హైదరాబాద్ : ఈ నెల 30న హైదరాబాద్లో జరిగే కలం కవాతుకు తెలంగాణ జర్నలిస్టులంతా కదలి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని టీజేఎఫ్ కన్వీనర్, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మంత్రిపదవులతో, ఇతరేతర తైలాలతో అడ్డుకోవాలనుకోవడం పాలకుల మూర్ఖత్వమని ఆయన విమర్శించారు. సీమాంధ్ర పాలనలో ప్రధాని సాక్షిగా తెలంగాణ జర్నలిస్టులు కూడా వెలివేయబడ్డారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టులంతా చేతికో కళంతో, పోటెత్తిన గళాలతో కధనోత్సవంతో కలం కవాతుకు తరలిరావాలన్నారు. కవాతుకు తెలంగాణ సమాజమంతా అండగా నిలవాలని కోరారు.
కలం కవాతుకు టీఆర్ఎస్,టీజేఏసీ సంపూర్ణ మద్దతు’
జర్నలిస్టుల కలం కవాతుకు టీజేఏసీ, టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకంటించాయి. కలం కవాతులో తెలంగాణ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ కూడా కలం కవాతుకు మద్దతునిస్తుందని ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రధాని రాక సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు జరిగిన అవమానానికి ప్రభుత్వం వెంటనే క్షమపణ తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.