కళా నర్సింగం


బి. నర్సింగరావు… తెలిసిన పేరే.. ఇంటర్నేషనల్ ఫిగర్!సినిమాలు తీస్తాడు… అదీ తెలుసు!అడ్రస్… రంగులకల, దాసి, మా భూమిలాంటి అద్భుతమైన సినిమాలే కదా! అదీ తెలుసు!ఇంకేం తెలుసు.. ఆయన చిత్రకారుడు, యాక్టర్, నిర్మాత, కవి, రచయిత కూడా!అవార్డుల సంగతి… సినిమాకు రెండుమూడొచ్చాయి ఏం చెప్పమంటారు?కొత్త విషయం ఏమైనా తెలుసా? ఏముంటది.. ఆయనకు మళ్లీ ఏదో అవార్డు వచ్చి ఉంటుంది అంతే కదా!నిజమే! ఈసారి ‘బీఎన్‌రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డు’కు ఎంపికయ్యాడు.ఆయనకు రావడం కరక్టే… ఈ సందర్భంగా మళ్లీ ఓసారి ఆయన గురించి చదువుకోవచ్చు!చిన్నప్పుడు బి. నరసింగరావుకు రన్నింగ్, లాంగ్‌జంప్‌లలో మొదటి బహుమతులు వస్తుండేవి. కానీ తన మిత్రుల్లో కొందరు అన్ని ఆటలు కలుపుకుని మొత్తంగా పదిపదిహేను బహుమతులు సాధించుకునేవారు. ఆ సమయంలో వాళ్లను చూసి నరసింగరావు కుళ్లుకునేవాడట. అప్పటి నుంచే ఆయనలో కసి పెరిగింది. బహుమతి సాధించాలంటే తానింకా కష్టపడాలనుకున్నాడు. ఏ పని చేసినా సిన్సియర్‌గా చేయడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కువ ఈవెంట్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టాడు. ఇప్పుడాయన వయసు అరవై ఐదేళ్లు.. వర్కింగ్ స్టయిల్ మాత్రం అదే. అందుకే ఆయన ఉన్న రంగంలో ఎన్నో అవార్డులు నర్సింగరావు వెంట నడిచొచ్చాయి. ఇప్పటికీ ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. నిన్నటికి నిన్న వచ్చిన ‘బీఎన్‌రెడ్డి జాతీయ చలన చిత్ర అవార్డు’ కూడా అలాంటి గౌరవమే.నర్సింగరావు అంటే తెలంగాణ సినిమాలకు విలాసం. ఆయన చిత్రాలు అద్భుతమైన ఆర్ట్‌పీస్‌లు. అందుకే అవి భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసాయి. ఆయన జీవితం కూడా అంతే! ఎలాంటి సంచలనాలు లేకుండా సాఫీగా సాగిపోతున్నా… సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ సినిమాకు ప్రాణం పోసిన ఆయన ఉనికి అందరినీ మేల్కొలుపుతుంది.

ఒక వ్యక్తికి ఎన్ని కళలు ఉండాలి?ఎన్నైనా ఉండవచ్చు! అవును బి. నర్సింగరావును చూస్తే ఆ మాట ఒప్పుకోవాల్సిందే. ఆయన కళాకారుడు కాదు కళలకు చిరునామా లాంటి మనిషి. యాదృచ్చికంగా అలవాటైన కళలే అయినా వాటిల్లో నిజాయితీగా లీనమైపోయాడు. నాటకాలు వేయడం దగ్గర్నుంచి బొమ్మలు గీయడం వరకు ఆయన పని చేసిన ప్రతి రంగంలో తన ప్రత్యేకతను చూపించగలిగాడు.నోట్లో పది గోల్డెన్ స్పూన్లతో1946 డిసెంబర్ 26న మెదక్ జిల్లాలోని ప్రజ్ఞాపూర్ అనే ఓ గ్రామంలో పుట్టాడు నర్సింగరావు. తండ్రి పే…ద్ద భూస్వామి. ఇంట్లో పదహారు మంది పనివాళ్లు. ఒక్కముక్కలో చెప్పాలంటే నర్సింగరావు జీవితం స్వర్గంలో ఓపెన్ అయ్యిందనుకోవాలి. బాల్యమంతా లావిష్ లైఫ్. దేనికీ లోటు లేదు. ఇక జీవితాన్ని అనుభవించడమే. సామాన్యజనానికి దూరంగా తన బలం, బలగం మధ్య దర్జాగా బతికేస్తే సరిపోతుంది కానీ నర్సింగరావు జీవితం అలా సాగలేదు. తనకు తెలియకుండానే ప్రజల్లోకి వెళ్లాల్సి వచ్చింది.తన కుటుంబంలో, వంశంలో కూడా కళాకారులు అనేవాళ్లే లేరు. కానీ నర్సింగరావు గొప్ప ఆర్టిస్టు కాదు కాదు… ప్రజా కళాకారుడిగా ఎదిగాడు. ఈ ఒక్క అంశంతోనే ఆయన పరిచయం ఆగిపోదు. నటుడిగా, దర్శకుడిగా, పెయింటర్‌గా, కవిగా ఆయన పాటవం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రశంసలు అందుకుంది. అందుకే నర్సింగరావు బయోడేటా తయారు చేయాలంటే కనీసం పది పేజీలు సర్దాలి.

ప్రత్యేక కారణం ఏమీ లేదు…
నర్సింగరావుకు ఒక్కో దశలో ఒక్కో కళ అబ్బింది. చిన్నప్పుడు ఊళ్లో జానపదులు, చిందుబాగోతాలు, వీధినాటకాలు చూసిన నర్సింగరావు ఆ నాటకాల్ని, ఆటపాటల్ని అనుకరించి ఇంట్లో అందరిముందు చూపించేవారు. ఇంట్లోవాళ్లు కూడా ఆయనకు అడ్డు చెప్పలేదు. అందుకే వయసుతోపాటే ఆ కళ కూడా పెరుగుతూ వచ్చింది. కాలేజీలో చదువుకునేటప్పుడు మనుసు ఫోటోగ్రఫీ వైపు మళ్లింది. అంతేకాదు ఆర్ట్‌పై ఉన్న మక్కువతో ఫైన్ ఆర్ట్స్‌లో చేరి అనూహ్యంగా పెయింటర్‌గా మారిపోయాడు. మెట్రిక్యులేషన్‌లో ఫెయిలైనప్పుడు… ఆ సంవత్సరం దగ్గర్లోని లైబ్రరీలో ఉన్న అరవై పుస్తకాలను అక్షరం పొల్లుపోకుండా చదివాడు. ఆ చదువు ఊరికే పోతుందా… కవిత్వం చెప్పే స్థాయికి చేర్చింది ఆయనను. సాహిత్యంపై కోరికను పెంచింది. ఇన్ని కళలున్నా ఎటొచ్చీ నర్సింగరావు జీవితంలో సినిమానే మేజర్ పార్ట్‌గా మారింది. అసలు సినిమాల్లోకి ఎందుకొచ్చాడనేది ఆసక్తి ఉన్నవాళ్లకు ఎదురయ్యే మొదటి సందేహం.అవి ఎమర్జెన్సీ రోజలు… అప్పటికి నర్సింగరావు ‘జన నాట్యమండలి’(ఆర్ట్ లవర్స్ అసోసియేషన్) ని నడిపిస్తున్న బృందంలో ఒకరు. పల్లెసుద్దులు, పల్లెపాటల్నీ ప్రజల వద్దకే చేర్చడం జన నాట్యమండలి పని.

‘జన నాట్యమండలి’ వల్ల నర్సింగరావు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర… అన్ని ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాడు. వాస్తవిక జీవితాల్ని కళ్లారా చూశాడు. పుట్టింది భూ స్వామి ఇంట్లోనే అయినా ప్రజల స్థితిగతులు ఆలోచించగల పెద్ద మనసు ఉండటమే నర్సింగరావును కమ్యూనిజం వైపు నడిపించింది. దాని ఫలితమే గద్దర్ లాంటి వాళ్లతో కలిసి జన నాట్యమండలిని నడిపించడం. అలా ప్రజల మధ్యకు చేరిన నర్సింగరావు జీవితంలో ఒక ప్రయోగాత్మక మలుపు సినిమా నిర్మాతగా మారడం! ఎమర్జెన్సీ రోజుల్లో జేఎన్‌ఎమ్‌కు అందరూ పరోక్షంగా పనిచేయాల్సిన సందర్భంలో సినిమాలు తీయాలనే ఆలోచన కలిగింది ఆయనకు.

నిర్మాతగా…
తెలుగులో ‘జైత్రయాత్ర’ పేరుతో అనువదించిన ఒక నవల ఆధారంగా నర్సింగరావు ‘మా భూమి’ అనే సినిమా నిర్మించాడు. తెలంగాణలోని భూస్వామ్య నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. ఆ చిత్రానికి దర్శకుడు గౌతమ్ ఘోష్. దేశం గర్వించదగ్గ దర్శకుల్లో గౌతమ్ ఒకరిప్పుడు. అయితే అంతటి ఛాన్స్ ఇచ్చింది, సినిమా ప్రపంచానికి గౌతమ్‌ఘోష్‌ను పరిచయం చేసింది నర్సింగరావే కావడం విశేషమే. కానీ అప్పటికే నాటకాలు, గ్రూప్ షోస్‌లో నటిస్తూ, నడిపించిన అనుభవం ఉన్న ర్సింగరావు దర్శకుడిగా గౌతమ్ ఘోష్‌ను ఎన్నుకోవడానికి ఒకే కారణం చెప్తాడాయన. థియరిటికల్‌గా ఎంత జ్ఞానం ఉన్నా ప్రాక్టికల్‌గా సినిమాపై అవగాహన, అనుభవం లేదు కనుక తాను దర్శకత్వం వహించలేదని!కానీ ఆ తరువాత నర్సింగరావు పూర్తిస్థాయి దర్శకుడిగా మారిపోయాడు. 193లో ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలిచిత్రం ‘రంగుల కల’. అందులో హీరోగా, దర్శకుడిగానే కాదు కథ, స్క్రీన్‌ప్లే, కో మ్యూజిక్ డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనే చూసుకున్నారు. అన్నిట్లోనూ సక్సెస్ అయ్యాడు. అందుకే ఆ సినిమా ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’ కేటగిరీలో జాతీయ అవార్డు సాధించింది. తెలంగాణ శకుంతలకు ఉత్తమ నటిగా ‘నంది అవార్డు’ వచ్చింది. కానీ ఆ తరువాత డైరెక్షన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమా విషయానికొస్తే నర్సింగరావు కథ నుంచి మ్యూజిక్‌దాకా అన్నింట్లోనూ పాలుపంచుకునేవాడు. ఆ కళానైపుణ్యం ఆయనకు మొదటి నుంచీ ఉన్నదే. ఆయన తీసిన కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకుడు కూడా. కొన్ని పాటలు కూడా రాశాడు.
దర్శకుడిగా మారిన తరువాత… అంతర్జాతీయ అవార్డులు సాధించిన తరువాత కూడా కమర్షియల్ సినిమాలను కన్నెత్తి కూడా చూడలేదు.

కేవలం ఆర్ట్‌ఫిల్మ్స్. వాటన్నింటిలో తెలంగాణే ప్రధానం కావడం ఆయనకు పుట్టిన గడ్డ మీదున్న మమకారానికి నిదర్శనం. తెలంగాణ జీవన విధానం, తెలంగాణ రాష్ట్రంలో దొరలపాలన, దాసి వ్యవస్థలు మొదలుకొని పాలమూరు వలస కూలీల వరకు అన్నీ తెలంగాణ కథావస్తువుల్నే ఎంచుకున్నారు. అదే ఆయన చిత్రాలను అంతర్జాతీయ స్థాయిలో కీర్తిశిఖరాలు ఎక్కించింది. అందుకే తరాలు మారినా తలుచుకునే సినిమాలుగా మిగిలిపోయాయి అవి. ఆ సినిమాలు జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు దక్కించుకున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం రామానాయుడు నిర్మాతగా తీసిన ‘హరివిల్లు’. ఆ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో ఉత్తమ పిల్లల చిత్రంగా అవార్డు సాధించింది. నర్సింగరావుకు ఉత్తమ పిల్లల చిత్రాల దర్శకుడిగా గోల్డ్‌మెడల్ వచ్చింది. మేకప్ ఆర్టిస్టుకు నంది అవార్డు వచ్చింది. తెలంగాణ ఆత్మహత్యల నేపథ్యంలో కూడా ఈ ఏడాది నర్సింగరావు నుంచి ఒక చిత్రం రాబోతున్నది.

ముప్పయి ఐదేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం బి.నర్సింగరావుది. ఇప్పటి వరకు ఏ వివాదాలూ లేవు. తన పని తాను చేసుకుపోవడమే ఆయనకు తెలుసు. నిబద్ధతతో, పట్టుదలగా పనిచేయడం ఆయనకున్న అదనపు అర్హతలు. ‘దాసి’, ‘మా ఊరు’ వంటి చిత్రాల కోసం నర్సింగరావు తెలంగాణ జిల్లాల్లో పెద్ద రీసెర్చే చేశారు. పాలమూరు వాసులతో చేసిన ఇంటర్వ్యూలు మొత్తం కలిపితే డెబ్బయ్ ఐదు గంటల రికార్డింగ్ అది. ఆ తరువాతే సినిమా కోసం స్క్రిప్టు రాసుకున్నారట. అంత పద్ధతిగా పనిచేసేవారు కాబట్టే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. రణధీర్‌కపూర్, తపన్‌సిన్హాలాంటి సినిమా అగ్రగణ్యులంతా ‘దేశం గర్వించదగ్గ సినిమాలు తీశావని’ పొగిడినా, ఇండియన్ సినిమా లెజెండ్స్ అంతా ప్రత్యేక గౌరవం ఇస్తున్నా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీవాళ్లు రూపొందించిన ఇండియన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఎన్‌సైక్లోపీడియాలో నర్సింగరావు ప్రొఫైల్, సినిమాలు నమోదై ఉన్నా, ఎక్కడా కించిత్ గర్వం ప్రదర్శించని తెలంగాణ లెజెండ్ నర్సింగరావు.ఇరవై ఏళ్ల కిందటే ఆయన సినిమాలు దేశ సరిహద్దులు దాటాయి. అయినా నర్సింగరావు అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. తెలుగు సినిమాలకు అవార్డులు రావని తెలిసీ తెలియని వాళ్లు కామెంట్ చేస్తున్నా పెద్దగా పట్టించుకోరు. అసలా మాటలకు స్పందించరు. అదే ఆయన మనస్తత్వం. చిత్ర పరిశ్రమలో అంతా ‘అన్నా’ అని, ‘సార్’ అని గౌరవిస్తారు. ఇన్నేళ్లుగా ఆయన చిత్ర పరిశ్రమలో ఉంటున్నా మొన్న వచ్చిన తెలంగాణ చిత్రం ‘జై బోలో తెలంగాణ’కు తప్ప మరే సినిమా ఫంక్షన్‌కు వెళ్లలేదు. ఈ ఫంక్షన్‌కు రావడానికి కారణం తెలంగాణ అంశమే అనేది గమనించాల్సిన విషయం.

హ్యాపీయే కానీ మామూలే…
‘అవార్డు తీసుకోవడం అనేది సంతోషించే విషయమే కానీ ఎగిరిగంతేసే పరిస్థితి మాత్రం కాదు. ఇప్పటికి ఇరవైకి పైగా అవార్డులు వచ్చాయి నాకు. నా సినిమాలకు, నాకు అవార్డులు అనేది షరామామూలే. అయితే మొదటిసారి అవార్డు తీసుకున్నప్పుడు ఎంతో సంతోషపడ్డాను. అలాగే నా మొదటి కవిత అచ్చయినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. కానీ ప్రతిసారీ అంతే ఫీల్ ఉండదుకదా. ఇప్పుడూ అంతే. నేను హార్డ్‌వర్క్ చేశాను. క్వాలిటీ చూపించాను. హానెస్ట్‌గా పనిచేశాను. అయినా ఈ అవార్డు నాకు మొదటిది కాదు చివరది కాదు. అందుకే ఇప్పటికీ నేను నమ్మేది ఒక్కటే పనిచేయడం… పనిచేయడం… పనిచేయడం… అంతే! సిన్సియర్‌గా పని చేసుకుంటూ వెళ్లాలి. అవార్డులు, రివార్డులు.. మన వెనకాలే వస్తాయి’ తనకు అవార్డు రావడం పట్ల నర్సింగరావు స్పందన ఇది.
నరసింగరావును తెలుగు పరిశ్రమకంటే ప్రపంచ చిత్రపరిశ్రమే అక్కున చేర్చుకుంది.

నాది తెలంగాణ. అందుకే తెలంగాణ సినిమాలు తీశాను. ఏదో ఆషామాషీగా తీయలేదు. కష్టపడ్డాను. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా… అన్ని విధాలుగా కష్టపడ్డాను. నేను సినిమాల్లోకి ఎంటరయ్యేనాటికి ప్రభాకర్‌రెడ్డి, కాంతారావు….అతికొద్ది మంది ఉన్నారు మనవాళ్లు. అయినా పరిశ్రమలో నిలదొక్కు కోగలిగాను. నా సినిమాలు తెలంగాణ మాటలతో, అక్షరాలతో ప్రారంభమవుతాయి. 1969 ఉద్య మంలో నేను కూడా పాల్గొన్నాను. కానీ సినిమాల తోనే ఇండిపెండెంట్‌గా తెలంగాణ ఐడెంటిటీని చూపిస్తున్నా. 1970లో నేను అనుకోకుండా లెఫ్ట్ రాజకీయాలవైపు వచ్చాను. అప్పట్నుంచి ప్రజ ల్లోకి వెళ్లాను. వాళ్ల నాడీ తెలిసింది. వాళ్లతో కలిసిపోయాను. అందుకే నేనీరోజు ఉత్తమ కళా కారుణ్ణి అయ్యాను. ప్రజలతో మమేకమై, ప్రజల జీవితాన్ని కళ్లారా చూశాను. అందుకే నేను ప్రజా కళాకారుడిని అని గర్వంగా చెప్పుకొంటా.

ప్రొఫైల్:
బి. నర్సింగరావు
సొంతూరు: ప్రజ్ఞాపూర్, మెదక్ జిల్లా.

తీసిన చిత్రాలు:
1. రంగుల కల(193) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు. నంది అవార్డు.
మా ఊరు (19) ఇదో డాక్యుమెంటరీ. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, నంది అవార్డు కూడా.
2. దాసి (19) ఐదు జాతీయ అవార్డులు. కొన్ని అంతర్జాతీయ అవార్డులు.
3. మట్టి మనుషులు(1990) జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.
4. ఆకృతి (1991)… జాతీయ చలనచిత్రోత్సవాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు
5. హరివిల్లు (2003)… రెండు ఇంటర్నేషనల్ అవార్డులు

పెయింటర్‌గా…
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పన్నెండు పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లు నిర్వహించాడు.
– ఫోటో ఎగ్జిబిషన్స్… జాతీయ అంతర్జాతీయ కలుపుకుంటే పది వరకు ఉంటాయి.
– బుక్ పబ్లికేషన్స్… అక్షరాలా పది పుస్తకాలు.
– జాతీయ సినిమా అవార్డుల కమిటీ సహా అనేక సినిమా ఉత్సవాలకు, ఆర్గనైజేషన్స్‌కు జ్యూరీగా, అంతర్జాతీయ చలనచిత్రోత్సవ కమిటీల్లో మెంబర్‌గా పనిచేశారు. అనేక ఆర్గనైజేషన్స్‌తో కలిసి పనిచేశారు.
– తను ఎంతో ఇష్టపడి కలెక్ట్ చేసుకున్న యాభై వేల గ్రామ్‌ఫోన్ రికార్డ్స్‌ను సీఫెల్‌కు డొనేట్ చేశాడు. బి.నర్సింగరావు ఆర్కివ్స్’ అనే పేరుతోను ఉన్నాయక్కడ.

పర్సనల్ లైఫ్…
ముగ్గురు అబ్బాయిలు, ఒకమ్మాయి. అందరూ వెల్‌సెటిల్డ్. చిన్న అబ్బాయి మాత్రం బాలీవుడ్‌లో ఫిల్మ్‌మేకర్‌గా ఉన్నాడు.

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.