కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించం

– విలేకరులతో పీసీసీ అధ్యక్షుడు బొత్స
ఈ నెల 22న జరుగనున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించే అవకాశం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. సమైక్యవాదం అంశం కూడా చర్చకు రాదని తెలిపారు. తెలంగాణ అంశంపై కొంత మంది వ్యక్తులు, ఒక వర్గం మీడియాకే అతృతగా ఉందన్నారు. రాష్ట్ర విభజన అంశం, కళంకిత మంత్రుల విషయం కేంద్రం పరిధిలో ఉన్నాయని ఆయన చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న కోట్ల విజయభాస్కర్‌డ్డి స్టేడియంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ బలోపేతంపైనే చర్చ జరుగుతుందని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి విస్తృత స్థాయి సమావేశం ఉపయోగపడుతుందన్నారు. అదే విధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకు ఏం చేయాలన్న అంశంపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో పాటు డీసీసీ అధ్యక్షులు, డివిజన్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరవుతారని తెలిపారు. వీరందరికీ ఆహ్వానాలు పంపుతున్నట్లు చెప్పారు. మొత్తం పదిహేను వందల మంది ప్రతినిధులుగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. పీసీసీ నూతన కార్యవర్గం ఉంటుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఇప్పుడు పీసీసీ కార్యవర్గం ఉన్నది కదా? అయినా మీడియాకెందుకు అతృత అంటూ బొత్స ఎదురు ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.