కలుస్తున్న కుట్ర కత్తులు!

-ఏకమవుతున్న అన్ని పార్టీల సీమాంధ్ర నేతలు
-వ్యూహ రచనలో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ!
-బిల్లుకు మద్దతిస్తే మీకు రాష్ట్రంలో ఒరిగేదేంటి?
పక్రియను ఆపితే 2014లోఎన్డీయేకే మద్దతు..బీజేపీకి సీమాంధ్ర నేతల ఆఫర్!
-అందుకే మాట మార్చిన బీజేపీ నేతలు ?
-బీజేపీ వైఖరిపై శంకతోనేకేబినెట్ నోట్ జాప్యం?
-గెలిపించే పద్ధతుల్లోనే బిల్లు తేవాలని యూపీఏ యోచన!

TTతెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారీ రాజకీయ నాయకులు కొత్త కుట్రలు కత్తులు దూస్తున్నారా? ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటును పార్టీలవారీగా కలిసి అడ్డుకున్న నేతలు.. ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలను సైతం పక్కనపె తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారా? రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు.. నేతల మాటలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి! పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకోగలిగితే.. ఇక తెలంగాణ రావడం అసాధ్యమన్న యోచనలో సీమాంధ్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణకు గట్టి మద్దతుదారునని చెప్పుకుంటున్న బీజేపీపై సీమాంధ్ర నేతలు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

మొన్నటిదాకా చిన్నపార్టీగా తేలిగ్గా తీసుకున్న బీజేపీ.. ఇప్పుడు వారి దృష్టిలో తెలంగాణను అడ్డుకోగల ఏకైక పెద్దశక్తిగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో అధికారం ఆశ చూపి.. తెలంగాణను అడ్డుకోవడమే సీమాంధ్ర నేతల వ్యూహంగా చెబుతున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ బిల్లు ఎప్పుడు పెట్టినా మద్దతిస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, నరేంద్రమోడీలు ఒక్కసారిగా ‘సమన్యాయం.. కాంగ్రెస్ రాజకీయ లబ్ధికే విభజన నిర్ణయం.. సీమాంధ్రకు న్యాయం జరగాలి..’ అంటూ మాటలు చెబుతున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఈ కొత్త కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణవాదుల హెచ్చరిస్తున్నారు.

ఇచ్చిన మాటకు అనుగుణంగా బిల్లుకు మద్దతు ఇచ్చేలా బీజేపీపైనా ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింప చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దలదేనని అంటున్నారు. ‘కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెడితే మీకేం లాభం కలుగుతుంది? టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాకుంటే ఆ పార్టీకే లాభం. ఇక మీకైతే మరో నాలుగైదు సీట్లు పెరుగుతాయి. ఆ తరువాత తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు లాభం దక్కుతుంది. ఈ సమయంలో మీరు మాకు మద్దతు ఇవ్వడం వల్ల మీకే లాభం.

తెలంగాణను అడ్డుకుంటే ఆ లాభమేదో మేమే ఇస్తాం. సీమాంధ్ర ప్రజల ఉద్యమ వేడి నేపథ్యంలో కొత్త పార్టీ వస్తే దాని తరఫున ఎన్నికయ్యే 20 మంది ఎంపీల మద్దతును మీకు అందిస్తాం. కానీ ఇప్పడు జరుగుతున్న ప్రక్రియను మాత్రం నిలిపివేయించాలి. శీతాకాల సమావేశాల్లో గనుక బిల్లు రాకుంటే ఇక అంతే సంగతులు. 2014లో మా 20మంది ఎంపీల మద్దతు మీకే ఇస్తాం’ అని సీమాంధ్రకు చెందిన పెట్టుబడిదారుడైన రాజకీయ నేత ఒకరు రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ అగ్రనాయకుడికి వివరించినట్లు సమాచారం. దీనికి ఆ నేత దాదాపు అంగీకరించినట్లు సమాచారం వస్తోంది.

అదే సమయంలో సమన్యాయం ముసుగులో సమైక్యాంధ్ర కోసం దీక్షలు చేస్తున్న వైఎస్సార్సీపీ, దాని అధినేతలు విజయమ్మ, జగన్ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ‘తనను జైల్లో పెట్టించిన కాంగ్రెస్‌కు జగన్ మద్దతు ఇవ్వాలనుకున్న మాట ఒకప్పటిది. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వారు నడిపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినందున పడ్డ ఓట్లను మళ్లీ వారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుగా ఇస్తాం అంటే వ్యతిరేకత వస్తుంది. కనుక ఆ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తామనేదాకా సీమాంధ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు వివరించారు. ఇక తెలుగుదేశం పార్టీతో ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు టచ్‌లో ఉన్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా బీజేపీకి దక్కాల్సిన ‘లాభం’పై సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.

ఇప్పటికే ఆ పార్టీ గురించి నరేంవూదమోడీ బహిరంగ సభలో మాట్లాడినదానిపైనా, బీజేపీతో పొత్తుపైనా టీడీపీ నేతలు సూటిగా ఖండించకపోవడం ప్రస్తావనార్హం. నిజానికి కాంగ్రెస్ 2014 ఎన్నికలలోపు తెలంగాణ అంశాన్ని తేల్చేస్తుందని రాజకీయ పార్టీలు ఊహించలేకపోయాయని, తెలంగాణకు సై అన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ఏ ప్రయోజనం కోసం నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ ప్రజలు మాత్రం హర్షించారు. తీసుకోదనుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించడంతో సీమాంధ్ర నేతలందరూ కంగుతిన్నా.. వెంటనే తేరుకుని ఆగమేఘాల మీద మళ్లీ చేతులు కలుపుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ తాను అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తానని చెబుతున్న నేపథ్యంలో 2014లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని.. ఐదేళ్లూపాలించాక అప్పటి పరిస్థితులను బట్టి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని సీమాంధ్ర నేతలు బీజేపీ పెద్దలకు హామీ ఇచ్చారని తెలుస్తోంది.

బీజేపీపై కాంగ్రెస్‌లో అనుమానం!
తెలంగాణపై యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ముందే బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మన్మోహన్.. బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరి.. హామీ తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి బిల్లు ఆమోదంలో బీజేపీపై గట్టి నమ్మకాన్నే కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారు. కానీ.. ప్రస్తుతం బీజేపీ వైఖరిపై కాంగ్రెస్‌లో నమ్మకం సన్నగిల్లుతోందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. బీజేపీ ముఖ్యనాయకులతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జరిపినట్లు చెబుతున్న సమావేశం.. వారు ఇచ్చిన ఆఫర్‌పై సమాచారం తెప్పించుకున్న కాంగ్రెస్.. బీజేపీ వైఖరిపై వేచి చూసే ధోరణిలో ఉందని అంటున్నారు. బీజేపీపై నమ్మకం కుదిరాకే కేబినెట్ నోట్‌ఫైల్‌ను సిద్ధం చేయాలన్న ఆలోచనలో యూపీఏ సారథులు ఉన్నారని తెలుస్తోంది. సీమాంధ్ర మంత్రులు హైకమాండ్‌ను ధిక్కరిస్తున్న నేపథ్యం కూడా కేబినెట్ నోట్ జాప్యానికి మరో కారణంగా చెబుతున్నారు. వీటిని పరిష్కరించుకున్న తర్వాత కేబినెట్ ముందుకు తెలంగాణ అంశాన్ని తీసుకు పార్లమెంటుకు తేవాలని యూపీఏ భావిస్తున్నదని తెలుస్తోంది.

‘56 సంవత్సరాలుగా రగులుతున్న సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో కాంగ్రెస్ బిల్లు పెడితే, సీమాంద్రులకు అన్యాయం పేరుతో బీజేపీ వెనకడుగు వేస్తుందనే భావన మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ అగ్రనేతలు మాట్లాడిన తీరు తరువాత వచ్చి ఉండొచ్చు. అందుకే పార్లమెంట్ సమావేశాల తరువాతే ప్రక్రియ వేగవంతం చేస్తామని సోనియా అన్నారు. అంటే.. బీజేపీ స్పష్టంగా బిల్లుకు మద్దతు ఇస్తామంటే శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుంది. లేకుంటే కేబినెట్ నోట్ దగ్గరే ఆగిపోతుంది. ఓడిపోయే బిల్లును పార్లమెంట్‌లో పెట్టి.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎందుకు అప్రతిష్టపాలవుతుంది?’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు అభివూపాయపడ్డారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లుకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకూడదనే కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని, అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ వైఖరిపై ఒత్తిళ్లువచ్చి.. ఆ పార్టీ దారికి వస్తుందనే అభివూపాయం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్నది. అందుకే పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు బీజేపీ వైఖరి తేలితే దానికనుగుణంగా బిల్లుపై ముందడుగు వేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.