కబ్జానేని నాగార్జున ఖాతాలో తమ్మిడి చెరువు!

– లోకాయుక్తలో ‘జనం కోసం’ సంస్థ ఫిర్యాదు
– ఏడుగురు ప్రభుత్వాధికారులకు నోటీసులు
హైదరాబాద్ మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కోసం ఆక్రమించారంటూ లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన లోకాయుక్త.. ఏడుగురు ప్రభుత్వాధికారులకు బుధవారం నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ ఖానామెట్‌లో తమ్మిడిచెరువుకు ఆనుకుని సినీ నటుడు నాగార్జునకు 6 ఎకరాల 30 గుంటల స్థలం ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్‌లోని 11/2అ లో 3 ఎకరాలు, 11/3/ఆ లో 3 గుంటలు, 11/36/అ లో 3 ఎకరాల 27 గుంటల స్థలం నాగార్జున పేరిట ఉంది. ఈ స్థలంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. అయితే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిడ్డి భాస్కర్‌డ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన లోకాయుక్త కేసును విచారణకు స్వీకరించి ఏడుగురు అధికారులకు నోటీసులు జారీ చేసింది.

రంగాడ్డి జిల్లా కలెక్టర్ వాణీవూపసాద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, హెచ్‌ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సెక్రటరీ సునీల్‌కుమార్ గుప్తా, నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ ఏసుబాబు, వెస్ట్‌జోన్ కమిషనర్ అలీంబాషా, సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మనోహర్, శేరిలింగంపల్లి తహశీల్దార్ రాజేషంలకు లోకాయుక్త నోటీసులు పంపింది. జూలై 31లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించింది. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ అసాంఘిక శక్తుల మాదిరి భూకబ్జాలకు పాల్పడడం హీరో నాగార్జునకు తగదని ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు కసిడ్డి భాస్కర్‌డ్డి ‘టీ మీడియా’తో అన్నారు. గురుకుల్ ట్రస్ట్, తమ్మిడి చెరువు భూములను ప్రభుత్వానికి స్వాధీన పరిచి తన హీరోయిజాన్ని నిరూపించుకోవాలని అక్కినేని నాగార్జునను డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా స్పందించి.. చెరువు కబ్జాకు పాల్పడిన నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. రూ. 150 కోట్ల విలువ చేసే తమ్మిడి చెరువుకు సంబంధించిన భూమిని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం కబ్జా చేసిందని ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించారని, వెంటనే తమ్మిడి చెరువు ఆక్రమణలను తొలగించి చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.