కాంగ్రెస్ మటాష్

 

congచేటు చేయనున్న ఆజాద్ ప్రకటన
మరింతకాలం నాన్చుడే అయితే ఉభయ ప్రాంతాల్లో పార్టీకి నష్టం
పార్టీ శ్రేణుల్లో రేగుతున్న గుబులు.. కల్లోలం రేపిన ఇన్‌చార్జి వ్యాఖ్యలు
ఆగ్రహావేశాల్లో తెలంగాణ జనం.. కట్టలు తెగుతున్న అసంతృప్తి
సంకటంలో టీ కాంగ్రెస్ నేతలు
ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సిన స్థితి
హైదరాబాద్, జనవరి 23 (టీ మీడియా):తెలంగాణ అంశాన్ని మళ్లీ వాయిదా వేస్తున్నారన్న సంకేతాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఖతం చేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణితో ఆ పార్టీ రెండు ప్రాంతాల్లోనూ అడ్రస్‌లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో ఇక ఈ ప్రాంతంలో ఆ పార్టీకి పుట్టగతుల్లేని పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో జగన్ ఫ్యాక్టర్ బలంగా ఉందన్న వాదనలతో అక్కడా సీట్లు గెలిచే అవకాశాలు అడుగంటిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కనీస సంఖ్యలోనైనా సీట్లు వస్తాయా అన్నది అనుమానాస్పదంగా మారుతున్నది.

యూపీఏకు హ్యాట్రిక్ సాధించి, రాహుల్‌ను ప్రధాని పీఠంమీద కూర్చోబెట్టాలన్న అధిష్ఠానం ఆకాంక్షలను సైతం ఈ పరిణామాలు దెబ్బతీస్తాయని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు మాట మార్చుతూ, సాగదీత వ్యవహారాలకు అలవాటుపడిన కాంగ్రెస్ తీరు.. ఆజాద్ తాజా ప్రకటనతో మరోసారి అభాసుపాలైందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీ నాయకులు, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణలో తిరుగలేని పరిస్థితులు ఎదురవుతాయని పార్టీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఐదున్నర దశాబ్దాలుగా సొంత రాష్ట్రం కోసం జరుగుతున్న ప్రజా పోరాటాలను అపహాస్యం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదన్న ఆగ్రహావేశాలు జనం నుంచి వెల్లు కాంగ్రెస్‌కు తెలంగాణ అంశంపై సీరియస్‌నెస్ కొరవడిందని విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణకు డెడ్‌లైన్‌లు లేకపోతే ఇక తేల్చడానికి ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. నెల అంటే 30 రోజులు కాదని, వారం అంటే రెండు వారాలు కూడానని ఆజాద్ భాష్యం చెప్పడం, మరో మూడు నాలుగు సమావేశాల తర్వాత కానీ నిర్ణయం రాదని అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించడం చూస్తుంటే తెలంగాణ విషయంలో సీమాంధ్ర లాబీయింగ్‌కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనకడుగు వేసిందనే విషయం సుస్పష్టమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చర్యతో తెలంగాణలో కాంగ్రెస్‌కు మళ్ళీ కష్టకాలమేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇచ్చిన గడువులోగా ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం ప్రకటించకపోతే తెలంగాణ ప్రాంతంలో పార్టీ నామరూపాలు లేకుండా మటాష్ అయిపోతుందనే భయం, ఆందోళనతో కాంగ్రెస్ వర్గాలు కనిపిస్తున్నాయి.

డైలమాలో టీ కాంగ్రెస్ నేతలు
ఆజాద్ వ్యాఖ్యలతో భవిష్యత్తులో కాంగ్రెస్ ఎదుర్కొనబోయే నష్టాలను పక్కనపెడితే.. తక్షణ దెబ్బ మాత్రం టీ కాంగ్రెస్ నాయకులకే తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. నానా కష్టాలు పడి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయించుకున్న టీ కాంగ్రెస్ నాయకులు.. ఆ సమావేశంలో నెలలో నిర్ణయం ప్రకటిస్తామని షిండే చెప్పిన మాటతో ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకున్నారు. తమ మీద సొంత ప్రాంతంలో ఒత్తిళ్ల నుంచి ఊరట పొందేందుకు షిండే ప్రకటన వారికి అవకాశం కల్పించింది.

కానీ.. ఆజాద్ చేసిన ప్రకటన తెలంగాణపై నీలి నీడలను కమ్మడంతో టీ కాంగ్రెస్ నేతలు డైలామాలో పడ్డారు. దీంతో ఇప్పడు వారేం చేస్తారన్నది తక్షణ సమస్యగా ముందుకు వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలో అర్థం కాని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఆజాద్ ప్రకటన అనంతరం వివిధ చానళ్లలో మాట్లాడిన టీ కాంగ్రెస్ నేతలు తడబాటుకు గురవడం కనిపించింది. సమైక్యాధ్ర కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధపడిన సీమాంధ్ర నాయకుల వలే ఇక్కడ టీ కాంగ్రెస్ నాయకులు కూడా రాజీనామాల అంశాన్ని ఎందుకు ముందుకు తేవడం లేదన్న ప్రశ్న మళ్లీ తలెత్తుతోంది. పార్టీ నాయకత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి, గడువులోగా లేదా కొంచెం అటు ఇటుగానో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం వచ్చేందుకు ఏం చేస్తారన్నది ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతలకు సవాలుగా మారింది. ఇంతకాలం రాజీనామాలు చేయకుండా నెట్టుకొచ్చిన టీ కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకుని వెళతారని పలువురు తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కాంగ్రెస్‌ను వదిలి ఉద్యమంలోకి రావాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా ప్రకటన రాకుంటే మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామంటున్న టీ ఎంపీలు.. ఏ దారిన ఉద్యమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.