కిరణ్‌ సర్కార్ ను కాపాడేందుకు టీడీపీ కసరత్తు

 

Harishrao – మద్దతివ్వాల్సిన అవసరంలేదన్న చంద్రబాబు?
– తేల్చుకోవాల్సింది తెలంగాణ ఎమ్మెల్యేలేనని వ్యాఖ్య!
– బయటపడిన చంద్రబాబు నిజ స్వరూపం
– తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహం
– కిరణ్ సర్కారుకు బాబే రక్ష:టీఆర్‌ఎస్ నేత హరీశ్ విమర్శ
ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవడం, తెలంగాణపై తేల్చకపోవడానికి నిరసనగా టీఆర్‌ఎస్ ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ అధినేత అడ్డం కొట్టారు. నిత్యం తన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు.. సర్కారు పడిపోకుండా చూసేందుకే కంకణం కట్టుకున్నారు. ఇదేదో తెలంగాణవాదులకు మాత్రమే పరిమితమైన అంశంగా భావించిన చంద్రబాబు.. టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని తన పార్టీ నేతలకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న చంద్రబాబు.. పార్టీ ముఖ్యనేతలతో జరిపిన టెలికాన్ఫన్స్‌లో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారని సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకునేందుకే మనల్ని ట్రాప్‌లోకి లాగుతున్నారు. టీఆర్‌ఎస్ ఉచ్చులో మనం చిక్కుకోవద్దు’ అని ఆయన టీడీపీ నేతలకు చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

ప్రజాసమస్యలపై అవసరమైనప్పుడు మనమే అవిశ్వాసం పెడదామని సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కిరణ్ సర్కారుపై యుద్ధం ప్రకటించి.. పల్లెపప్లూకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనార్హత లేదని చెబుతున్న చంద్రబాబు.. అందుకు అవకాశంగా ముందుకు వచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో వెనుకడుగు వేయడం ద్వారా తన నిజస్వరూపాన్ని చాటుకున్నారని పలువురు తెలంగాణ ఉద్యమకారులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ముమ్మాటికీ ఆంధ్రబాబేనని మరోసారి రుజువు చేసుకున్నారని మండిపడుతున్నారు. అవిశ్వాసం పెడితే ఎవరి రంగు ఏమిటో బయటపడుతుందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజమై.. టీడీపీ రంగు బయటపడిందని వారు అంటున్నారు. అవిశ్వాసం ప్రతిపాదనతో టీడీపీ తన ముసుగు విప్పేసిందని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న కిరణ్ సర్కారును బాహాటంగా ఆదుకునేందుకు కంకణం కట్టుకున్నదని వారు విమర్శిస్తున్నారు.

ప్రత్యేకించి కిరణ్ సర్కారు మైనార్టీలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఇది మంచి అవకాశంగా ఉండేదని, కానీ.. ఈ ప్రభుత్వం కూలిపోకూడదని టీడీపీ భావించడం వల్లే అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించిందని పలువురు ఉద్యమకారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజనను కిరణ్ సర్కారు అడ్డుకుంటున్నందుకు నజరానాగానే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూ మాట్లాడిన చంద్రబాబు.. తీరా తేల్చుకోవాల్సిన సమయం రాగానే అడ్డం పడుతున్నాడని అంటున్నారు. చంద్రబాబు నిర్ణయం నేపథ్యంలో టీడీపీ టీ ఫోరం ఎమ్మెల్యేలు తమ వైఖరిని ప్రకటించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా బాబు చెప్పుచేతల్లోంచి బయటకు వస్తారా? లేక బాబుకు బానిసలుగా ఉంటారా? తేల్చుకోవాలని సవాలు విసురుతున్నారు. ఇప్పటికైనా నిర్ణయం తీసుకోని పక్షంలో భవిష్యత్‌లో రాజకీయంగా వారికి పుట్టగతులు ఉండవని తేల్చి చెబుతున్నారు.
కాంగ్రెస్‌పై బాబు విమర్శలు

బూటకమని తేలిపోయింది: హరీశ్‌రావు
కాంగ్రెస్ పార్టీపై, కిరణ్ సర్కారుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు బూటకమని తేలిపోయిందని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉపనేత హరీశ్‌రావు అన్నారు. బాబు నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. తన పాదయాత్ర సందర్భంగా కిరణ్‌సర్కారుకు పాలించే అర్హత లేదంటున్న చంద్రబాబు.. ఇప్పుడు కిరణ్ సర్కారును కాపాడేందుకే టీఆర్‌ఎస్ ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయరాదని అంటున్నారని విమర్శించారు.
కిరణ్ సర్కారును కంటికి రెప్పలా కాపాడుతున్నదని టీడీపీయేనని టీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శ నిజమని తాజా పరిణామంతో తేలిపోయిందని హరీశ్ అన్నారు. బాబు రెండువేల కిలోమీటర్లు కాదు..10 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.