కాళోజీ సతీమణి కన్నుమూత

– అనారోగ్యంతో పరమపదించిన రుక్మిణీబాయి
-హన్మకొండ శివముక్తిధామంలో అంత్యక్రియలు
– బంధుమిత్రులు,సాహితీవేత్తల సంతాపం
kalojiwife పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సతీమణి రుక్మిణీబాయి(88) కన్నుమూశారు. వరంగల్ నగరంలోని అదాలత్ సమీపంలోని స్వగృహంలో మంగళవారం ఉదయం 11.10 గంటలకు ఆమె పరమపదించారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న ఓరుగల్లు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి చెందారు. రుక్మిణీబాయి పార్థివదేహానికి నివాళులర్పించి కన్నీటిపర్యంతమయ్యారు.

గత మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కాళోజీ ఇంటికొచ్చిన ప్రతిసారీ ఆత్మీయతతో పలుకరించే ‘అమ్మ’లేదని శోకతప్త హృదయంతో విలపించారు. కాళోజీ మరణం తర్వాత ఆమెలోనే కాళోజీని, చూసుకున్న అభిమానులు, కవులు, రచయితలు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. కాళోజీ కుమారుడు రవికుమార్ దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. మధ్యాహ్నం నుంచి కాళోజీ ఆత్మీయులు, బంధువులు, సాహితీవేత్తలు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం ఐదుగంటలకు స్వగృహం నుంచి హన్మకొండలోని శివముక్తిధామం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

నివాళులర్పించిన ప్రముఖులు
kalojiwife1రుక్మిణీబాయి మరణవార్త తెలుసుకున్న పలువురు సాహితీవేత్తలు, బంధుమిత్రులు ఆమె భౌతికకాయాన్ని దర్శించుకొని సంతాపం తెలిపారు. కాళోజీ ఫౌండేషన్ కన్వీనర్ నాగిళ్ల రామశాస్త్రి, మిత్రమండలి అధ్యక్షుడు వీఆర్‌విద్యార్థి, మానవ హక్కుల నేత జీవన్‌కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్, డాక్టర్ విశ్వనాథరావు, ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి, పొట్లపల్లి శ్రీనివాసరావు, లోచన్, అనిశెట్టి రజితతోపాటు తదితర కవులు, రచయితలు, కళాకారులు రుక్మిణీబాయి భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

సంతాపం వూపకటించిన కేసీఆర్
కాళోజీ నారాయణరావు సతీమణి రుక్మిణీబాయి మృతికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. కాళోజీ కుటుంబం తెలంగాణకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, విప్లవ రచయిత వరవరరావు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సినీ దర్శకులు బీ నర్సింగరావు, ఎమ్మెల్సీ చుక్కా రామ య్య, తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం డీన్ ఆచార్య భట్టు రమేశ్, జిల్లా పౌరసంబంధాల అధికారి కన్నెకంటి వెంకటరమణ, సీనియర్ జర్నలిస్టు వీఎల్ నర్సింహమూర్తి, సితార్ విద్వాంసులు గుమ్మడి జనార్దన్, మాజీ డిప్యూటీ విద్యాశాఖాధికారి బూర విద్యాసాగర్, ఎమ్మె ల్యే వినయ్‌భాస్కర్ తదితరులు సంతాపం తెలిపారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.