కసబ్‌కు ఉరి

 

kasab-in-taj -పుణె ఎరవాడ జైలులో శిక్ష అమలు
-ఉదయం 7.30 గంటలకు.. అత్యంత రహస్యంగా ఆపరేషన్ ఎక్స్
-5న కసబ్ క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
-ఆ వెంటనే లాంఛనాలు పూర్తి.. కోర్టు నిర్దేశించిన తేదీ ప్రకారమే శిక్ష
-ప్రధానమంత్రికి, సోనియాకు కూడా తెలియదు
వారూ టీవీ వార్తల్లోనే చూశారు: హోం మంత్రి షిండే
-కసబ్ ఉరి సమాచారం అందింది: పాక్
-మృతదేహం తీసుకోవడానికి నిరాకరణ
ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఎట్టకేలకు ఉరితీశారు. గుట్టుచప్పుడు కాకుండా.. పుణెలోని ఎరవాడ జైలులో బుధవారం ఉదయం 7.30 గంటలకు కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. 166 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై మారణకాండలో సజీవంగా పట్టుబడ్డ ఏకైక లష్కరే ఉగ్రవాది కసబ్. అతడి క్షమాభిక్ష అభ్యర్థనను నవంబర్ 5న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. ఆ వెంటనే అధికారిక లాంఛనాలన్నీ చకచకా జరిగిపోయాయి. నవంబర్ 19వ తేదీన కసబ్‌ను ఆర్థర్‌రోడ్డు జైలు నుంచి అత్యంత భద్రత మధ్య ఎరవాడ కారాగారానికి తరలించారు. ఉరితీయబోయే విషయాన్ని 12వ తేదీన కసబ్‌కు జైలు అధికారులు తెలిపారు. 19వ తేదీన డెత్ వారెంట్‌పై అతని సంతకం తీసుకున్నారు. ఉరిశిక్ష అమలు సందర్భంగా కసబ్ ఆందోళనగా కనిపించినప్పటికీ, మౌనంగా ఉన్నాడని జైలు అధికారులు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎక్స్’ గురించి ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి కూడా తెలియదని కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారు. వారు కూడా టీవీ వార్తలు చూసి విషయం తెలుసుకున్నారన్నారు.

కసబ్‌ను ఉరితీయనున్నట్టు పాక్‌కు సమాచారం అందించినా, ఆ దేశం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు. అయితే ఈ వాదనను పాక్ తిరస్కరించింది. కసబ్ ఉరిపై భారత్ పంపిన సమాచారాన్ని స్వీకరించామని తెలిపింది. కసబ్ మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదని పేర్కొంది. కసబ్‌కు ఉరిశిక్షపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. మరోవైపు కసబ్ ఉరికి ప్రతీకారంగా మరిన్ని దాడులు చేస్తామని ఉగ్రవాద లష్కరే తోయిబా హెచ్చరించింది. దీనితో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టంచేశారు.

taj-bombayముంబై మారణకాండ దోషి అజ్మల్ కసబ్ కథ ముగిసింది. ముంబైలో విచక్షణారహితంగా సామాన్యుల ప్రాణాలు బలిగొని.. సజీవంగా చిక్కిన ఏకైక లష్కరే తోయిబా ఉగ్రవాది కసబ్‌కు పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైల్లో బుధవారం ఉదయం 7.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు. ముంబై దాడుల ఘటనకు మరో వారంలో నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో అత్యంత గోప్యంగా అతడిని ఉరితీశారు. కసబ్‌కు మరణదండన అమలును మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ధ్రువీకరించాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. అయితే కసబ్ ఉరి గురించి సమాచారం విషయంలో భారత్, పాక్ మధ్య వివాదం నెలకొంది. తాము సమాచారం అందించినా పాక్ ధ్రువీకరించలేదని భారత్ పేర్కొనగా, పాక్ మాత్రం కసబ్ ఉరి సమాచారాన్ని స్వీకరించామని తెలిపింది. మరోవైపు కసబ్ ఉరిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.
ఉదయం 7.30 గంటలకు 25 ఏళ్ల కసబ్‌ను ఉరితీసినట్టు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్.. ఇది జరిగిన కాసేపటికి ప్రకటించారు. ఎరవాడ జైలు ప్రాంగణంలో కసబ్‌ను ఖననం చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.

కసబ్ చివరి కోరికగా ఏమీ కోరుకోలేదని చవాన్ ముంబైలో విలేకరులకు తెలిపారు. క్షమాభిక్ష పెట్టాలన్న కసబ్ విజ్ఞప్తిని ఈ నెల 5న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. ఈ వెంటనే ఉరిశిక్ష అమలుకు కావాల్సిన అధికారిక లాంఛనాల న్నీ చకచకా జరిగిపోయాయి. కసబ్‌కు ఉరి తో.. అత్యంత భయాన క ముంబై మారణహోమం ఘటన విచారణలో ఓ ప్రధాన ఘట్టం ముగిసింది. నవంబర్ 26, 2008న ప్రారంభ మై.. అరవై గంటల పా టు కొనసాగిన ఈ ము ట్టడిలో పదిమంది లష్క రే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు విచక్షణారహితంగా పేట్రేగి..కాల్పులు, బాంబుల మోతతో 166 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నా రు. ఈ దాడిలో తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చగా, కసబ్ ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. అరెస్టయిన నాటి నుంచి అత్యంత భద్రత మధ్య ఆర్థర్ రోడ్డు జైలులోని ప్రత్యేక సెల్‌లో ఉంటున్న కసబ్‌ను ఈ నెల 18, 19వ తేదీ అర్ధరాత్రి ఎరవాడ జైలుకు తరలించారు.

tread ఉరిశిక్ష తేదీని కోర్టు నిర్ణయించింది: షిండే
‘‘నవంబర్ 5న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఏడో తేదీన నేను పిటిషన్‌పై సంత కం చేశారు. ఎనిమిదో తేదీన ఇందుకు అనుగుణంగా చర్య తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాము. నవంబర్ 21న ఉదయం 7.30 గంటలకు అతనికి ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించడమైం ది. అందుకు అనుగుణంగా ఈ రోజు పూర్తయింది’’ అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. భారత్ పంపిన సమాచారాన్ని ధ్రువీకరించి.. కసబ్ మృతదేహాన్ని అప్పగించాలని పాక్ ముందుకు రాలేదని, పాక్ అడిగితే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆయన స్పష్టంచేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఉరిశిక్ష అమలు చేశారన్న వార్తలను ఖండించారు.

పాక్ చట్టబద్ధంగా వ్యవహరించాలి: ఖుర్షీద్
కేంద్ర విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ అనివార్యమైన ఈ ఉరిశిక్ష గురించి చట్టవూపకారం పాకిస్థాన్ ప్రభుత్వానికి, కసబ్ కుటుంబానికి తెలియజేశామని తెలిపారు. ‘‘ఈ రోజు ఉదయం మరణశిక్ష అమలు చేయడం గురించి పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి తెలియజేయడానికి మేము ప్రయత్నించాం. ఫ్యాక్స్ ద్వారా పంపిన సమాచారాన్ని అంగీకరించకపోవడంతో.. వారికి నేరుగా సమాచారాన్ని తెలిపాం’’ అని ఖుర్షీద్ బుధవా రం విలేకరులకు తెలిపారు. కసబ్ విషయం లో భారత్ చట్టాన్ని పూర్తిగా అనుసరించిందని, ముంబై దాడుల కేసులో పాకిస్థాన్ కూ డా ఈ కేసులో చట్టవూపకారం నడుచుకొని.. ఈ కేసుకు ముగింపు ను ఇస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఆచితూచి పాక్ స్పందన!
కసబ్‌కు ఉరిశిక్ష అమలు విషయంలో పాకిస్థాన్ ఆచితూచి స్పందించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తామని పాక్ విదేశాంగ ప్రతినిధి మోఅజాం ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కసబ్ ఉరికి సంబంధించి ముందస్తుగా అందించిన సమాచారాన్ని పాక్ తిరస్కరించిందన్న భారత్ వాదనను పొరుగుదేశం తిరస్కరించింది. పాక్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ మంగళవా రం సాయంత్రం విదేశాంగ కార్యాలయంలోకి వచ్చి సమాచారాన్ని అందించారని, దానిని విదేశాంగ దక్షిణాసియా జనరల్ డైరెక్టర్ స్వీకరించి.. ఆమోదించారని తెలిపింది. కసబ్ మృతదేహాన్ని అప్పగించాలని అతని కుటుంబం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పాక్ అంతర్గత మంత్రి రహ్మాన్ మాలిక్ తెలిపారు.

మరిన్ని దాడులకు కసబ్ స్ఫూర్తి: లష్కరే
ముంబై దాడుల దోషి అజ్మల్ కసబ్‌ను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హీరోగా అభివర్ణించింది. కసబ్ స్ఫూర్తితో మరిన్ని దాడులు చేస్తామని, అతని దారిని పోరాటయోధులు అనుసరిస్తారని ముంబై దాడుల వెనుక సూత్రధారిగా భావిస్తున్న ఎల్‌ఈటీ సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. భారత్‌పై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ తాలిబన్ సంస్థ కసబ్ ఉరిశిక్షపై దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. భారత్ గడ్డపై ముస్లింను కోల్పోవడం పెద్ద లోటు అని తాలిబన్ ప్రతినిధి ఇన్సానుల్లా ఇన్సాన్ విలేకరులకు తెలిపారు.

chatrapathi-terminul-attack ఎప్పుడేం జరిగింది?..
ఉగ్రవాది కసబ్ ముంబైలో మారణహోమానికి పాల్పడిన నాలుగేళ్లకు పుణెలో బుధవారం ఉరి తీశారు. అతడు పట్టుబడిన నుంచి ఉరికంబం ఎక్కేవరకు జరిగిన పరిణామాల నేపథ్యం..
-2008 నవంబర్ 26న కసబ్‌తోపాటు మరో తొమ్మిది ఉగ్రవాదులు ముంబైలో కమెండో తరహాలో దాడికి పాల్పడ్డారు.
-2008 నవంబర్ 27న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటలకు కసబ్ పట్టుబడ్డాడు. అప్పటివరకు కసబ్ బృందం మారణకాండను సాగించింది. అనంతరం కసబ్‌ను అరెస్టు చేసిన ముంబైలోని నాయర్ ఆస్పవూతిలో చికిత్స కోసం చేర్చారు.
-2008 నవంబర్ 30న ముంబై పోలీసుల ముందు దాడికి పాల్పడినట్లు అంగీకరించాడు.
-2008 డిసెంబర్ 27, 28 తేదీల్లో కసబ్‌ను ముంబై ప్రజలు గుర్తించడానికి ప్రదర్శన ఏర్పాటు చేశారు.
-2009 జనవరి 13న ముంబై దాడులపై విచారణ కోసం ఎంఎల్ తహల్యానీని నియామకం..
-2009 జనవరి 16న కసబ్ కేసును విచారించడానికి గట్టి భద్రత కలిగిన ఆథర్ రోడ్డులోని జైలును ఎంపిక చేశారు.
-2009 ఫిబ్రవరి 22న కసబ్ కేసులో ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియామకం
-2009 ఫిబ్రవరి 25 కసబ్‌పై చార్జిషీట్..
-2009 ఏప్రిల్ 1న కసబ్ తరఫున వాదించడానికి అంజలి వాఘ్‌మారే అనే న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది.
-2009 ఏప్రిల్ 15న అంజలి నియామకాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
-2009 ఏప్రిల్ 16న కసబ్ న్యాయవాదిగా అబ్బాస్ ఖాజ్మీని నియమించారు.
-2009 మే 8న ప్రత్యక్ష సాక్షిని మొదటిసారిగా కసబ్ ముందు ప్రవేశపెట్టారు. ఆ సాక్షి కసబే మారణకాండ సాగించారని గుర్తుపట్టారు.
-2010 మే 6న కసబ్‌కు మరణ శిక్ష ఖరారు.
-2011 ఫిబ్రవరి 21న కబస్ ఉరిని ముంబై హైకోర్టు సమర్థన..
-2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు ఉరిశిక్ష నిలిపేస్తూ ఆదేశాలు..
-2011 అక్టోబర్ 10న తనను ఉగ్రవాదులు రోబో మాదిరిగా తయారు చేశారని, దేవుడిపేరుతో మారణహోం సృష్టించారని నూరిపోశారని, చిన్న వయస్సు కావడంతో తాను ఆ మాటలకు లొంగానని, చిన్నవాడినైన తనకు ఉరి శిక్ష సబబుకాదని సుప్రీంకోర్టుకు విన్నవించారు.
-2012 జనవరి 31న విచారణ సరిగ్గా సాగడంలేదని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశాడు.
-2012 ఆగస్టు 29న కసబ్ అభ్యర్థనలన్నీ కొట్టివేసి.. ఉరి శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
-2012 అక్టోబర్ 16 కసబ్ క్షమాభిక్షను తిరస్కరించాలని రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ సిఫారసు..
-2012 నవంబర్ 5న రాష్ట్రపతి.. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ
-2012 నవంబర్ 21న ఎరవాడ జైల్లో కసబ్‌కు ఉరి అమలు.

దొంగ నుంచి ఉగ్రవాదిగా..
-ఇదీ కసబ్ ప్రస్థానం
కసబ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోటా గ్రామం లో జన్మించాడు. ఆయన తండ్రి వీధుల వెంట ఆహార పదార్థాలను అమ్ముకుని జీవించే వ్యాపారి.ముంబైలో మారణహోమం సృష్టించేనాటికి కసబ్ వయస్సు 21 ఏళ్లు మాత్రమే. చిన్నతనంలో ఒకసారి కసబ్ పండుగకు కొత్తబట్టల కొనివ్వాలని తండ్రి వద్ద మారాం చేశా డు. కొనివ్వకపోవడంతో ఇంట్లో నానా బీభత్సం సృష్టించాడు. అప్ప టి నుంచి స్నేహితుడు ముజఫర్‌లాల్‌తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆయుధాల దొంగగా మారాడు. ఒకసారి ఆయుధాల కొనుగోలు సమయంలో ఎన్‌కౌంటర్ జరిగిం ది. అప్పుడు కసబ్‌కు లష్కరే ఉగ్రవాదులతో పరిచయం కలిగింది. వారితో పరిచయం పెంచుకుని శిక్షణకు వెళ్లాడు. మొత్తం 24 మంది కి శిక్షణ ఇస్తే.. వారిలో కసబ్ ఒకడు. ఇందులో నుంచే ముంబై దాడి కి 10 మందిని ఎంపిక చేశారు. వారు పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా ముంబై చేరుకున్నారు. ఆ తర్వాత 10 మంది ఐదు బృందాలుగా విడిపోయారు. కసబ్ వెంట ఇస్మాయిల్ ఖాన్ ఉన్నాడు. యాంటీ టెర్రర్ స్కాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఎన్‌కౌంటర్ నిపుణుడు విజయ్ సలాస్కర్, అడిషనల్ కమిషనర్ అశోక్ కామ్టేలను కాల్చి చంపినట్లు పోలీసుల ముందు కసబ్ అంగీకరించాడు.

డెత్ వారెంట్‌పై కసబ్ సంతకం
ఈ నెల 19వ తేదీన ఎరవాడ జైలులోని తన సెల్‌లో కసబ్ ఎదుట సీనియర్ జైలు అధికారి డెత్ వారెంట్ (మరణ ఉత్తర్వు)ను చదివి వినిపించారు. తన క్షమాభిక అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించిన విషయాన్ని అతనికి తెలిపారు. అనంతరం డెత్‌వాంట్‌పై కసబ్ సంతకం చేశాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పలువురు సీనియర్ అధికారులు, 200 మంది ఐటీబీపీ దళం రక్షణలో 2009 మార్చ్ నుంచి ఆర్థర్ రోడ్డు జైలులో కసబ్ గడిపాడు. కసబ్ భద్రత, ఆహారం, వైద్యం కోసం రూ. 29 కోట్లు ఖర్చు చేసినట్టు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఇందుకు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేసినట్టు విశ్వసనీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆపరేషన్ ఎక్స్!
కసబ్ ఉరిశిక్ష ఆపరేషన్ అత్యంత రహస్యంగా.. చీమ చిట్టుక్కుమన్నంత సమాచారం కూడా బయటకు పొక్కకుండా నిర్వహించారు. ఆపరేషన్ ఎక్స్ గా నామకరణం చేసిన ఈ కార్యాన్ని ఓ ప్రత్యేక ఇన్‌స్పెక్టర్ జనరల్, 16 మంది నిపుణులైన పోలీ సు అధికారుల నేతృత్వంలో చేపట్టారు. నవంబర్ 5న రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంతో ఆపరేషన్ ప్రారంభమైంది. నవంబర్ 21న కసబ్‌ను ఉరితీయాలని మొదట నిర్ణయించారు. ఇందుకు అధికారిక లాంఛనాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఉరి విషయం మహారాష్ట్ర పోలీసు విభాగంలో, సర్కారులో, కేంద్ర ప్రభుత్వంలో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. నవంబర్ 18, 19 తేదీ అర్ధరాత్రి క్వీక్ రెస్పాన్ బృందం, ఐటీబీటీ అధికారుల రక్షణలో ప్రత్యేక విమానంలో గుట్టుచప్పుడు కాకుండా కసబ్‌ను ఆర్థర్ రోడ్డు జైలు నుంచి ఎరవాడ తరలించారు. జైలు సూపరింటిండెంట్, డిప్యూటీ జైలర్‌కు తప్ప మరెవరికీ కసబ్ వివరాలను తెలియజేయలేదు. చివరి నిమిషం వరకు తలారికి తాను ఉరితీయబోయేది కసబ్‌ను అని తెలియదు. కసబ్‌ను ఉరిశిక్షను అమలును అత్యంత రహస్యంగా నిర్వహించామని, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు కూడా ఈ విషయాన్ని టీవీ ద్వారానే తెలుసుకున్నారని కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు.

ఉరిశిక్ష నిషేధాన్ని వ్యతిరేకించిన తర్వాతిరోజే కసబ్‌కు ఉరి
-ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయని భారత్
యునైటెడ్ నేషన్స్, నవంబర్ 21: ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో రికార్డు స్థాయిలో 110 దేశాలు ఉరిశిక్ష నిషేధానికి అంగీకరించినా.. భారత్ మాత్రం వ్యతిరేకించింది. ప్రతి దేశం తన న్యాయవ్యవస్థను సొంతంగా ఏర్పాటుచేసుకుంటుందని తెలిపింది. కాగా, ఆ తర్వాతి రోజే లష్కర్ ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష విధించడం గమనార్హం. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌గా ఉన్న భారత్ ఉగ్రవాద పెట్టుబడులపై దృష్టిసారించాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఉగ్రవాదులు స్టాక్‌మ్కాట్లలో పెట్టుబడులు పెడుతూ.. తమ శక్తిసామర్థ్యాలను పెంచుకుంటున్నారు. ఇది ప్రపంచానికే ముప్పు అని ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి హరిదీప్‌సింగ్ అన్నారు. కౌంటర్ టెర్రరిజం కమిటీకి అనుబంధంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (టీఏటీఎఫ్) పనిచేస్తుందని వెల్లడించారు.

అమ్మీకి చెప్పండి! కసబ్ చివరి మాట
ఉరిశిక్షకు ముందు కసబ్ ఉద్విగ్న క్షణాలు అనుభవించాడు. అతడు ఆందోళన గా కనిపించినప్పటికీ, మౌనంగానే ఉన్నాడని, ప్రార్థనలు చేశాడని జైలు అధికారి ఒకరు తెలిపారు. ‘‘అతని శరీర భాష ఆధారంగా, కసబ్ ఆందోళనలో ఉన్నాడని గుర్తించగలిగాం. ఉరిశిక్ష అమలు కోసం అతన్ని సెల్ నుంచి బయటకు తీసుకొచ్చే వరకు మౌనంగానే ఉండిపోయాడు’’ అని ఆ అధికారి చెప్పారు. కసబ్ ప్రార్థనలు నిర్వహించాడని, ఉరిశిక్ష గురించి ముందే తన కుటుంబానికి తెలియజేశారా? అని ఆరా తీశాడని, ఇందుకు జైలు అధికారులు సానుకూలంగా సమాధానం చెప్పారని వివరించారు. ఈ నెల 21న తనను ఉరితీయబోతున్నట్టు కసబ్‌కు తెలియజేయగా నే ‘‘ఈ వార్తను మా అమ్మీకి (అమ్మకు) చెప్పండి’’ అని కోరాడని, ఈ నెల 12నే కసబ్‌కు ఉరిశిక్ష విషయాన్ని తెలిపారని న్యూఢిల్లీలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తల్లి నూరీ లాయ్ అంటే కసబ్‌కు అమితమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. చివరి కోరిక ఏమిటో తెలుపాలని కసబ్‌ను అడగ్గా.. అతను తన తల్లి పేరు మాత్రమే పలికాడని ఆ వర్గాలు తెలిపాయి. లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత..కసబ్ తల్లికి, అతని కుటుంబసభ్యులకు ఈ వార్తను తెలియజేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్.. విదేశాంగ కార్యదర్శి రంజన్ మత్తాయ్‌కి లేఖ రాశారు. కసబ్ చివరి కోరిక నెరవేర్చడంలో భాగంగా ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ మంగళవారం కొరియర్ ద్వారా అతని తల్లికి లేఖ పంపారు.

అల్లా క్షమించు..!
విశ్వసనీయవర్గాల ప్రకారం.. కసబ్ ఉరిశిక్ష పూర్తి సీన్ ఇది!
ఎరవాడ జైలులో బుధవారం తెల్లవారుజామున కసబ్ నిద్రలేచాడు. స్నానం, ప్రార్థనల కోసం అరగంట వెచ్చించాడు. అతడు వేసుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చారు. 6 గంటలలోగా మహారాష్ట్ర జైళ్ల ఐజీ మీరన్ బొర్వాంకర్, జైళ్ల ఎస్పీ యోగేశ్ దేశాయ్ జైలుకు చేరుకున్నారు. మొదట కసబ్‌ను వైద్య చికిత్స కోసం తీసుకెళ్లారు. జైలు డాక్టర్ అతన్ని పరీక్షించి.. ఆరోగ్యంగా ఉన్నాడనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఉరిశిక్ష అమలు చేయడానికి నాగ్‌పూర్ నుంచి తలారి వచ్చారు. తర్వాత ఉరి తీయబోయే ప్రత్యేక సెల్‌కు అతన్ని తరలించారు.

అధికారులు కసబ్ రెండు ప్రశ్నలు అడిగారు. నీ చివరి కోరిక ఏమిటి? నీ వస్తువులు ఏమైనా నీ వారికి ఇవ్వాలనుకుంటున్నావా? రెండింటికీ అతడు వ్యతిరేక సమాధానం చెప్పాడు. ఉరికంబం ఎక్కబోయే ముందు కసబ్ ‘‘అల్లా మీద ప్రమాణం, ఇలాంటి తప్పు ఇంక ఎప్పుడు చేయను’’ అని అన్నట్టు.. క్షమించు అల్లా అని వేడుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు ఉరితీయగా, పది నిమిషాల అనంతరం అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.