కేంద్ర పథకాల్లోనూ కోత!

-తెలంగాణపై కొనసాగుతున్న వివక్ష

– ఐజీఎంఎస్‌వై నిధుల విడుదలలో అన్యాయం
– పైలట్ ప్రాజెక్టులో గర్భిణులు, బాలింతలకు అందని సాయం
– ప.గో.కు రూ.24 కోట్లు.. నల్లగొండకు రూ.9.96 కోట్లే
– అర్హులు ఎక్కువగా ఉన్నప్పటికీ నిధులు తక్కువే

సాగునీటి ప్రాజెక్టయినా, సంక్షేమ పథకమైనా సీమాంధ్ర సర్కారులో తెలంగాణకు అన్యాయం జరగడమనేది జగమెరిగిన సత్యం. కేంద్రం అమలు చేసే పథకాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతోంది. కేంద్రం సహకారంతో ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినా తేడా కనిపిస్తోంది. కొన్ని పథకాలకు జిల్లాలను ఎంపిక చేసినా, ఎన్ని నిధులు కేటాయించాలనే విషయంలో బ్లూ ప్రింట్ రూపొందించినా వివక్ష వేయి పడగలు విప్పుతుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న షుగర్, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులపై అధ్యయనం, రోగులకు చికిత్స అందించే ఉద్దేశంతో ఇటీవలే నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ ఆండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ డీసీస్ ఆండ్ స్ట్రోక్ (ఎన్‌పీసీడీసీఎస్) పైలట్ అమలు చేస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలే ఎంపికయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక్క జిల్లా లేదు. తాజా గా ఆ వరుసలోనే ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన పథకం(ఐజీఎంఎస్‌వై) చేరింది.

మూడు విడతల్లో సాయం
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన పథకం(ఐజీఎంఎస్‌వై) 2010 లో కేంద్రం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో రెండు జిల్లాలు (పశ్చిమగోదావరి, నల్లగొండ) ఎంపికయ్యాయి. ఈ పథకంలో 19 ఏళ్లు నిండిన నిరుపేద గర్భిణులు, బాలింతల ఆరోగ్య పోషణస్థితి పెంపొందించడం, ఆరోగ్య సంరక్షణ కోసం మూడు విడతల్లో రూ.4 వేలు ఆర్థిక సాయమందిస్తారు. నాలుగో నెల గర్భవతిగా ఉన్నప్పుడు మొదటి విడతలో రూ.1500, శిశువు మూడు నెలల వయసులో ఉన్నప్పుడు రెండో విడతలో రూ.1500, మూడో విడత నిధులు రూ శిశువు ఆరో నెలకు చేరుకోగానే అందిస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళల మొదటి రెండు కాన్పులకు ఈ పథకం వర్తిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రంలో, ఏఎన్‌ఎం వద్ద గర్భిణులు నమోదు చేసుకుని, తల్లి బిడ్డల సంరక్షణకార్డు తీసుకోవాల్సి ఉంటుంది.

పశ్చిమ గోదావరికి నిధుల వరద
ఈ పథకంలో కేంద్రం నుంచి సక్రమంగా నిధులు విడుదల కావటం లేదు. విడుదలైన వాటిలో పశ్చిమగోదావరికే ఎక్కువ నిధులు అందుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు 2010-13 కాలంలో రూ.24 కోట్లు విడుదలయ్యా యి. 2010-13 వరకు తొలివిడత కింద 53,597 మంది గర్భిణులకు, రెండో విడతలో 49,425 మంది, మూడో విడతలో 52,559 మంది బాలింతలకు సాయం అందించారు. నల్లగొండ జిల్లాకు 2010-13 ఆర్థిక సంవత్సరంలో రూ.9.96 కోట్ల నిధులు వచ్చాయి. 2010-13 వరకు జిల్లాలో 1,42,148 మంది గర్భిణులను అర్హులుగా గుర్తించారు. వీరిలో 2010-11లో 35,262 మందికి మాత్రమే తొలి, రెండో విడత సాయమందింది. తొలి ఏడాది ఎంపిక చేసిన వారిలోనే 5,738 మంది గర్భిణులతోపాటు రెండో, మూడో ఏడాదిలో ఎంపిక చేసిన 1,01,148 మందికి ఒక్క విడత సాయమూ అందలేదు. ఈ పథకం కింద అర్హత సాధించిన 1,06,886 మంది గర్భిణులకు సాయం అందలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాకు మరో రూ.29 కోట్లు విడుదల చేస్తేనే అందరికీ సాయం అందే పరిస్థితి ఉంది. పశ్చిమగోదావరి జిల్లాకు మాత్రం కేలం రూ.9 కోట్లు విడుదల చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు పశ్చిమగోదావరికి రూ.24 కోట్లకు పైగా మంజూరవగా.. నల్లగొండ జిల్లాకు రూ.9.96 కోట్లు మాత్రమే విడుదలవడం తెలంగాణపై వివక్షను తేటతెల్లం చేస్తోంది.

నిధుల కోసం నిరీక్షణ
జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపే సమయంలో తక్కువ మంది జాబితా పంపారని, అందుకే నిధులు రావటం లేద ని ఉన్నతాధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. వాస్తవానికి నల్లగొండ జిల్లా నుంచి 2010 లోనే 55 వేల మంది గర్భిణులను గుర్తించి ప్రతిపాదనలు పంప గా.. 41వేల మందిని అర్హుల జాబితాలో తీసుకున్నారు. తర్వాత రెండేళ్లలో 1.01 లక్షల మంది గర్భిణులను ఎంపిక చేశారు.

వాస్తవానికి మూడు విడతల్లో రావాల్సిన నిధులు సక్రమంగా రాకపోగా.. గర్భిణుల సంఖ్యలో కూడా కోత పెడుతున్నారు. సీమాంధ్ర ప్రజావూపతినిధులు, ఉన్నతాధికారులు కుట్ర పన్నారనే విమర్శలున్నాయి. వాస్తవ గణాంకాలను కేంద్రానికి పంపితే రాష్ట్రానికి కేటాయించే నిధుల్లో నల్లగొండకే ఎక్కువ వాటా దక్కుతుంది. దీనికి గండికొట్టి పశ్చిమగోదావరి జిల్లాకు లబ్ధి చేకూర్చేందుకే సీమాంధ్ర ప్రజావూపతినిధులు, ఉన్నతాధికారులు చక్రం తిప్పారని ఆరోపణలున్నాయి. ఈ వివక్షపై తెలంగాణ ప్రజావూపతినిధులు ప్రశ్నించడం లేదు. పైగా ఈ విధంగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులకు మోకాలడ్డుతున్నారనే విషయాన్ని కూడా గుర్తించకపోవడంపై ప్రజలు గుర్రుమంటున్నారు. ఇప్పటికైనా ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.