కాంగ్రెస్‌తోనే సెక్యులరిజానికి ముప్పు

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ అన్నిరకాల కుయుక్తులు పన్నుతున్నదని బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ దుయ్యబట్టారు. దేశ లౌకికవాదానికి అతి పెద్ద ముప్పు కాంగ్రెస్‌తోనేనని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగంలో కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. పారదర్శక పాలన, సమర్థనిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి వైఫల్యం, విచ్చలవిడిగా పెరిగిన అవినీతి వంటి అంశాలే కాంగ్రెస్‌కు శత్రువులుగా మారాయి. కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిపోయినా..
rajnathబీజేపీని కొంతైనా నష్టపరచాలని కాంగ్రెస్ భావిస్తున్నది. అందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది అని రాజ్‌నాథ్ పేర్కొన్నారని కార్యవర్గ సమావేశం అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. రాజ్‌నాథ్ సమావేశంలో పేర్కొన్న అంశాలను జవదేకర్ మీడియాకు వివరించారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతోనే కాంగ్రెస్ బలహీన ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడేందుకు సహకరించిందని రాజ్‌నాథ్ పేర్కొన్నట్లు తెలిపారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. బలహీనమైన ఆ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని విమర్శించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆమ్‌ఆద్మీ పార్టీ బలహీన ప్రభుత్వం ఏర్పాటుచేసి తమ శ్రమను వధా చేసుకుందని విమర్శించినట్లు తెలిసింది. యూపీఏయేతర, ఎన్డీఏయేతర పక్షాలను ప్రోత్సహించి.. బీజేపీ అధికారంలోకి రాకుండా హంగ్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ ఎత్తు వేస్తున్న విషయంపై కూడా బీజేపీ దష్టిసారించినట్లు సమాచారం. దేశ లౌకికవాదానికి ముప్పుగా మారిన కాంగ్రెస్ పాలనలో.. సంఘ విద్రోహ శక్తులు చెలరేగుతూ దేశాన్ని బలహీనపర్చేలా వ్యవహరిస్తున్నాయని రాజ్‌నాథ్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే తప్పనిసరిగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు విలువలతో కూడిన పాలన అందిస్తుంది అని పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ పేర్కొన్నట్లు జవదేవకర్ తెలిపారు. ఈ సందర్భంగా యూపీఏను పనికిరాని ఆస్తిగా రాజ్‌నాథ్ అభివర్ణించినట్లు చెప్పారు. జవదేకర్ కథనం ప్రకారం.. రాజ్‌నాథ్ తన ప్రసంగంలో.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తే.. ఇప్పుడు అవినీతి, నిరుద్యోగరహితస్వాతంత్య్రం కోసం పోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు అధికారం కట్టబెట్టడానికి ప్రజలు కీలక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయబాటలు వేసిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్, వసుంధర రాజేలకు ప్రశంసలు తెలిపారు. గోవా సదస్సు (మోడీని లోక్‌సభ ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించిన సదస్సు) తర్వాత దేశంలో రాజకీయ వాతావరణమే కాదు ప్రజల ఆలోచనాధోరణి కూడా మారిపోయిందన్నారు. 1885లో బ్రిటీష్ జాతీయుడు ఏఓ హ్యూమ్ ఆంగ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెను స్థాపించారని తెలిపారు. బాల గంగాధర్ తిలక్ 1905లోనే పూర్తి స్వాతంత్య్రం కోసం పిలుపునిస్తే.. కాంగ్రెస్ 1930లో తీర్మానం చేసిందని విమర్శించారు. బీజేపీ రాజకీయ, ఆర్థిక తీర్మానాలను శనివారంనుంచి ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గమండలిలో తుది మెరుగులు దిద్దనున్నారు. బూత్ స్థాయి కమిటీలను నియమించడంతోపాటు లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను మండలి సదస్సులో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.