కిరణ్… నీవెంత, నీ సర్కారెంత: హరీష్‌రావు

హైదరాబాద్: తెలంగాణ నేతలపై సీమాంధ్ర సర్కార్ అక్రమంగా కేసులు బనాయించడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు నిప్పులు చెరిగారు. చరిత్రలో పెద్దపెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. నీవెంత నీ సర్కారెంతా అని హరీష్‌రావు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. పై అధికారులు చెబితేనే కేసులు పెట్టామని చెబుతున్న కింది స్థాయి పోలీసుల అధికారులు ఆపై అధికారులెవరో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన తెలంగాణ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ల్యాంకో పేరుతో రూ.146 కోట్లు దోచుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ప్రభుత్వాధికారులు రాచమర్యాదలు చేస్తరని, తెలంగాణ వాదులను మాత్రం అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తారని ఆరోపించారు.

‘అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?’
హైదరాబాద్: నిన్న సడక్‌బంద్ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తెలంగాణ జేఏసీ నేతలు, టీఆర్‌ఎస్ నాయకులను సీమాంధ్ర సర్కార్ అరెస్టు చేయడంపై హరీష్‌రావు మండిపడ్డారు. అరెస్టులు అక్రమం, అన్యాయం ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంను అరెస్టు చేస్తారా? అని నిలదీశారు.

అవిశ్వాసం పెట్టినందుకే ఈటెల అరెస్టు: హరీష్‌రావు
సీమాంధ్ర సర్కార్ తెలంగాణ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని హరీష్‌రావు విమర్శించారు. మొన్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకే తమ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లో పెట్టిందని ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలకు మైక్ ఇస్తే అసలు బండారం బయటపడుతుందనే ఇవాళ శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేశారని ఆయన ధ్వజమెత్తారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.