపకల్పనలో లోపాలు.. లోపభూయిష్టంగా ఆర్థిక నిర్వహణ
– విద్య, వైద్యరంగాలకు అరకొర నిధులు.. సామాజిక రంగాలకు నిధుల కేటాయింపులో వివక్ష
– ఏళ్ళ తరబడి అడ్వాన్సులు పెండింగ్.. ఎఫ్‌ఆర్‌బీఎంకు తూట్లు పడుతున్నాయి
– రుణాల రికవరీలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం.. 2011-12 వార్షిక బడ్జెట్‌పై కాగ్ అక్షింతలు
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో జరిపిన బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతి రూపాయిలో ఆరో వంతు మిగిలిపోతున్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఎత్తిచూపింది. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో గతంలో మాదిరిగానే అనేక లోపాలున్నాయని తప్పుపట్టింది. 2010-11 బడ్జెట్‌లో ఉన్న లోపాలను ఎత్తిచూపినప్పటికీ మళ్ళీ మళ్ళీ అవే తప్పులతో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపొందిస్తున్నదని ఆక్షేపించింది. పలు ప్రభుత్వ శాఖలు కనీస నియమాలు పాటించడంలేదని పేర్కొంది. ప్రధానంగా పద్దుల సంకలనం, ఆడిట్‌కు పద్దులను సమర్పించడం, వివిధ సామాజిక-ఆర్థిక అభివృద్ధి పథకాల అమలుకు ఇచ్చిన నిధుల వినియోగంపై నివేదికలను సమర్పించడంలో ప్రభుత్వ శాఖలు నియమ నిబంధనలను పాటించడంలేదని పేర్కొంది.

2012 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శాసనసభకు మంగళవారం కాగ్ తన నివేదికను సమర్పించింది. ఆర్థికశాఖ పనితీరును, ప్రభుత్వశాఖల్లో అంతర్గత తనిఖీ (ఇంటర్నల్ ఆడిట్) లోపాలను నివేదిక ఎత్తిచూపింది. బడ్జెట్ రూపకల్పనలో యథావిధిగా తప్పులు కొనసాగాయని తేల్చింది. బడ్జెట్ అంచనాల్లో లోపాలు, వర్గీకరణ దోషాలు కొనసాగాయని, నిర్దిష్టమైన ప్రయోజనానికి కేటాయిస్తున్నట్లుగా స్పష్టత లేకుండా గంపగుత్తగా కేటాయింపులు చేయడం, కేటాయింపులకు మించి ఖర్చు చేయడం, కొన్ని పద్దుల్లో కేటాయింపులు లేకుండానే ఖర్చు చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం ఆస్కారం కలిగించిందని తెలిపింది. అవసరానికి మించి నిధులను డ్రా చేయడం, సరైన వివరణలు లేకుండానే రీ-ఆప్రాప్రియేషన్లను చేయడం, బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకున్నా విపరీతంగా ఖర్చు చేయడం ద్వారా పలు ప్రభుత్వ శాఖలు ఆర్థిక నియమాలను ఉల్లంఘించాయని కాగ్ అభిశంసించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, నివేదనలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని, ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వసంస్థలు సకాలంలో పద్దులను సంకలనం చేయడం, ఏసీ బిల్లులపై డ్రా చేసిన నిధులకు డీసీ బిల్లులను సమర్పించి, ఆ అడ్వాన్సులను సర్దుబాటు చేయడం, మైనర్ హెడ్ స్థాయి వరకు ఖర్చుల వర్గీకరణను సరిగా చేయడం వంటి అంశాలను మరింత కట్టుదిట్టంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాగ్ నిర్దేశించింది. పీడీ అకౌంటర్ల విధానాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. నియమాలను కచ్చితంగా పాటించి, పీడీ అకౌంట్లను పూర్తి పారదర్శకతతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. కొన్ని గ్రాంట్ల కింద ప్రతియేటా మిగుళ్ళు ఏర్పడడం, మరికొన్ని గ్రాంట్ల కింద రూ.500కోట్లకు పైగా, బడ్జెట్ కేటాయింపుల్లో 20 శాతానికి మించి భారీ మిగుళ్ళు ఏర్పడటం జరుగుతున్నదని, దీంతో బడ్జెట్ అంచనాల్లో కచ్చితత్వం లేకుండా పోతోందని పేర్కొంది. రుణాల పద్దు కింద రూ.3,732కోట్ల ప్రతికూల నిల్వలు ఏర్పడి ఆర్థిక పద్దులలో రాష్ట్ర రెవెన్యూ వ్యయాన్ని తక్కువగా చూపుతున్నారని, దీని వల్ల రాష్ట్ర ద్రవ్య సూచికలపై ప్రభావం పడిందని కాగ్ నివేదిక తెలిపింది.

సాగునీరు, రహదారుల రంగాల్లోని క్యాపిటల్ పనులు లేదా ప్రాజెక్టులను నిర్ణీతకాలంలో పూర్తి చేయకపోవడంతో ఆశించిన ప్రయోజనాలు ఒనగూరకపోగా, ఈ ప్రాజెక్టులపై ఖర్చు పెరుగుతోందని పేర్కొంది. అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టుల వల్ల ప్రతిఫలం రాని పెట్టుబడిగా ఉండిపోయిందని, 2012 మార్చి 31 నాటికి మొత్తం ఖర్చు రూ.49,516 కోట్లు చూపారని తెలిపింది. అంతకు ముందు సంవత్సరానికికంటే అది దాదాపు రూ.3వేల కోట్లు అధికమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2011-12 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, కేటాయించిన నిధులు నిర్దేశిత ప్రయోజనానికి వినియోగం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కాగ్ అభిప్రాయపడింది. నిర్దేశిత సామాజికరంగ కార్యకలాపాల కోసం కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం, కొన్నింటికి అసలే విడుదల చేయకపోవడం వల్ల ఏ లక్ష్యాల కోసం నిధులను కేటాయించారో ఆ లక్ష్యం నెరవేరలేదని కాగ్ పేర్కొంది.

విద్యారంగంపై రాష్ట్ర వ్యయం (13.0%) జనరల్ కేటగిరి స్టేట్స్(17.1%) కంటే చాలా తక్కువగా ఉందని, సామాజికరంగంపై క్యాపిటల్ వ్యయం కూడా తక్కువగానే ఉందని తెలిపింది. సామాజికరంగానికి సంబందించిన ఖర్చుల విషయంలో ప్రభుత్వం తన ప్రాథమ్యాలను సమీక్షించుకుని ఆమోదించిన మేరకు నిధులు విడుదల అయ్యేలా, మంజూరు చేసిన ప్రయోజనానికే ఆ నిధులు ఖర్చు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అంతేకాకుండా విద్య, ఆరోగ్యరంగాలకు అధిక ద్రవ్య ప్రాథమ్యాన్ని ఇవ్వాలని, పెరుగుతున్న అప్పులకు దన్నుగా సంపదను సృష్టించుకునేలా క్యాపిటల్ వ్యయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కాగ్ సూచించింది. పింఛను నిధి, కాంట్రిబ్యూటరీ పింఛను పథకంలో తన వాటా మొత్తాన్ని ఫండ్ మేనేజర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా, ప్రభుత్వం అలా బదిలీ చేయకపోవడం వల్ల వాటి బకాయి రూ.94కోట్లకు చేరింది. వాస్తవానికి ఉద్యోగులు తమ వాటాగా చెల్లించిన మొత్తంతో పోలిస్తే, ప్రభుత్వం ఈ ఏడాది రూ.100కోట్లను తక్కువగా కేటాయించింది.

ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులపై ప్రతిఫలం గతంలో మాదిరిగానే స్వల్పంగా ఉందని కాగ్ తేల్చింది. ప్రభుత్వం తీసుకున్న రుణాలపై 2011-12లో 7.40% వడ్డీ రేటు చెల్లించగా, ప్రభుత్వ పెట్టుబడులపై ఈ ఏడాది వచ్చిన సగటు ప్రతిఫలం రేటు 0.5% మాత్రమేనని పేర్కొంది. అయితే ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లలలో చాలా వాటికి వార్షిక పద్దులు ఖరారు కాలేదని వెల్లడించింది. పదకొండు సంస్థలకు సంబంధించిన పద్దులు ఖరారైన ఏడాది వరకు రూ.5,979కోట్లు నష్టాలు పేరుకుపోయాయని తెలిపింది. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ రూ.3,554కోట్ల నష్టాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) రూ.1,94కోట్ల నష్టాలతో జాబితాలో ముందువరుసలో ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చిన రుణాలు రూ.4,93కోట్లు అయితే వసూలు చేసింది కేవలం రూ.164కోట్లు మాత్రమేనని, లోన్ల రికవరీ స్థాయి చాలా అత్యల్పంగా ఉందని, ఇంకా రూ.17,337కోట్లు రికవరీల కింద ప్రభుత్వం రాబట్టుకోవాల్సి ఉన్నా ఇప్పటికీ వాటికి సంబంధించిన ధృవీకరణలు రాలేదని కాగ్ పేర్కొంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.