కమలం వికసించింది.. మోడీ గాలి వీచింది

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతమే. అత్యధిక విద్యావంతులుండే దేశ రాజధాని నుంచి సమాజానికి బహుదూరంగా మెలిగే గిరిజన రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ దాకా బహుళ సంస్కృతులు, భిన్న సమాజాలు, సామాజిక వర్గాలకు ఈ నాలుగు రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఎక్కడా కాంగ్రెస్‌కు నీడ దొరకకపోవడం ఆ పార్టీని దిగ్భ్రాంతిపరిచే అంశమే. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు మాట్లాడిన తీరు కూడా ఆ పార్టీ ఎంత నిరాశకు గురైందో చెప్పకనే చెబుతున్నది. ‘కనీసం రాజస్థాన్‌లో మంచి ప్రదర్శన చూపుతామనుకున్నా.. అక్కడ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నాడనుకున్నా..’ అన్న సోనియా మాటల్లో దాచినా దాగని బేలతనం ప్రస్ఫుటమైంది. కర్ణుడి చావుకు కారణాపూన్నో… అన్నట్లు కాంగ్రెస్ ఓటమికి అన్ని కారణాలున్నాయనేది వాస్తవమే అయినా సాధారణ ఎన్నికల ముంగిట్లో ఈ ఫలితాలు చావుదెబ్బే. మోడీ ప్రభంజనం కాషాయ శ్రేణులకు మాత్రం కొండంత ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా రాజస్థాన్‌లో బీజేపీ విజయం ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరారాజె సింధియానే ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ స్థాయి సీట్లు తానసలే ఊహించలేదని ఆమె మీడియా ముందు బయటపడిపోయారు కూడా. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. కేజ్రీవాల్ తన సత్తా చాటారు. హ్యాట్రిక్‌తో బరిలో దిగిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఊడ్చేశారు!
modi
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: లోక్‌సభ ఎన్నికలకు కూతవేటు దూరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభజనం వీచింది. ఆ ఉధృతిలో కాంగ్రెస్ చాపచుట్టుకు పోయింది. ఐదురాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఆదివారం ఫలితాలు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మధ్యవూపదేశ్‌లో ఆ పార్టీ మూడోసారి ఘన విజయం సాధించి తిరిగి అధికార పగ్గాలు చేపట్టబోతుండగా, రాజస్థాన్‌లో నాలుగింట మూడువంతుల సీట్లతో చరివూతనే సృష్టించింది. ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకున్న బీజేపీ, ఢిల్లీలో అధికారపీఠానికి చేరువదాకా వచ్చి నిలిచింది. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉండీ రాజస్థాన్‌లో ఓడిన తీరు పార్టీని దిగ్భ్రాంతి పరిచింది. ఢిల్లీలోనూ అదే షాక్ తప్పలేదు. మూడుసార్లు ఏకచ్ఛవూతంగా ఏలిన షీలా దీక్షిత్ పార్టీని గట్టెక్కించలేకపోగా తానే స్వయంగా ఓడిపోయారు.

కొద్ది నెలల క్రితమే రాజకీయ అరంగేట్రం చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారం కోసం బీజేపీతో పోటీ పడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ సాక్షాత్తూ సీఎంనే ఈ ఎన్నికల్లో ఓడించారు. కాగా ఈ పార్టీ కారణంగానే బీజేపీ ప్రభంజనానికి ఢిల్లీలో ఆటంకం కలిగిందనేది రాజకీయవర్గాల అంచనా. రాజస్థాన్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంవూదమోడీ జరిపిన సుడిగాలి ప్రచారం ప్రభంజనాన్నే సృష్టించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసింది. 200 సీట్ల అసెంబ్లీలో నాలుగింట మూడువంతుల సీట్లు బీజేపీ గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 21 సీట్లకు పరిమితమైపోయింది. చరివూతలో ఎపుడూ చూడని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. వసుంధరారాజె నాయకత్వంలోని కాషాయ జెండా రాష్ట్రమంతా రెపపలాడింది. 200 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 162 సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 96, బీజేపీకి 78 సీట్లు ఉండేవి. మధ్యవూపదేశ్‌లో కూడా బీజేపీ గతంతో పోలిస్తే ఈసారి సీట్లు పెంచుకుని మూడింట రెండు వంతుల మెజార్టీని చేరుకుంది.
rajnath
ఈ విజయం ద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హ్యాట్రిక్ సాధించారు. 230 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 165తో గతంలోకన్నా 22 సీట్లు అదనంగా సాధించింది. కాంగ్రెస్ 71 సీట్లనుంచి 58కి పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. 70 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 32 సీట్లతో అందరికన్నా ముందుంది. దానికి సమీపంలోనే ఆమ్‌ఆద్మీపార్టీ 28సీట్లు సాధించింది. కాంగ్రెస్ విషాదకరంగా కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ కూటమిలో ఉన్న అకాలీదళ్ ఓసీటు గెలుచుకుంది. ఓ ఇండిపెండెంట్ కూడా గెలిచాడు. గత 15 ఏళ్లుగా ఏకపక్షంగా అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఈసారి ఆమ్‌ఆద్మీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయింది. గత ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులు సహా, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ సైతం దారుణ పరాజయం పాలయ్యారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం విజయం చివరివరకూ దోబూచులాడింది. ఫలితాల వెల్లడవుతున్న కొద్దీ ఉత్కంఠ పెరిగి చివరకు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 90 సీట్ల అసెంబ్లీలో ఆ పార్టీ 49సీట్లు సాధించింది. కాంగ్రెస్ పోటాపోటీగా వచ్చినా 39 సీట్లు వద్ద నిలిచిపోయింది. గుజరాత్‌లో మోడీలాగే ఇక్కడ రమణ్‌సింగ్ హ్యాట్రిక్ సాధించారు.

మొత్తం మీద ఫలితాలను బీజేపీ నరేంవూదమోడీ ప్రజాదరణకు చిహ్నంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గాలు సన్నాయినొక్కులు నొక్కుతున్నా ఫలితాల సరళి వారి నోళ్లకు తాళం వేసింది. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మోడీ ప్రజాదరణ కారణంగా పార్టీ భారీగా ప్రయోజనం పొందిందని చెప్పారు. ప్రచార సమయంలో మోడీ సభలకు భారీగా ప్రజలు తరలిరావడం పార్టీకి కలిసివచ్చిందని పార్టీ రాజ్యసభ నేత అరుణ్‌జైట్లీ చెప్పారు.ఈ ఎన్నికలను మోడీకి రాహుల్‌కు పోటీగా భావించలేమని మోడీతో సరితూగే నాయకుడు కాంగ్రెస్‌లో లేడని ఆయన చెప్పారు. రాజ్‌నాథ్ మాత్రం ఈ పోలికలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థినే ప్రకటించనపుడు ఇంక పోలికలకు అవకాశమెక్కడిదనేది ఆయన ప్రశ్న. ఢిల్లీలో కూడా బీజేపీ అద్భుత విజయాలు సాధించి ఉండేదని అయితే వాటిని ఆమ్‌ఆద్మీ కాజేసిందని బీజేపీ వర్గాలు ఆవేదన వ్యక్తపరిచాయి. ఛత్తీస్‌గఢ్ విషయానికి వస్తే అక్కడెప్పుడు భారీ విజయాలు నమోదు చేసిన చరిత్ర ఎవరికీలేదని రెండుసార్లు అధికారంలో కొనసాగినా హ్యాట్రిక్‌సాధించడమే గొప్ప విషయమని బీజేపీ నేతల విశ్లేషణ. రాజస్థాన్ విజయాల మీద మాత్రం పార్టీలో భిన్నాభివూపాయాలున్నాయి. అక్కడ వసుంధర ఫ్యాక్టర్ పనిచేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
chohan
ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, ప్రభుత్వ వ్యతిరేకత లాభించిందని అంటున్నారు. అక్కడ ఆర్‌ఎస్‌ఎస్ రాజె వర్గాలు విభేదాలు పక్కన బెట్టి పనిచేయడం కలిసివచ్చిందని అంటున్నారు. ఇక ఫలితాలు విశ్లేషిస్తే ప్రజలు కోరుతున్న దానికి ప్రభుత్వాలు చేస్తున్నదానికి పొంతన ఉంటోందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఢిల్లీలో పార్టీ ఏదనేది పక్కనపెడితే షీలా దీక్షిత్ సర్కార్ ప్రజలకోసం చేయని పనిలేదు. అధునాతన అంతర్జాతీయ విమానాక్షిశయం, మెట్రో రైళ్ల కూతలు, బీఆర్‌డీ కారిడార్‌లు, అడుగుడుక్కో ఫైఓవర్లతో దేశంలో ఎక్కడా లేని రవాణా వ్యవస్థ, ఆహార భద్రత పథకం అందరికన్నా ముందే అమలు, పసిపిల్లలకు లాడ్లీ పథకం, బాలికలకు , విద్యార్థులకు ఆరోగ్య పథకం, పేదలకు చవకరేట్లకే గోధుమల సరఫరా, వలసవచ్చే జనం కోసం అనధికార కాలనీల రెగ్యులరైజేషన్ సహా ఏ చిన్న అంశమూ విస్మరించకుండా నాలుగోసారి గెలిచి తీరాలనే పట్టుదలతో నాలుగేళ్లుగా షీలా కష్టపడుతూనే వచ్చారు. ఏ ప్రభుత్వమూ గుప్పించనన్ని పథకాలు అమలు చేసినా షీలా దీక్షిత్ ఓటమి పొందారు. పార్టీని గట్టెక్కించడం అటుంచి తానే స్వయంగా ఓడిపోయారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఉదంతం పెద్ద ఫ్యాక్టర్ అయిందనే వాదన ఉంది.

వాస్తవానికి ఢిల్లీ శాంతి భద్రతలను కేంద్ర హోంశాఖ తరపున లెప్టినెంట్ గవర్నర్ చూస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. అయినా బాధ్యత షీలా మీద పడింది. విద్యాధికులు అధికంగా ఉండే చోట ఈ వ్యత్యాసం గుర్తించలేదా అనేది అర్థంకాని ప్రశ్నే. ఇక రాజస్థాన్ ప్రభుత్వం కూడా అనేక పథకాలు చేపట్టింది. భారీగా నిధులు గుప్పించి ఉచిత ఔషధాలను పేదలకు అందించింది. కొన్ని చోట్ల అవి విషపూరితం కావడం కొంపముంచింది. ఆ ప్రచారం వారి మెడకు చుట్టుకుంది. దీనికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, కేంద్ర మంత్రుల శల్యసారథ్యాలు పార్టీని కూల్చివేశాయి. ఎన్నికలకు ముందు కేంద్రమంత్రే పార్టీకి 50 సీట్లుకూడా రావని దీవించారు. తథాస్తు దేవతలు విన్నారేమో 21 సీట్లుకు పార్టీ స్కోరు పడపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దాడిలో పార్టీ సీనియర్ నేతలంతా తుడిచిపెట్టుకుపోయారు. అయినా మిగిలిన నాయకుల పోరు మామూలే. మధ్యవూపదేశ్‌లో దిగ్విజయ్ నిష్క్రమణ తర్వాత పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకుడు లేకుండాపోయారు. అంతకుముందు రెండుసార్లు ముఖ్యమంవూతిగా పనిచేసి ఈసారి గెలవకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఉండనని శపథం పట్టిన దిగ్విజయ్ సోనియా కోరినా రానన్నారు.
Ramansing
దీనికితోడు బీజేపీకి సమర్థ నాయకత్వం పనికివచ్చింది. ఈ నాలుగు ఫలితాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సమర్థవంతుడైన నాయకుడున్న చోట పార్టీలకు లాభించింది. ఏదేమైనా భారత రాజకీయాల తీరు ఎప్పుడూ దాగుడుమూతలాటే. మోడీ ప్రభంజనం ఉందనిపిస్తూనే…ఓ ప్రశ్నార్థకాన్ని మిగుల్చుతుంది. మోడీ ప్రభంజనమే వీచి ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో చివరిదాకా విజయం ఎందుకు దోబూచులాండిందనేది ప్రశ్న. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో మోడీ విస్తృతంగానే పర్యటనలు చేశారు. ఇక ఢిల్లీ ఎవరికీ చెప్పుకోలేని బాధ. కేజ్రీవాల్ మోడీకన్నా ప్రజాదరణలో మిన్నా.. అంటే సమాధానం దొరకదు. పైగా మోడీ చివరిదశలో ఇక్కడ అనేక భారీ సభలు నిర్వహించారు. జనాలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ స్థాయి ఓట్లు కురవలేదు. ఏడాది క్రితం పెట్టిన పార్టీ బీజేపీని సవాలు చేసింది. అధికారపీఠానికి అల్లంతదూరాన నిలిపివేసింది. ఇదిలా ఉంటే 545 మంది లోక్‌సభ సభ్యుల్లో ఈ నాలుగు రాష్ట్రాలనుంచి లోక్‌సభకు ఎన్నిక కావలిసిన సభ్యుల సంఖ్య73 వరకు ఉంటుంది.
ఈ ఎన్నికల్లో మోడీ గాలి వీచింది. మా ప్రధాని అభ్యర్థి మోడీకి ఉన్న ప్రజాదరణ వల్ల పార్టీ భారీగా లబ్ధి పొందింది. ఢిల్లీలో ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీ కన్నా ఆమ్‌ఆద్మీ పార్టీయే లాభం పొందింది. నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది.
– రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు.. కాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనను కోరుకుంటున్నారు.
– వెంకయ్య నాయుడు, బీజేపీ సీనియర్ నేత

సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌ను ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పాలనను ప్రజలు తిప్పికొట్టారు.
– గడ్కరీ, బీజేపీ సీనియర్ నేత

కాంగ్రెస్ పార్టీ లోతైన ఆత్మశోధన జరుపుకోవాలి. కారణాలు విశ్లేషించి, తప్పులు జరిగితే సరిదిద్దుకుంటాం. పరాజయానికి అనేక కారణాలున్నాయి. ధరల పెరుగుదల ప్రభావం బాగా ఉంది. ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఏమైనా పార్టీ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఏదేమైనా మేము చాలా..చాలా నిరాశ చెందాం.
– సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.