కసి రగిలే క్షణాలలో

నీ గాన సౌందర్యంలో
నా మట్టి కొత్త శకమై పరిమళించింది
నీ అడుగుల సవ్వడికి నా నేలంతా
సంధ్యారాగమయి ప్రభవించింది
నీ స్వర తరంగాల ఝంఝ మారుతంలో
నా వీర తెలంగాణ ఘీంకార నాదమయింది
నీ రేలపాట వెన్నెలై ప్రకంపించినప్పుడు
సముద్రం స్తంభించింది
కోకిలమ్మ మూర్చనలు పోయింది
నువ్వు ..వసంత మేఘరాగాన్ని
ఆలపించే వయెలిన్‌వనీ
తూర్పు కొండల ఉషోదయాన్ని
మోసుకొచ్చే ప్రభాత రవివనీ
జనపథాల చిరుగాలి రవళివనీ
ప్రభాత సమయంలో వెలిసిన
విప్లవ కథా క్షేత్రానివనీ
నా తరం తరమంతా మీ పాటల, మాటల పసందులో
కన్నీళ్లను కత్తులుగా మార్చుకుంది
నీ కవితల ఖజానాలో/కదం తొక్కిన కాలం
ఆశయాలను అ.ఆలుగా దిద్దుకుంది
ఆదర్శాన్ని అమ్మవలె నమ్మింది
అలలాంటి ఆనాటి యువలోకం
అకాలంగా అసువులు బాసింది
నీకు దొరికింది అభివృద్ధి, అమెరికా
మాకు మిగిలింది అమరత్వం
సమున్నతమయిన ఆశయం
కానీ..! ఇప్పుడు /కసి రగిలే క్షణాలలో
రక్తంతో శ్రుతి చేసిన రాగానికి
కొత్త నగిషీలు చెక్కుతున్నావు
నడి వయస్సు జీవన కావ్యానికి
కాసుల పల్లవి పేర్చుతున్నావు
కత్తిపాటను కాళ్లతో తొక్కుతున్నావు
వీధి వీధిన/వీరగాథలు వినిపిస్తాననీ
నువ్వుచేసిన బాసలకు
నీవే ఖరారునామా రాసుకున్నావు
డియర్ కామ్రేడ్
ఈ భూమి గాయానికి గేయానికి
వారధివేననీ సారథివి కావని
తెలుసుకో.. గతం నీడన
భ్రమల తెరలు దించకు
నలుగురు కలిసి నడిచే దారిపై
నాలుగు రాళ్లు విసిరేయకు
కొత్తపాటకు..పాతరాగాన్ని మీటకు
కులమనీ..!..మనువనీ..!
కుతంవూతమనీ..!.. కుట్రనీ…

-ఎస్.జగన్‌డ్డి
(వంగపండు ప్రసాదుకు, అవకాశవాదులౌతున్న తెలంగాణ
రచయితలకు నిరసనతో.

This entry was posted in POEMS.

Comments are closed.