– తెలంగాణకు లోక్సభ ఆమోదం.. తెలంగాణలో పెల్లుబికిన సంబురం
– నేడు టీ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. ఆమోదం అనంతరం ప్రథమ పౌరుడికి.. అరవయ్యేళ్ల బానిస సంకెళ్లు తెంపుకున్న తెలంగాణ తల్లికి వందనం! ఆ అమరవీరుల నమ్మకాన్ని నిలబెట్టి.. నిజంచేసిన ఉద్యమనేతలకు అభివాదం! మాట మీదే నిలిచి.. తెలంగాణ కలను నిజంచేసిన సోనియాగాంధీకి, కేంద్ర ప్రభుత్వానికి కతజ్ఞత! తెలంగాణ ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది. యాభై ఏళ్ల కల సాకారమైన క్షణాన.. కోటి రతనాల వీణ జయ జయధ్వానాలు చేసింది. సీమాంధ్ర మబ్బుతెరలను ఛిద్రం చేసుకుంటూ తెలంగాణ వినీల గగన వీధుల్లో కోటిమంది సూర్యుళ్లు ప్రభవించారు! విశాల స్వేచ్ఛాకాశంకింద.. తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని.. నిటారుగా నిలబడింది! ఆదిలాబాద్ పోశవ్వ పరవశించిపోయింది! నల్లగొండ యాదగిరి తన్మయత్వంతో చిందేశాడు! మైబ్నగర్ మల్లేషు డప్పు మోత మోగించాడు! ఓరుగల్లు పోరుగీతాలు ఆలపించింది! పది జిల్లాలూ గులాల్ చల్లుకుని వర్ణశోభితమయ్యాయి! ఎటు చూసినా ఉత్సాహం.. ఉద్వేగం.. ఉత్తేజం.. ఉల్లాసం! పరాయిపాలనపై దశాబ్దాలుగా కదం తొక్కిన సబ్బండవర్ణాలు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా చేసిన నినాదం.. జై తెలంగాణ!! వివక్ష అంతమై.. మహోజ్వల భవితవ్యానికి పునాది పడుతున్న అపురూపమైన క్షణాన.. తెలంగాణ గుండె చప్పుడే.. జై తెలంగాణ!! వెయ్యికిపైగా అమరవీరుల త్యాగాలు తెలంగాణ మాగాణంలో పుష్పించి.. ఫలితాన్నిచ్చిన శుభ సందర్భాన తెలంగాణ యువత మదిలో గూడుకట్టుకుంటున్న ఆశల సౌధమే జై తెలంగాణ!! సమైక్య దోపిడీ పాలన ఇక చరిత్ర. కష్టాలు.. కన్నీళ్లు పీడకల. యాచించే స్థితి పోయింది. మనల్ని, మన భవితవ్యాన్ని మనం శాసించుకునే తరుణం ముందు నిలిచింది. కాలపరీక్షకు తట్టుకుని.. నిలబడి కలెబడి.. గెలిచిన తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించనుంది! రాష్ట్ర విభజన బిల్లుకు లోక్సభ భారీ మెజార్టీతో మంగళవారం ఆమోదం తెలిపింది! బుధవారం రాజ్యసభ ఆమోదం పొంది.. అంతిమ ఘట్టం కోసం దేశ ప్రథమపౌరుడి చెంతకు చేరనున్నది!! |
కల నిజమైంది.. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది
Posted on February 19, 2014
This entry was posted in TELANGANA NEWS, Top Stories.