కాంగ్రెస్ పరేషాన్! -మజ్లిస్ తెగదెంపులతో కష్టాలు

సుమారు దశాబ్దిన్నరకాలంగా కాంగ్రెస్‌తో కొనసాగిన దోస్తీకి మజ్లిస్ సోమవారం గుడ్‌బై చెప్పింది. దీంతో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రభుత్వాలకు ఇప్పటికిప్పుడు ఎలాంటి నష్టం లేకపోయినా భవిష్యత్తులో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా, మైనారిటీ ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతూ వచ్చిన మజ్లిస్ దూరం కావడంతో ఆ పార్టీకి రానున్న రోజుల్లో కొత్త కష్టాలు వచ్చిపడే ప్రమాదం కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దశాబ్దిన్నర కాలంగా కాంగ్రెస్ కష్టసుఖాల్లో వెంట ఉన్నా తమను ఆ పార్టీ విస్మరించిందని గత కొంతకాలంగా మజ్లిస్ గుర్రుగా ఉంది. చివరకు చార్మినార్ కట్టడం వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయం పనుల విషయంలో కోర్టు స్టే ఉన్నా కూడా ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఆయుధంగా వాడుకొని.. కాంగ్రెస్ దోస్తీకి టాటా చెప్పింది. సెక్యులర్ పార్టీగా నమ్ముతూ స్నేహం కొనసాగించినా ఇప్పుడు మజ్లిస్ నేతలకు అదే కాంగ్రెస్ మతతత్వ పార్టీగా కనిపిస్తోంది.

మజ్లిస్ దోస్తీ బెడిసిన నేపథ్యంలో కేంద్రంలోని యూపీఏ సర్కార్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పై దీని ప్రభావం ఉంటుందని పార్టీ వర్గాల్లో ఆందోళన కనిపిస్తోంది. పార్టీలు వేరైనప్పటికీ ఇది మైనారిటీల సమస్య కావడంతో ఏ ప్రాంతంలో జరిగినా దానిపై మైనారిటీలు ఒక్కటై కాంగ్రెస్‌ను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదని ఆ వర్గాలంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ప్రచారం చేస్తామని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఇప్పటికే ప్రకటించారు. జాతీయ స్థాయిలో మైనారిటీ ప్రతినిధిగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు, వివిధ వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఒక మతతత్వ పార్టీగా చూపిస్తూ ఆయన చేసే ప్రచారంతో పార్టీకి ఆయా రాష్ట్రాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని కూడా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ పాలనలో తమకు భద్రత ఉంటుందో, ఉండదోననే భయంతో మైనారిటీలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూసే అవకాశాలుంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీకి జాతీయస్థాయిలో మంచి ముస్లిం నేతగా గుర్తింపు ఉంది. విద్యాధికుడు, మైనారిటీల సమస్యలపై ధారాళంగా మాట్లాడగల వక్త. ఆయనను వివిధ రాష్ట్రాల్లో మైనారిటీలు అదే కోణంలో ఆదరిస్తారు, గౌరవిస్తారు. దీంతో ఆయన ప్రసంగాలతో మైనారిటీలు కాంగ్రెస్‌కు దూరమవడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో ప్రస్తుతం మజ్లిస్ పార్టీకి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. లోక్‌సభలో ఆ పార్టీకి ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మజ్లిస్ తన మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ప్రభుత్వాలకు ఎలాంటి ఢోకా లేదు. అదే సమయంలో పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసినా కిరణ్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. సంఖ్యాపరంగా చూస్తే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కిరణ్‌ను టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మజ్లిస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. సీఎం నిర్ణయాల వల్ల తమ పార్టీ మైనారిటీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందనే సంకేతాలు ఆ వర్గం వారిలోకి వెళుతున్నాయంటూ కాంగ్రెస్‌కు చెందిన కొందరు నేతలే ఆందోళన చెందుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.