కిరణ్‌కు తెలంగాణ తడాఖా చూపిస్తం-కేసీఆర్‌

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంభావంతో మాట్లాడుతున్నాడని టీఆర్‌ఎస్ ధ్వజమెత్తింది. బయ్యారంపై తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా మాట్లాడిన సీఎం అంతుచూస్తామని హెచ్చరించింది. బయ్యారం ఖనిజాన్ని తరలించకుండా అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ నేతలు ఆదివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు,జి.విజయ రామారావు, బి.వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భేటీ వివరాలను నాయిని, ఈటెల మీడియాకు తెలిపారు. ‘బయ్యారం ఇనుప ఖనిజాన్ని తరలిస్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండని సీఎం అహంకారంగా మాట్లాడి తెలంగాణవాదులను రెచ్చగొట్టారు. ఇంత అహంభావంగా, మొండిగా ఏ ముఖ్యమంత్రీ మాట్లాడలేదు. కిరణ్ సంగ తేంటో చూస్తాం.. ఉప్పెనలా ఉద్యమిస్తాం’ అని నాయిని హెచ్చరించారు. తానే మొనగాడిని అనుకుంటే ప్రజాస్వామ్యంలో చెల్లదని, హిట్లర్ వంటి నియంతలే కనుమరుగైపోయారని అన్నారు. బయ్యారం ఖనిజం తరలింపునకు నిరసనగా ఈ నెల 10న తెలంగాణాలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 14న మండల కేంద్రాల్లో ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు.
కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా, లేదా భీమదేవరపల్లి నుంచి బయ్యారం దాకా ఐదు వేలమందితో పాదయాత్రను చేపడతామని తెలిపారు. అవకాశాన్ని బట్టి కేసీఆర్ యాత్రలో పాల్గొంటారన్నారు. యాత్ర ముగింపు సందర్భంగా బయ్యారంలో జరిగే సభలోనూ ఆయన పాల్గొంటారని చెప్పారు. బయ్యారం ఖనిజాన్ని తరలించేది లేదని చెప్పేదాకా పోరు సాగిస్తామన్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ మంచి మిత్రుడని, హైదరాబాద్‌లో ఆయనపై తాను పోటీ చేయనని నాయిని చెప్పారు. ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ఈటెల తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 2 వరకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ గ్రామం నుంచి 150 మంది దాకా 11 కమిటీల చొప్పున వీటిలో పాల్గొంటారన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఈ శిబిరాల తేదీలు ఖరారు కాలేదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.