కబ్జా కనికట్టు

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్నది పాత సామెత. నాయకులు నాయకులు కలిసి భూములు కబ్జా చేశారన్నది నేటి మాట! సరిగ్గా టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరిలా!! చేతికి మట్టి అంటకుండా వ్యవహారం నడిపించేయడం వీరి స్పెషాల్టీ! ఇది వారిని దగ్గర నుంచి గమనించేవారు చెప్పే సంగతి! హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూములను కబ్జా చేసిన వ్యవహారం అందుకు తిరుగులేని సాక్ష్యం! ఒక్క కాగితం లేకుండానే.. బినామీలకు ముందుకు తెచ్చి.. పుల్లారావు kabja20 ఎకరాల్లో కబ్జా విత్తులు నాటగా.. నాలుగెకరాలకు సుజనాచౌదరి టెండర్ పెట్టారు! వెరసి.. హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన రూ.350 కోట్ల విలువైన భూములు స్వాహా అయిపోయాయి! ఇదీ.. ప్రత్తిపాటి, సుజనా చౌదరి కనికట్టు కబ్జా కథ!

గంటావారి ఘరానా కబ్జా విజయవంతం కావడంతో తాము ఎందుకు వెనుకబడాలనుకున్నారేమో.. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి హెచ్‌ఏఎల్ ఉద్యోగస్తుల భూములపై దృష్టిసారించారు. పుల్లారావుకు బినామీగా చెప్పే రావెళ్ల రోశయ్య, సుజనాగ్రూప్‌లో ఉపాధ్యక్షుడిగా పనిచేసే జవహర్‌బాబు సుజనా బినామీగా కార్యరంగంలోకి దిగారు. రోశయ్య 20 ఎకరాలను చుట్టేయగా.. మరో నాలుగెకరాలు జవహర్‌బాబు పేరిట రిజిస్టర్ అయ్యాయి. సాధారణంగా ఏవైనా తప్పుడు పత్రాలు చూపిస్తూ కబ్జాలు చేస్తుండటం పరిపాటి. కానీ.. రావెళ్ల వ్యవహారంలో ఒక్క పత్రం కూడా లేదు. చిలకలూరిపేటకు చెందిన రోశయ్య పుల్లారావు తరఫున లిటిగేషన్ వ్యవహారాలు చక్కదిద్దుతుంటాడని వినికిడి. లిటిగేషన్‌లో ఉన్న ఆస్తుల సెటిప్మూంట్‌లు.. వాటిని తక్కువ ధరకు కొనటం.. ఇతరులకు విక్రయించడం ఆయన బిజినెస్! ఇలా ఒక్క హైదరాబాద్ నగరంలోనే వేయి కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఆయన చేతుల మీదుగా మారాయని నగరంలోని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ దందాలో భాగంగానే తమ భూమి వారి స్వాధీనంలోకి వెళ్లిందని హెచ్‌ఏఎల్ ఉద్యోగులు వాపోతున్నారు. తాను కబ్జా చేసిన భూముల్లో రావెళ్ల రోశయ్య పేరుతో బోర్డులు కూడా పాతారు. ఈ భూమి నీకెక్కడిని ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను కోర్టు కేసులో ఉన్నాను కాబట్టి.. ఆ భూమి తనదేనని చెబుతున్నాడని అంటున్నారు. అంటే.. భూమిపై హక్కుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోయినా.. భూ వివాదంలో కోర్టు కేసులో ఇంప్లీడ్ అయితే.. ఆ భూమి వారిదైపోతుందన్నమాట! ఇదీ రోశయ్య కబ్జా థియరీ! స్థలాన్ని ఖాళీగా ఉంచితే ఏం లాభమనుకున్నాడేమో.. ఇందులో అరెకరం స్థలాన్ని అద్దెకు ఇచ్చి, నెల నెలా అద్దె వసూళ్లు చేసుకుంటున్నారు. మరి ఒక అక్రమానికి స్థానికంగా బలం ఉండాలి కదా.. అందుకే ఆయన పంచన కూకట్‌పల్లికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను కూడా కలుపుకొన్నారు. ఈ భూములే కాదు.. ఖాళీ భూములు ఎక్కడ ఉన్నా.. అవి తమవేనని వీరు ప్రచారం చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి.

పారిశ్రామికవేత్తల కోటాలో టీడీపీ అధినేతకు దగ్గరయిన సుజనా చౌదరి.. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు. కానీ.. ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరుపైనే పలు విమర్శలు ఉన్నాయి. అక్రమాలే ఆయన ఆస్తులకు పునాదులన్న ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఆ పునాదుల్లో ఒకటి.. హఫీజ్‌పేటలోని హెచ్‌ఏఎల్ ఉద్యోగస్తుల భూ కబ్జా! తన సొంత సంస్థ అయిన సుజనాక్షిగూప్‌లో వైఎస్ ప్రెసిడెంట్ అయిన జవహర్‌బాబును ముందుకు తీసుకువచ్చి.. ఈ భూమిని రిజిస్టర్ చేయించారు. జవహర్‌బాబు సుజనా చౌదరి బినామీ అన్న అభిప్రాయాలు ఉన్నాయి. వీరి కబ్జా కహానీ చాలా డిఫంట్‌గా కనిపిస్తుంది. షబ్బీర్ అలీఖాన్ అనే పైగా కుటుంబీకుడు తమకు ఈ భూమి అమ్మారని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఈ భూమిని 1981లోనే పైగా వారసుల నుంచి హెఏఎల్ ఉద్యోగులు కొనుగోలు చేశారు. ఈ భూమిని ఉద్యోగులకే మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సైతం చెప్పింది. పైగా 2004 వరకు రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉంది. అలాంటప్పుడు ఈ భూమిని ఎవరు? ఎలా అమ్మారన్నది అంతుచిక్కని ప్రశ్న.

లేని యజమానులను సృష్టించారు!
హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూమిని కబ్జా చేయడానికి ఫోర్జరీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. యరియంబేగం, షబ్బీర్ అలీ ఖాన్‌లను ప్రత్తిపాటి పుల్లారావు బినామీగా చెప్పే రావెళ్ల రోశయ్య, సుజనాచౌదరి బినామీగా చెప్పే జవహర్‌బాబులు తెరమీదకు తీసుకువచ్చారు. పైగా కుటుంబానికి చెందిన ఇక్బాల్ అలీ ఖాన్ 1971లోనే బ్రిటన్ వెళ్లాడు. అక్కడే సెటిల్ అయ్యారు కూడ. ప్రస్తుతం అలీఖాన్ బ్రిటన్ పౌరుడు. అయితే ఇక్బాల్ అలీఖాన్ సంతకాలను ఫోర్జరీ చేసి భూమిని రిజిస్టర్ చేసుకున్నారని డాక్యుమెంట్లపై ఉన్న సంతాకాలను పరిశీలిస్తే అర్థమవుతున్నదని ఉద్యోగులు వాదిస్తున్నారు. పాస్‌పోర్టులో అలీఖాన్ సంతకం, ఈ భూమికి సంబంధించి కోర్టులో వివిధ సందర్భాలలో సమర్పించిన అఫిడవిట్‌లలో పేర్కొన్న సంతకాలు ఒకదానితో ఒకటి సరిపోలటం లేదని వారు చెబుతున్నారు.

ఇక్బాల్ వయసు విషయంలోనూ ఇవే మతలబులు కనిపిస్తాయి. ఏపీపీఎల్ నంబర్ 275/2006కు సంబంధించి సెప్టెంబర్28న జరిగిన డిక్రీలో ఇక్బాల్ వయసు 38 ఏళ్లుగా చూపించారు. ఏపీపీఎల్/2012 హైకోర్టులో చేసిన అప్లికేషన్‌లో అలీఖాన్ వయసు 57 ఏళ్లుగా పేర్కొన్నారు. 2010లోని హైకోర్టులో వేసిన కేసు డబ్ల్యూపీ నంబర్ 2281/2010లో 55 ఏళ్లు అని చెప్పారు. 2008లోని ఒక డాక్యుమెంటులో 38 ఏళ్లుగా, 2012లో మరో డాక్యుమెంటులో 56 ఏళ్లుగా ఇక్బాల్ వయసును చూపించారు. వాస్తవానికి ఇక్బాల్ వయసు బ్రిటిష్ పాస్‌పోర్టులో 58 ఏళ్లుగా ఉన్నది. ఒక్కో సంతకం ఒక్కోరంగా ఉండటం, ఒక్కో డాక్యుమెంట్లో ఒక్కో వయసు పేర్కొనడం చూస్తేనే అలీఖాన్ వ్యవహారం మొత్తం బోగస్ అని తేలిపోతున్నది. ఇన్ని తేడాలు ఉన్నా.. అప్పటికే ఈ భూమి ఒకరిపేర రిజిస్టర్ అయి ఉన్నా.. పట్టించుకోని అధికారులు జవహర్‌బాబు పేరుతో భూములు రిజిస్టర్ చేయడం విశేషం.

This entry was posted in ARTICLES.

Comments are closed.