హైదరాబాద్: తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించినందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నోట్‌ను ఆమోదించి అధికారికంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినందుకు కేబినెట్‌కు ధన్యావాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అన్ని వర్గాల వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే కీలక ప్రక్రియ ఇంకా మిగిలే ఉందని తెలిపారు. షరతులు, ఆంక్షలులేని తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అమరవీరులకు శాంతి కలగాలంటే వచ్చే శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు.
సమస్యలపై చర్చకు అనేక వేదికలున్నాయి: కేటీఆర్
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేటీఆర్ తెలిపారు. సీమాంధ్రులకు ఏవైనా సమస్యలుంటే వాటిపై చర్చించేందుకు అనేక వేదికలున్నాయిని స్పష్టం చేశారు. సమస్యలపై చర్చించుకుందామని వివరించారు. సమ్మె చేస్తూ సీమాంధ్ర ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఏపీఎన్జీవోలకు తగదని హితవు పలికారు.