కసబ్‌కు ఉరి న్యాయమైనదే-హర్షం వ్యక్తం చేసిన రాజకీయ పక్షాలు

 

Fest
-దేశవ్యాప్తంగా సంబురాలు
-మరి అఫ్జల్ గురు మాటేమిటి?
-కేంద్రాన్ని ప్రశ్నించిన బీజేపీ
ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌కు విధించిన ఉరి శిక్ష వంద శాతం సమంజసమేనని దేశంలోని అన్ని రాజకీయపక్షాలు పేర్కొన్నాయి. కసబ్ ఉరి తీయడంలో ఆలస్యమైనా సరైన నిర్ణయమే తీసుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘కసబ్ ఉరి తీసిన కేంద్రాన్ని అభినందిస్తున్నా. ముంబై దాడికంటే ఎన్నో ఏళ్ల ముందు పార్లమెంట్, గుజరాత్‌లో ఉగ్రవాద దాడి చేసిన అఫ్జల్‌గురును ఎందుకు ఉరితీయడంలేదు’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడి కేంద్రాన్ని ప్రశ్నించారు. శివసేన అధినేత బాల్‌ఠాక్రే బతికిఉంటే ఈ రోజు ఎంతో సంతోషించేవారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్ తెలిపారు. కసబ్ ఉరిని రహస్యంగా ఉంచిన కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. ఈ సందర్భంగా లష్కర్ ఉగ్రవాది కసబ్‌ను సాయుధుడుగా పేర్కొన్న అమెరికా మీడియాను ఒమర్ దుయ్యబట్టారు. కసబ్ ఉరిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణ స్పందిస్తూ తప్పుడు ఆలోచనలు.. తప్పుడు ఫలితాలు చూపుతాయని అన్నారు. భారతదేశానికి న్యాయం జరిగిందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి తివారీ పనాజీ అన్నారు. ‘‘చెడ్డ పనులు చేస్తే.. అంతకన్నా చెడ్డ ఫలితం అనుభవిస్తారు’’ అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌యాదవ్, ఎల్‌జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు.

న్యాయం గెలిచింది..: బాలీవుడ్
కసబ్ ఉరితో న్యాయం గెలిచిందని బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ మధుభండార్కర్, అనుపమ్‌ఖేర్, ఓంపురి, అభిషేక్‌బచ్చన్, రామ్‌గోపాల్‌వర్మ, రవీనాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, శ్రేయాస్ తల్పడే తదితరులు ట్వీట్ చేశారు. లష్కర్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరిపై హర్షం వ్యక్తం చేస్తూ.. అస్సాం రాజధాని గౌహతిలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తీవ్రవాద చర్యలను ఖండిస్తూ సంస్థలు బాణాసంచా కాల్చుతూ వేడుకలు జరిపాయి. భారత్‌లో దాడులు సృష్టించాలనుకునే ఉగ్రవాదులకు ఇదో హెచ్చరిక అని ఆ సంస్థల సభ్యులు అన్నారు. ముంబైలోని ముస్లిం వర్గాలు కసబ్ ఉరి సమంజసమేనని పేర్కొన్నాయి. కసబ్‌ను రహస్యంగా ఉరి తీయాల్సిన అవసరం లేదని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు కేజ్రీవాల్ వెల్లడించారు. పారదర్శకత పాటించాల్సి ఉండాల్సిందన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.