కూడంకుళంకు సుప్రీం పచ్చజెండా

 

Kudamkulam
అణు విద్యుత్ దేశానికి చాలా అవసరం
– విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం
– ప్రజా భద్రతకు భరోసా ఉంది
– సుప్రీంకోర్టు స్పష్టీకరణ
తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కర్మాగారం ప్రారంభానికి సమస్యలు తొలిగాయి. సుప్రీంకోర్టు ప్లాంటును కొనసాగించేందుకు సోమవారం అనుమతినిచ్చింది. భద్రతకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్లాంటు సురక్షితమేనని సంతృప్తిని వ్యక్తం చేసింది. 17 భద్రతా చర్యల్లో ఇప్పటికే 12 అమలు చేశారని, మిగితావి కూడా త్వరలోనే అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించింది. ఈ ప్లాంటు ద్వారా పెద్ద మొత్తంలో ప్రయోజనాలు చేకూరుతాయని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటుచేసిన ప్రాజెక్టు అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అభివూపాయపడింది. దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు అణువిద్యుత్ కూడా చాలా అవసరమని తీర్పులో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించినట్లుగానీ, పర్యావరణానికి నష్టం జరిగే అవకాశం ఉందనిగానీ ఇప్పటివరకు ఈ ప్లాంటుపై ఏర్పాటుచేసిన కమిటీల నివేదికలేవి పేర్కొనలేదని స్పష్టం చేసింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అణువిద్యుత్ చాలా అవసరమని, ఇతర విద్యుత్‌లతో పోలిస్తే అణు విద్యుత్ చౌకని పేర్కొంది.

విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్లాంటు ప్రారంభానికి అనుమతినిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్లాంటు ప్రారంభానికి 15 మార్గదర్శకాలను వెలువరించింది. రష్యా సహకారంతో తమిళనాడులోని కూడంకుళం వద్ద వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంతో అణువిద్యుత్ ప్లాంటును ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీంట్లో అణు ఇంధన కడ్డీలను నింపే పనులు కూడా మొదలుపెట్టారు. కానీ ప్లాంటు చుట్టుపక్కల ఉండే వారికి భద్రత అంశాలపై పూర్తి భరోసా ఇవ్వలేదని, భవిష్యత్‌లో జరిగే నష్ట నివారణ చర్యలపై తేల్చలేదని, ఇంధనాన్ని నింపకుండా స్టే ఇవ్వాలంటూ పీపుల్ మూమెంట్ ఎగైనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ(పీఎంఏఎన్‌ఈ) సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్టే కు నిరాకరించి భద్రత అంశాలను పరిశీలించేందుకు అంగీకరించింది. కేంద్రం అందుకు సంబంధిత పత్రాలను కోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా ఈ విషయాలపై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. సోమవారం నాటి తీర్పులో పర్యావరణం, ప్రజా భద్రత అంశాలను అన్ని నిపుణుల కమిటీలు ఏకక్షిగీవంగా ఆమోదించాయనే విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం, భారత అణువిద్యుత్ కార్పోరేషన్ లిమిటెడ్ విడతలవారిగా ప్రాజెక్టు నిర్వహణను చూస్తాయని తెలిపింది. ప్రజావూపయోజనాలు, అభివృద్ధి మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు వెళ్లాలని కోర్టు అభివూపాయపడింది.

తీర్పుపై భిన్నాభివూపాయాలు
కూడంకుళం కొనసాగింపునకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడంపట్ల భిన్నాభివూపాయాలు వ్యక్తమయ్యాయి. ప్లాంటును ముందునుంచి వ్యతిరేకిస్తున్న పీఎంఏఎన్‌ఈ సుప్రీంకోర్టు తీర్పు అన్యాయమైనదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రముఖ సీపీఎం నేత కేరళ ప్రతిపక్షనాయకుడు వీఎస్ అచ్యుతానందన్ ఈ తీర్పు దురదృష్టకరం అన్నారు. జనతాపార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి, ఏఈసీ మాజీ చైర్మన్ అనిల్ కకోద్కర్, న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్, డైరెక్టర్ శ్రేయన్స్ కుమార్ జైన్, మరికొందరు అణుశాస్త్రవేత్తలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.