కుమార బిర్లాకూ..బొగ్గు మరక

దేశాన్ని నివ్వెరపర్చిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల కుంభకోణంలో మరో ఇద్దరు ప్రముఖులను సీబీఐ నిందితులుగా తేల్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, ఆయనకు చెందిన హిండాల్కో ఇండస్ర్టీస్, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది.
mittal దీనిని స్థానిక సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి వీరిద్దరు, హిండాల్కోతోపాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై నేరపూరిత కుట్ర, అవినీతి అభియోగాలను తన 14వ ఎఫ్‌ఐఆర్‌లో మోపింది. అదే సమయంలో హిండాల్కో కార్యాలయాలు ఉన్న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్‌లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని పరేఖ్‌కు చెందిన నివాసాలపైనా సీబీఐ అధికారుల బృందాలు ఏకకాలంలో విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించాయి.

బొగ్గు కుంభకోణంపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు కొన్ని కనిపించకుండా పోవటాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో అక్షింతలు కూడా వేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందచేయాలంటూ సంబంధిత మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీచేసింది. దాంతోపాటు కుంభకోణంలో ఉన్న అందరు వ్యక్తులు, కంపెనీలపై విచారణను వేగవంతం చేయాలంటూ సీబీఐని ఆదేశించింది. ఈనెల 22వ తేదీలోపు స్టేటస్ రిపోర్టును న్యాయస్థానానికి అందించాలని సూచించింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు దర్యాప్తులో వేగంపెంచారు. తాజాగా మంగళవారం పధ్నాలుగవ ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. సికింద్రాబాద్‌లోని పరేఖ్ నివాసంతోపాటు ముంబయి, ఢిల్లీ, భువనేశ్వర్‌లలో తనిఖీలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఈ కుంభకోణం కేసులో సీబీఐ ఇప్పటికే కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా పని చేసిన దాసరి నారాయణరావు, పార్లమెంట్ సభ్యుడు నవీన్ జిందాల్‌లను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.

ఈ ఇద్దరితోపాటు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్, రాఠీ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, ఆ కంపెనీ సీఈవో ఉదిత్ రాఠి తదితరులపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా బిర్లా, పరేఖ్‌లను సీబీఐ పిలువనుందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఉద్దేశించిన బొగ్గు బ్లాకును 2005 ద్వితీయార్ధంలో హిండాల్కోకు కేటాయించారు. ఇది పరేఖ్‌ను కేఎం బిర్లా కలిసిన తర్వాత జరుగడంతో బిర్లా పేరును సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. అయితే తాము ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ను అందుకోలేదని హిండా ల్కో తెలిపింది. తాము బొగ్గు బ్లాకులు పొందిన విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. అన్నీ ప్రభుత్వ విధానాల ప్రకారమే జరిగాయని బాంబే స్టాక్ ఎక్సేంజ్‌కు హిండాల్కో తెలియజేసింది. పరేఖ్, కేఎం బిర్లా మధ్య జరిగిన క్విడ్ ప్రో కో ఏ విషయంలో జరిగిందన్న అంశంలో తాము పరిశోధన కొనసాగిస్తున్నామని సీబీఐ వర్గాలు చెప్పాయి. అయితే హిండాల్కోకు అయాచిత లబ్ధి జరిగిందనేది మాత్రం వాస్తవమని స్పష్టం చేస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో బిర్లా పేరును ఆదిత్య బిర్లా ప్రతినిధిగా పేర్కొన్నట్లు తెలిసింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.