హైదరాబాద్, జనవరి 27 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రుల విశ్వాసం కోల్పోయిన కిరణ్.. తమకు నాయకుడే కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం ఉంటే వెంటనే కిరణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చర్చ మొదలైన తర్వాత బిల్లును తిప్పి పంపాలనడమేంటని ప్రశ్నించారు.
సోమవారం ఆయన అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన బిల్లును తిప్పి పంపాలని ముఖ్యమంత్రి కిరణ్ స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం సరికాదని అన్నారు. రాజ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎంను సభానాయకుడిగా తాము గుర్తించడంలేదన్నారు. కిరణ్ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తిప్పికొడుతామని తెలిపారు. కేబినెట్‌ను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడమంటే.. సమష్టి బాధ్యత స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించడమేనన్నారు. మంత్రులందరూ కలిస్తేనే ప్రభుత్వమని, సీఎం మాత్రం తానొక్కడే ప్రభుత్వమని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఈ నెల 23 వరకు సమయమిచ్చినప్పటికీ సమయం సరిపోలేదని సీమాంధ్ర ఎమ్మెల్యేలు లేఖలు రాయడంతో మరో వారం గడువు పెంచారని తెలిపారు. ఈ నెల 30 వరకు సభ్యుల అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి పంపించాలని ఆయన కోరారు