కుట్రతోక వంకర

తెలంగాణను అడ్డుకునేందుకు అదే డ్రామా

సీఎంకు రాజీనామాలు ఇచ్చినగంటా, టీజీ, ఏరాసు
స్పీకర్ నమూనాలో9 మంది రాజీనామాలు
ముందు జాగ్రత్తగా మరో 9 మంది బొత్సకు..
మెజార్టీ నాయకులు వారించినా మంత్రి గంటా శ్రీనివాసరావు దూకుడు?
ఢిల్లీలో కేవీపీ ఇంట్లో సీమాంధ్ర ఎంపీల మంతనాలు..
నేటి ఉదయం కీలక నిర్ణయం: లగడపాటి
కుట్రదారుల జాబితాలోకి టీడీపీ, వైఎస్సార్సీపీ
రాజీనామాల బాటలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు
సమైక్య ఆందోళనలపై సీమాంధ్ర మీడియా అతి
ఎన్‌బీఏ నిబంధనలకు సైతం నీళ్లొదిలిన చానళ్లు
తామేమీ తక్కువ తినలేదన్న పోలీసులు
ఆందోళనకారులపై పక్షపాత ధోరణి
విగ్రహాలు పగిలిపోతున్నా.. ప్రేక్షకపాత్ర

హైదరాబాద్, ఆగస్టు 1 :తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముగ్గురు మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంక ఏరాసు ప్రతాప్‌రెడ్డి రాజీనామాలు చేశారు. అయితే.. మంత్రులు తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించాల్సి ఉన్నా..congress ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయనకే రాజీనామాలు అందించటం డ్రామాయేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే డ్రామా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలోనూ కనిపించింది. ప్రజా ప్రతినిధులు తమ రాజీనామాలను స్పీకర్ లేదా మండలి చైర్మన్‌కు ఇవ్వాల్సి ఉన్నా.. 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ ఫార్మాట్‌లో స్పీకర్ కార్యాలయంలో రాజీనామాలు అందజేశారు. అదే సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎటుపోయి ఎటు వస్తుందోనన్న అనుమానంతో తమ రాజీనామాలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు అందజేయడం విశేషం. తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో ఆందోళనలు తలెత్తడం, వాటిని భూతద్దంలో చూపుతూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలను దిగడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. రాజీనామాలు చేసిన, సిద్ధపడిన మంత్రులు, ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు తన దూతగా పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్‌కు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యత అప్పగించారు. ఈ మేరకు ఆయన సదరు నేతలకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.

రాజీనామాలపై తీవ్ర తర్జనభర్జనలు పడిన అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన 19 మంది మంత్రులు అక్కడ రాత్రి 7.15 గంటల నుంచి 11.25 గంటల దాకా సమావేశం జరిపారు. మినిస్టర్స్ క్లబ్ సమావేశంలో రాజీనామాలను వ్యతిరేకించిన సీ రామచంద్రయ్య, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరారెడ్డి ఈ సమావేశానికి రాలేదు. వచ్చినవారు కూడా రాజీనామాలపై మల్లగుల్లాలు పడినట్లు తెలిసింది. గంటా, టీజీ, ఏరాసు మాత్రం రాజీనామా పత్రాలు అందజేసి ఒకే కారులో క్యాంపు కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో పాటు అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా వచ్చిన ఇద్దరు కార్యదర్శులు సముదాయించే ప్రయత్నం చేస్తున్నా.. వారు పట్టించుకోకుండా బయటికి వచ్చేసినట్లు తెలిసింది. తొలుత రాజీనామాలపై పట్టుదలతో ఉన్న శైలజానాథ్ మాత్రం పార్టీ పెద్దల హామీతో వెనక్కు తగ్గినట్లు సమాచారం. మంత్రులు కొండ్రు మురళి, తోట నర్సింహం, బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ, అహ్మదుల్లా, పార్ధసారధి రాజీనామాలను వ్యతిరేకించారు. తాము రాజీనామాలు చేసేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.

వట్టి వసంతకుమార్, విశ్వరూప్, మహిధర్‌రెడ్డిలు రాజీనామాల విషయంలో ఏటూ తేల్చుకోలేక పోయినట్లు సమాచారం. కాగా మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు పంపించిన లేఖ ప్రతులను గురువారం సాయంత్రమే మీడియాకు పంపించారు. ఆ తరువాత ఆయన సీఎంతో జరిగిన సమావేశానికి వెళ్లారు. అతనితో పాటు మంత్రి శైలజానాథ్, కాసు వెంకటకృష్ణారెడ్డి పదవులకు రాజీనామాలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. సీమాంధ్ర మంత్రులతో పలు దఫాలు సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు చర్చించారు. సీమాంధ్ర నేతల అసంతృప్తులు, రాజీనామాల హెచ్చరికల నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ మంత్రులను బుజ్జగించేందుకు తన జట్టును రంగంలోకి దింపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో తనకు సహాయకులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఆర్‌సీ కుంతియా, తిరునావుక్కరుసులను గురువారం హుటాహుటిన హైదరాబాద్‌కు పంపించారు.

రాత్రి పదిగంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వీరు మంత్రులతో సమావేశమయ్యారు. రాజీనామాలపై తొందర వద్దని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, అంతా మంచే జరుగుతుందని వారు మంత్రులకు నచ్చజెప్పినట్లు తెలిసింది. సీమాంధ్ర ప్రాంతానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉందామని, ఇప్పుడు రాజీనామాలు చేసినా ఎలాంటి ఉపయోగంలేదని మంత్రులకు వారించినట్లు తెలిసింది. దీంతో కొందరు మంత్రులు రాజీనామాలపై వెనక్కి తగ్గారంటున్నారు. కాగా గంటా శ్రీనివాసరావు, ఏరాసు, టీజీ మాత్రం తాము రాజీనామాల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. సమావేశం చివర్లో వారు తమ రాజీనామా పత్రాలను సీఎంకు అందజేసి క్యాంపు కార్యాలయం నుంచి ఒకే వాహనంలో బయటికి వెళ్ళిపోయారు.

పునరాలోచనలో పడ్డాం : శైలజానాథ్
సీఎంతో సమావేశం నుంచి బయటికి వచ్చిన శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ తమ నిర్ణయాన్ని సీఎంకు వివరించామని, పార్టీ అధిష్ఠానానికి తమ అభివూపాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పామని, అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు. తమ రాజీనామాలపై ముఖ్యమంత్రి బుజ్జగింపు ధోరణిలో మాట్లాడారని, దీంతో పునరాలోచనలో పడినట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు విభజనపై కొత్త వాదాన్ని తీసుకొస్తున్నారని, తాజాగా ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనతోపాటు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఎమ్మెల్యేల్లోనూ తర్జనభర్జనలు
రాజీనామాలపై తీవ్ర తర్జనభర్జనల అనంతరం కొందరు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందించారు. మరికొందరు ముందు జాగ్రత్త చర్యగా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఇవ్వడంతో సరిపెట్టారు. దీనికి ముందు రాజీనామాలు ఎవరికి ఇవ్వాలన్న విషయంలో సమైక్యవాదం వినిపించే ఎమ్మెల్యేలు చీలిపోయారు. దీంతో ఈ విషయంలో గురువారం సాయంత్రం హైడ్రామా నడిచింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటు చేసినందుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నట్లు ముందుగా పేర్కొన్నారు.

ఆ తర్వాత సీఎల్పీ కార్యాలయంలోనే రాజీనామాల లేఖ డ్రాప్టును తయారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాల మీద సమావేశాలు నిర్వహించుకున్న నేతలు తీరా సాయంత్రం మళ్లీ సీఎల్పీ కార్యాలయంలో భేటీ జరిగే సమయానికి కొందరు డుమ్మా కొట్టారు. సీఎల్పీలో సమావేశమైన ఎమ్మెల్యేల్లో కొందరు రాజీనామాలను స్పీకర్‌కు నేరుగా ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిని కొందరు వ్యతిరేకించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఇస్తే సరిపోతుందని వాదించారు. పీసీసీ అధ్యక్షుడి ద్వారా స్పీకర్‌కు అందజేయాలని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్‌రావు చెప్పగా.. మాజీ మంత్రులు జేసీ దివాకర్‌రెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రాజీనామాలు చేయాలని అసెంబ్లీ వరకు వచ్చిన ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. స్పీకర్ కార్యాలయం వరకు జేసీ దివాకర్‌రెడ్డి వెంట వెళ్లిన ఎమ్మెల్యే సీహెచ్ వెంకట్రామయ్య ఫోన్ వచ్చిందంటూ వెనక్కి తగ్గి, మరో ఎమ్మెల్యే నాగేశ్వర్‌రావుతో కలిసి బొత్స నివాసానికి వెళ్లిపోయారు.

స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన మిగిలిన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాంకు రాజీనామాలు అందజేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేసినవారిలో జేసీ దివాకకర్‌రెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి, కే సుధాకర్, దగ్గుబాటి వెంక మురళీ కృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి, అనం వివేకానందరెడ్డి, ఆదినారాయణరెడ్డి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పిడిక రాజన్నదొర స్పీకర్ కార్యాలయానికి రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో పంపించినట్లు తెలిసింది. ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, కే సుధాకర్‌బాబు, మహ్మాద్‌జానీ తమ రాజీనామా లేఖలను స్పీకర్ కార్యాలయంలో ఇచ్చారు. వీరితో విభేదించిన కొందరు పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసానికి వెళ్లి ఆయనకు రాజీనామాలు అందజేశారు. బొత్సకు రాజీనామాలు ఇచ్చిన వారిలో కారుమూరి నాగేశ్వర్‌రావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగా గీత, సీహెచ్ వెంకట్రామయ్య, కే వెంకట్‌రామిరెడ్డి, మల్లాది విష్ణు, బంగారు ఉషారాణి, వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావ్, గాదె శ్రీనివాసనాయుడు ఉన్నారు.

బయటపడిన కుట్ర స్వభావాలు
గత ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర డిమాండ్, ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘంగా జరుగుతున్న ఉద్యమాన్ని, పోరాటాన్ని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం, యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఈ నెల 30న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేశాయి. దీంతో సీమాంధ్ర నాయకుల కుట్ర స్వభావాలు మళ్లీ బయటపడ్డాయి. కృత్రిమ ఉద్యమాలు మళ్లీ గాలి నింపుకున్నాయి.

రాజీనామాల డ్రామాలతో మరో సారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునే కార్యక్షికమాలు ఊపందుకుంటున్నాయి. పదవులకు రాజీనామాలతో పార్టీ హైకమాండ్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి, పరిస్థితిని అల్లోకల్లోలం చేయడం ద్వారా రాష్ట్ర విభజన అడ్డుకోవాలనే వ్యూహాలకు పదును పెట్టారు. మొన్నటి వరకు తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటామని చెబుతూ వచ్చిన సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు అధిష్ఠానాన్ని ధిక్కరించే స్థాయిలోనే రాజీనామాల డ్రామాలాడుతున్నారు. ప్రత్యేకించి కొందరు సీమాంధ్ర నేతలు ఈ రాజీనామాల ప్రహసనానికి సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఇక్కడి మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌లో జరిగిన సమావేశంలో 55 మంది ప్రజావూపతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాజీనామాల ఆంశం ప్రస్తావించినప్పుడు మెజారిటీ నేతలు వ్యతిరేకించారు. చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక్కరే రాజీనామాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. రాజీనామాలు చేద్దామంటూ ఆయన మిగతా మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అందరికంటే ముందుగా ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సీమాంధ్ర నేతల సమావేశం ముగిసిన తరువాత మంత్రి బాల్‌రాజు నివాసంలో మంత్రులు పార్ధసారధి, తోటనర్సింహం, అహ్మదుల్లా, పితాని సత్యనారాయణ భేటీ అయ్యారు. ఇక్కడ కూడా రాజీనామాల ఆంశంపై చర్చించారు. రాజీనామాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అనంతరం కొండ్రు మురళీమోహన్ నివాసంలో కూడా వీరు సమావేశమై రాజీనామాల విషయంలో వ్యతిరేకత వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆ తరువాత సీఎం, పీసీసీ చీఫ్ బొత్సతో సీఎం క్యాంపు కార్యాలయంలో 19 మంది మంత్రులు భేటీ అయినప్పుడు కూడా రాజీనామాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. సీమాంధ్ర నేతల సమావేశంలో అందరు రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తీర్మానం చేసినట్లు చెప్పుకున్నప్పటికీ ఆ తరువాత రాజీనామాల విషయానికి వచ్చే సరికి సగానికి పైగా నేతలు జారుకున్నారు.

టీడీపీలోనూ సమైక్య రాగాలు
తెలంగాణ విషయంలో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న టీడీపీ నేతలు మళ్ళీ సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేతల హడావిడిని చూసిన ఆ పార్టీ నేతలు కూడా రాజీనామాలు, ఆందోళనలకు సై అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు తెలంగాణపై కాంగ్రెస్, యూపీఏ నిర్ణయం రాక ముందే రాజీనామాలు చేశారు. ఇది జరిగి ఆరు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు వారి రాజీనామా పత్రాలు స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. ఈ మూడు పార్టీలు కొందరు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే రాజీనామాల డ్రామాలాడుతూ సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొడతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనేక సంవత్సరాల తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వస్తే మళ్ళీ అడ్డంకులు, ఆటంకాలతో అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయని విమర్శలు వెల్లు 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు చేసిన ప్రకటనను అడ్డుకుని అనేక మంది ఆత్మబలిదానాలకు కారకులయ్యారనే విమర్శలు లేక పోలేదు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర విభజనను అడ్డుకుంటూ రాష్ట్రంలో అల్లోకల్లోలానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమకారులు ఏనాడు కూడా జాతీయ నేతల విగ్రహాలను కూల్చలేదని, తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలను మాత్రమే కూల్చిన విషయాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ట్యాంక్ బండ్‌పై జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం చివరి వరకు అనుమతి ఇవ్వక పోవడం, ఆ ఆగ్రహంతోనే కొందరు ట్యాంక్‌బండ్ పై ఉన్న విగ్రహాలను కూల్చివేశారే తప్ప ప్రస్తుతం సీమాంవూధలో ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి నేతల విగ్రహాలను కూల్చివేయడం, విధ్వంసం చేస్తున్న తరహాలో తెలంగాణ ఉద్యమకారులు ఏ నాడు వ్యవహరించలేదని వారు పేర్కొన్నారు. కలిసి ఉండేందుకు గొడవ చేసే సంప్రదాయం, ఉద్యమాలు ఎక్కడ కనిపించలేదని అంటున్నారు. పైగా హైదరాబాద్‌ను పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తామనిచెప్పినా కూడా ఆందోళన సాగించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్ర విభజనపై నిర్ణయం అనంతరం ఇక సీమాంధ్ర మీడియా మరింత రెచ్చపోయి సమైక్య వాద ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నట్లు వార్తకథనాలు ప్రసారం చేస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఘటనలు, ఆందోళనను పెద్దవిగా చేసిచూపించడం, అంతే స్థాయిలో వార్తలను ప్రసారం చేస్తూ సీమాంధ్ర మీడియా తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నదనే విమర్శలు భగ్గుమన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు నిర్దేశించే ఎన్‌బీఏ ఈ నెల 30న మరోసారి తమ నిబంధనలు అందరు పాటించాలంటూ అన్ని న్యూస్ చానళ్ల ఎడిటర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా కొన్ని సీమాంధ్ర న్యూస్ చానళ్లు అవేమీ పట్టించుకోకుండా మరింత రెచ్చిపోయి సీమాంధ్ర కృత్రిమ ఉద్యమాన్ని చూపిస్తూ, అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

పోలీసుల పక్షపాతం
రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు మరోసారి తమ పక్షపాత వైఖరిని బయట పెట్టుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమ కళ్ళ ఎదుటే జాతీయ నేతల విగ్రహాలను ఆందోళనకారులు కూల్చివేస్తున్నా సీమాంధ్ర పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఉద్యమించిన ప్రతీసారి ‘ఖాకీ’తనాన్ని ప్రదర్శించి, ఒకొక్కరిపై వందల కేసులు పెట్టిన పోలీసులు సీమాంధ్రలో మాత్రం సమైక్యాంధ్ర పేరిట రోడ్లపైకి వచ్చిన వారి పట్ల చూసీ చూడనట్టుగా వ్యవహరించారని అంటున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.