కాంగ్రెస్ కు అవిశ్వాస గండం

cm-సంకట స్థితిలో కాంగ్రెస్ సర్కారు
-మోగిన నగారా.. మోహరిస్తున్న శక్తులు
-టీఆర్‌ఎస్ అవిశ్వాసంతో రగిలిన రాజకీయ వేడి

హైదరాబాద్, మార్చి 11 (టీ మీడియా):అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిపాదన అధికార కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. ప్రజారాజ్యం పార్టీ విలీనంతో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని అతి సులువుగా గట్టెక్కిన కాంగ్రెస్‌ను తాజాగా టీఆర్‌ఎస్ చేసిన ప్రతిపాదన మాత్రం సంకటంలో పడేసింది. గతంలో అండగా ఉన్న మజ్లిస్ పార్టీ నేడు ప్రత్యర్థిగా మారటం కాంగ్రెస్‌కు మరొక ఇబ్బంది.

పదేళ్లుగా తెలంగాణ ఇస్తామని మోసంచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ తీసేందుకు టీఆర్‌ఎస్ పక్కా ప్రణాళికతో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నది. వీటన్నింటికి తోడు అసెంబ్లీ రికార్డుల్లో అధికార పార్టీకి 156 మంది సభ్యుల బలం కనిపిస్తున్నప్పటికీ జంప్ జిలానీల వల్ల అది 143కి పడిపోయిందని, అంటే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనే ప్రచారం జరుగుతున్నది. అసెంబ్లీ నియమావళి ప్రకారం ఏ ఒక్క శాసనసభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసును ఇచ్చేందుకు అవకాశం ఉంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే శాసనసభా వ్యవహారాల సలహాసంఘం (బీఏసీ) ఆ ప్రతిపాదనను పరిశీలించి అవసరమనుకుంటే సభలో చర్చకు అవకాశం ఇస్తుంది. సభలో చర్చ చేపట్టే ముందు ఈ ప్రతిపాదనకు సభ సంఖ్యాబలంలో పదిశాతం మంది సభ్యుల మద్ధతు ఉందా? లేదా? అని స్పీకర్ నిర్ధారించుకుని తుది నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో కనీసం 30 మంది అవిశ్వాస తీర్మాన నోటీసుకు అనుకూలంగా ఉండాలి. ఇదంతా సభ్యుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన పదిరోజులలోపే జరగాల్సి ఉంటుంది. దీనిపై అన్ని పక్షాలు చర్చలు జరిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, ఇక ఈ ప్రభుత్వం ఎంతమాత్రం కొనసాగేందుకు వీలు లేదని తీర్మానం ప్రతిపాదిస్తాయి.

సభలో ఓటింగ్ నిర్వహించి మెజారిటీ సభ్యుల వ్యతిరేకత వ్యక్తమయితే ప్రభుత్వం పడిపోతుంది. రాష్ట్ర ప్రజలు విద్యుత్ కొరత, పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల తదితర కీలక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ముందుకు రానున్న అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు నేరుగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి చర్చకు తీసుకొచ్చే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వామపక్షాలు, బీజేపీ, లోక్‌సత్తా కూడా దాదాపు అందుకు అనుకూలంగానే స్పందిస్తున్నాయి. మజ్లిస్ కూడా కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నందున సభ ముందుకు వచ్చిన సమయంలో అనుకూల నిర్ణయమే తీసుకుంటుందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణ విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ మోసపూరిత విధానాలు అవలంబించడంతో ఈసారి ఎలాగైనా తెలంగాణవాదంతో దెబ్బ చూపించాలని టీఆర్‌ఎస్ పట్టుదలతో కనిపిస్తోంది.

ప్రధాన ప్రతిపక్షాలకు ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీపై ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. అవిశ్వాస తీర్మానానికి ముందుకు రాకుండా ప్రభుత్వాన్ని చంద్రబాబు పార్టీ కాపాడుతున్నదని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు వచ్చిన సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటువేసి తెలుగుదేశం అపకీర్తి తెచ్చుకోదని, టీఆర్‌ఎస్ ప్రతిపాదించినప్పటికీ తప్పనిసరిగా ప్రభుత్వ వ్యతిరేకంగానే ఓటు వేయక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. ఇక వైఎస్సార్సీపీ ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొ సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశం ఎలా ఉన్నా, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చల్లో పాల్గొనేందుకు తాము ఈ తీర్మానానికి మద్దతు ఇస్తామని వామపక్షాలతోపాటు లోక్‌సత్తా, బీజేపీ కూడా ముందుకు వచ్చాయి. మజ్లిస్‌తో టీఆర్‌ఎస్ చర్చలు జరుపుతున్నది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వకపోయినా అవిశ్వాసంపై చర్చను చేప బలం టీఆర్‌ఎస్‌కు ఇతర చిన్న పార్టీలతో లభించనుంది. వైఎస్సార్సీపీకి ప్రస్తుతం అధికారికంగా 17 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వారితో మొత్తం బలం 30కి చేరుతుంది. ఈ రెండు పార్టీల నుంచి వైఎస్సార్సీపీకి మరో పది మంది వరకు అండగా నిలిచే అవకాశాలున్నాయి.

అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
కాంగ్రెస్ (అసెంబ్లీ రికార్డుల ప్రకారం): 155
(వీరిలో ఎనిమిది మంది పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ఒకరికి ఓటు హక్కు లేదు. జగన్ ఆహ్వానిస్తే వైఎస్సార్సీపీలోకి వెళ్ళేవారు మరో నలుగురి వరకుంటారు). అప్పుడు బలం 142 అవుతుంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.