కిరణ్ సంతకాలపై గవర్నర్ సమీక్ష

రాజీనామాకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై గవర్నర్ సమీక్ష మొదలైంది. రాష్ట్రపతి పాలన పగ్గాలు చేపట్టిన రెండోరోజే నాటి నిర్ణయాలను రద్దు చేస్తూ గవర్నర్ తన మార్క్ పాలనకు తెరతీశారు. ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీలలను మార్చడంతోపాటు నామినేటేడ్ పోస్టులపై దష్టి సారించారు. పరిస్థితులను గమనించి కిరణ్ సన్నిహితుడైన రాజీవ్‌యువకిరణాల పథకం రీమ్యాప్ చైర్మన్ కేసిరెడ్డి (చెంచురెడ్డి) హడావిడిగా రాజీనామా చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్నిరోజుల ముందు జరిగిన సీనియర్ ఐఎఎస్ అధికారుల బదిలీ వివాదాస్పదంగా మారింది.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిరణ్ హడావుడిగా బదిలీ చేసిన ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ అనంతరాములు, జెన్‌కో మేనేజింగ్‌డైరెక్టర్ కే విజయానంద్, సీఎం పేషీలో స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్ ఎస్ రావత్‌లను గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి వారి వారి స్థానాల్లోనే నియమిస్తూ చీఫ్‌సెక్రెటరీ పీకే మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎం పేషీ లేనందున రావత్‌ను సాంఘికసంక్షేమశాఖకు బదిలీ చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు అనంతరాములును సాంఘికసంక్షేమ శాఖ కమిషనర్‌గా, జెన్‌కో ఎండీ విజయానంద్‌ను ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా, సీఎం పేషీలోని రావత్‌ను జెన్‌కో ఎండీగా బదిలీ చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అనంతరాములు హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తికాకముందే బదిలీ చేశారని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

దీంతో ఈ బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గవర్నర్ పగ్గాలు చేపట్టిన వెంటనే వివాదాస్పద నిర్ణయాలపై దష్టి సారించారు. ఎవరి స్ధానాల్లో వారిని కొనసాగిస్తూ రావత్‌ను మాత్రం సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. నామినెటెడ్ పోస్టుల వివరాలను కూడా సమర్పించాలని, సంబంధిత దస్ర్తాలను తన ముందుంచాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.