కర్ణాటకలో బస్సు ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం

బెంగళూరు: వోల్వో బస్సు ప్రయాణమంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. వామ్మో వోల్వోనా అంటున్నారు. వోల్వోలు యమశకటాలై ప్రాణాలు తీస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలో ఇవాళ ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు హవేరి జిల్లాలోని కునుమహళ్లీ వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. నేషనల్ హైవే నాలుగుపై జరిగిన ఈ బస్సు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హవేరి ఎస్పీ శశికుమార్ సహాయక చర్యలు చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో పాలెం వద్ద, కర్ణాటకలోని మాండ్యా వద్ద, ఇవాళ హవేరి వద్ద వోల్వో బస్సు దుర్ఘటనలు జరగడం ప్రయాణికులను వణికిస్తుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.