కర్నాటకలో నామినేషన్లు దాఖలు చేసిన అధినేతలు

karnataka-భారీ ర్యాలీలతో కదిలిన యడ్యూరప్ప, పరమేశ్వర, సిద్దరామయ్య..
వేలాదిమంది అభిమానుల కోలాహలం మధ్య భారీ ర్యాలీలతో కదిలిన పలు పార్టీల అధ్యక్షులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్రమంతా ఎన్నికల పండుగ వాతావరణం కనిపించింది. ఎన్నికలకు 20 రోజులే గడువు ఉండడంతో నేతలంతా ప్రచార కార్యక్షికమాల్లో బిజీబిజీగా ఉన్నారు. కాగా, సోమవారం కర్ణాకట జనతా పక్ష (కేజీపీ) అధ్యక్షుడు యడ్యూరప్ప షిమోగ జిల్లాలో శికారిపురలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భారీ సంఖ్యలో తన మద్దతుదారులతో ర్యాలీ నిర్వహించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు పరమేశ్వర తుమ్కూరు జిల్లా కోరటగెలో, శాసనసభా కాంగ్రెస్‌పక్ష నాయకుడు సిద్దరామయ్య మైసూర్ జిల్లా వరుణ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.

మాజీ మంత్రి బీజేపీ నుంచి బయటకు వచ్చిన బీఎస్సార్సీపీ అధ్యక్షుడు బీ శ్రీరాములు బళ్లారి రూరల్ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. సోమవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులంతా ఈ రోజు నామినేషన్ వేయడానికి ఆసక్తి చూపారు. దీంతో రాష్ట్రంలోని అనేకచోట్ల నామినేషన్ పండుగ కనిపించింది. కాగా, నామినేషన్ వేయడానికి బుధవారంతో గడువు ముగిసిపోనున్నది. సినీ నటి రక్షిత సోమవారం మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సమక్షంలో జేడీఎస్‌లో చేరారు. ఆమె కొద్దిరోజుల క్రితమే బీఎస్సార్సీపీలో చేరారు. రక్షిత జేడీఎస్ తరపున చామరాజ్‌నగర్‌నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి దేవెగౌడ.. రక్షిత పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా.. తమ విధానాలు నచ్చి తమతో కలిసి ప్రజా సేవ చేసేందుకు సిద్ధమయ్యారని విలేకరులతో తెలిపారు.

బీజేపీ మూడో అభ్యర్థుల జాబితా విడుదల
అధికార బీజేపీ పార్టీ 37మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 140మందిని, రెండో జాబితాలో 35, తాజా జాబితాలో 37 మందితో మొత్తం 212 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా, 224 నియోజకవర్గాలుండగా ఇంకా 12మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో యడ్యూరప్ప పక్షంగా చెప్పుకునే 3 సిట్టింగ్ ఎమ్మెల్కేలకు టికెట్ ఇవ్వడంపై సస్పెన్ వీడడం లేదు. కానీ పార్టీలో మాత్రం వీరికి టికెట్ ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నామినేషన్ దాఖలు చేయడానికి రెండురోజులే గడువు ఉండడంతో ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మైనింగ్ కింగ్‌కు కాంగ్రెస్ టికెట్
కాంగ్రెస్ 40మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో బళ్లారిలో మైనింగ్ కింగ్‌గా పేరుమోసిన అనిల్‌లాద్‌కు, తెల్గీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ పోలీసు అధికారి జీఏ బవాతోపాటు ఇద్దరు సీనియర్ మంత్రుల కుమారులకు టికెట్లు లభించాయి

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.