కామన్ ఎంట్రన్స్‌లుంటే రాష్ట్రం వచ్చి ఏం లాభం? -కేసీఆర్

‘పది జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్‌లో ముసాయిదా బిల్లును ఆమోదించడం సంతోషం కలిగిస్తోందని కేసీఆర్ అన్నరు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన సోనియాగాంధీకి, ప్రధానమంత్రికి, కేబినెట్‌కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నా. ఇది ఏ ఒక్కరి విజయమో కాదు. తెలంగాణ అమరుల త్యాగఫలం. వారు చేసిన ఆత్మబలిదానాలు ఏం చేసినా తిరిగి తేలేం. ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించినందున ఒకవైపు ఆనందం ఉన్నా అమరవీరుల త్యాగాలు గుర్తుకు వచ్చి కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. వారిని గుండెల్లో పెట్టుకుంటాం. వారి త్యాగాలు వృథా కావు. 1969 తెలంగాణ ఉద్యమం విఫలమైన తరువాత వచ్చిన ఈ ఉద్యమంలో వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా 14 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు నన్ను నడిపించారు. 2001 నుంచి నిన్న కేబినెట్‌లో బిల్లు ఆమోదించే వరకు తెలంగాణ ప్రజల పాత్ర ఉద్యమంలో ఉంది. తెలంగాణ ప్రజలందరూ నాకు సహకరించాలని ఆనాడు జలదృశ్యంలో కోరాను. నేను మోసం చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నా. తెలంగాణ సాధనలో ప్రజలంతా నాకు సహకరించారు. ఇవాళ కల సాకారం అయింది.
telangana
అభ్యంతరాలను ఆనాడే చెప్పా
బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నేను బిల్లు ఆమోదం కాగానే ఇది సంబురాల సమయం కాదన్నా. ప్రజల కోరిన తెలంగాణ రావాలి. ఉద్యమ నాయకులు ఎప్పుడూ విశ్రాంతిలోకి వెళ్లొద్దు. ఆ ఉద్దేశంతోనే సంబురాలు వద్దన్నా. ఇది ముసాయిదా బిల్లు మాత్రమే. పార్లమెంట్‌లోని ఉభయసభల్లో బిల్లు పాస్ అయినాకే సంబురాలు. ఇంకా రెండు దశలు దాటాలి. అసెంబ్లీకి రావాలి. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాలి. బిల్లు పాస్ అయిన తరువాత ఎవరూ జరపని విధంగా సంబురాలు జరుపుతాం.
బిల్లుపై రిటైర్డ్ ఐఏఎస్‌లు, నీటిపారుదల నిపుణులు విద్యాసాగర్‌రావు తదితరులు అధ్యయనం చేస్తున్నారు. బిల్లులో ఏయే మార్పులు చేయాలో వివరిస్తూ మూడు నాలుగు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తా. అవసరమైతే మా ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి వివరిస్తుంది. తెలంగాణ ఇచ్చేదుంటే పరిశుభ్రంగా ఇవ్వాలని ఆనాడే జీవోఎంను కలిసినప్పుడు చెప్పా. దేశంలో 28 రాష్ట్రాలు కేంద్రంలో ఎలాంటి సంబంధాలు కలిగిఉన్నాయో 29వ రాష్ట్రమైన తెలంగాణ కూడా అలాగే ఉండాలని చెప్పిన. ఇతర రాష్ట్రాలకు ఒక ఖానూన్ తెలంగాణకు మరో ఖానూన్ ఉండొద్దని చెప్పిన. తెలంగాణ ప్రభుత్వానికి అధికారాలిచ్చి గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. మమ్మల్ని చిన్నచూపు చూసినట్లు, అవమానించినట్లు అవుతుంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నిరసిస్తున్నాం.

కామన్ ఎంట్రెన్స్‌లతో ఏం లాభం?
రెండు రాష్ట్రాలు ఏర్పడ్డా కామన్ ఎంట్రెన్స్ విధానమే ఉం టుందని చెబుతున్నారు. మరి మాకు తెలంగాణ వచ్చి ఏం లాభం? కామన్ ఎంట్రెన్స్ అంటే అనవసర ఘర్షణకు దారితీస్తుంది. సీమాంధ్రలో ఏమైనా విద్యా సంస్థలు పెట్టాలనుకుంటే ఇప్పుడే వెంటనే ప్రారంభించండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక అప్పుల పంపిణీ కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా ఖర్చు ప్రాతిపదికన చేయాలి. ప్రాజెక్టుల వారీగా అప్పును కేటాయించాలి. కేవలం ఖర్చు ఆధారంగానే అప్పుల పంపిణీ జరగాలి. ఇక ఆస్తులు కూడా జనాభా ప్రాతిపదికన అంటే అంగీకరించం. ఢిల్లీలో తెలంగాణకు హైదరాబాద్ హౌస్ ఉండేది. అందులో రాజు ఉంటే సిబ్బంది ఉండ డానికి ఏపీ భవన్‌ను వినియోగించుకునేవారు. దాన్ని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మేసింది. తెలంగాణ ప్రభు త్వం ఉండి ఉంటే హైదరాబాద్ హౌస్‌ను అమ్మేవారే కాదు. ఇప్పుడున్న ఏపీభవన్ పూర్తిగా మాదే. హైకోర్టు తెలంగాణదే అన్నారు. అదే సమయంలో సీమాంధ్రలో కూడా వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలి. అందుకు అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలి. నదీ జలాలపై ఉన్న అభ్యంతరాలపై ఇరిగేషన్ నిపుణులు చర్చిస్తున్నారు. ప్రధానికి రాసే లేఖలో నదీ జలాల అభ్యంతరాలను కూడా ప్రస్తావిస్తా.

రాజ్యసభ సీట్ల లెక్కపై స్పష్టత రావాలి
ప్రస్తుతం రాజ్యసభ సీట్లు 18 ఉంటే ఆంధ్రకు 11, తెలంగాణకు 7 కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్ రిటైర్ అవుతున్నారు. కానీ 2014లో ప్రస్తుతం ఒక్కటే కేటాయించారు. 2014లో రెండు, 2016లో రెండు, 2018లో మూడు రాజ్యసభ సీట్లు తెలంగాణకు కేటాయించాలి. ఫైనల్ బిల్లులో దీనిపై చర్చిస్తాం. తెలంగాణ రానే రాదని 14 సంవత్సరాల్లో లక్షా30వేల ముచ్చట్లు చెప్పారు. వారు ప్రతి దశలో ఆగుతుందని అన్నప్పుడల్లా ప్రక్రియ ముందుకు సాగింది. ఇప్పటికీ ఆపుతాం అంటే ఆంధ్ర ప్రజలను మోసగించడమే. మీకేం కావాలో కేంద్రాన్ని అడగండి. ఎక్కువ తెచ్చుకోండి. ఇంకా మేం పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లుగా పిచ్చి ముఖాల్లా మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో సూపర్‌కౌన్సిల్ అనేది లేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నాం కనుక పదేళ్లు ఉమ్మడి రాజధానికి అంగీకరించాం. కానీ గవర్నర్ చేతిలో అధికారాలు పెట్టడానికి అంగీకరించలేదు. రాజ్యాంగపరంగా తెలంగాణ ఉండాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తం. తెలంగాణలో పుట్టి పెరిగిన వారంతా స్థానికులే. ఇక్కడ ఉన్న వారు తెలంగాణ ప్రజలతో కలిసి బతకడానికి ఎలాంటి బాధ ఉండదు. సోలాపూర్, బీమండి, ముంబాయిలలో లక్షల సంఖ్యలో తెలంగాణవారున్నారు.

అక్కడ పుట్టినవారు అక్కడే లోకల్ అవుతారు. ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అక్కర్లేదు.. ఐదేళ్లు చాలని ఆనాడు చెప్పిన. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడి తీరుతుంది. రాష్ట్రపతి అసెంబ్లీకి ముసాయిదా బిల్లు పంపిన తరువాత ఆయన ఇచ్చిన సమయంలో అభిప్రాయం పంపినా, పంపకున్నా బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది. అసెంబ్లీ స్థానాలు పెంచేదుంటే ముసాయిదా బిల్లులోనే చెప్పేవారు. ముసాయిదా బిల్లుపై నాకు అసంతృప్తి ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పరిశుభ్రమైన తెలంగాణ రాకుంటే బాధ నాకు, టీఆర్‌ఎస్‌కే ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆంధ్రులకు అనవసర భయాలు వద్దు. 14 ఏళ్ల ఉద్యమంలో ఏనాడూ ఏ ఒక్కరిపైనా దాడి జరుగలేదు. తెలంగాణ ప్రజల్లో మమేకమై కలిసి బతకండి. వారికి భరోసా ఇస్తున్నాం. వదంతులకు, అపోహలకు గురికాకండి. నష్టపరిహారం ఎవరికీ ఎవరూ ఇవ్వరు. ఎవరైనా ‘మీరు నష్టపోయారు.. ఇదిగోండి ఐదు లక్షల కోట్లు తీసుకోండి’ అని సూటికేసుల్లో పెట్టి ఇస్తారా? బిల్లులోనే వారు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తాం అన్నారు. అందుకనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తాం. ఇప్పుడీ రాష్ట్రంలో గిరిజనులకు ఆరుశాతమే రిజర్వేషన్లు ఉన్నాయి.

తెలంగాణలో 12% గిరిజనులుంటారు. ప్లానింగ్ కమిషన్ వద్ద తెలంగాణలోని 10 జిల్లాల్లో 8 జిల్లాలు వెనుకబడి ఉన్నట్లు రిజిస్టర్ అయ్యాయి. కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తెచ్చుకుంటాం. పార్టీ ఆదేశాల ప్రకారమే ఢిల్లీకి వెళ్తా. పోలవరం డిజైన్ మార్చాలని అంటున్నాం. రేపు తెలంగాణ ప్రభుత్వం పోలవరంపై తన అభిప్రాయం చెబుతుంది.’ అని కేసీఆర్ అ న్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, నా యిని నర్సింహారెడ్డి, దాసోజు శ్రావణ్, నిరంజన్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మందా జగన్నాథం, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ఉద్యోగాలకు మేం పెన్షన్ ఇవ్వాలా?
ఉద్యోగాల పంపిణీ, పెన్షనర్ల పంపిణీకి జనాభా ప్రాతిపదిక అంటున్నారు. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. దేశంలో ఇతర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వేరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వేరు. ఆంధ్రతో తెలంగాణ కలిసినప్పుడు పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు. ముల్కీరూల్స్ ఉంటాయన్నారు. ఆనాడే ముల్కీ రూల్స్‌ను ఉల్లంఘించి 24వేల మందిని నియమించుకున్నారు. అప్పుడు ఉద్యోగులు ఆందోళన బాట పడితే ఆనాడున్న కాసు బ్రహ్మానందరెడ్డి వారిని వెనక్కి పంపితే ఆందోళన విరమిస్తారా.. అని అడిగారు. నాడు ఉద్యోగుల సంఘం నాయకుడు ఆమోస్ సరేనన్నారు. అప్పుడే జీవో 36ను కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చారు. ఆ తరువాత జై ఆంధ్ర ఉద్యమం రావడంతో ముల్కీ రూల్స్‌ను తొలగించిన తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రవేశపెట్టింది. అది కూడా దురాక్రమణకు గురైంది. 1985లో ఎన్టీ రామారావు అక్రమంగా ఉన్న 59 వేల మంది ఉద్యోగులను వెనక్కి పంపేందుకు జీవో 610 ఇచ్చారు. ఇద్దరు సీఎంలు అంగీకరించిన ఉద్యోగుల సంఖ్యే 83వేలు. అలా అక్రమంగా వచ్చిన వారు ఇప్పుడు రిటైర్ అయి ఇక్కడే ఉన్నారు. అప్పుడు మా ఉద్యోగాలు పోయింది చాలక ఇప్పుడు వారికి పెన్షన్ కూడా తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలా? స్థానికతను చూసి పెన్షనర్లను కేటాయించాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.