కపటనాటక సూత్రధారులు

(కట్టా శేఖర్ రెడ్డి): రాష్ట్రాల విభజన ఉద్యమాల చరిత్ర అంతా విడిపోవాలని కోరుకున్నవారి చరిత్రే. కలసి ఉండాలని ఉద్యమాలు చేసినవారు అరుదు. పంజాబ్, హర్యానా, హిమాచల్‌వూపదేశ్‌లు విడిపోయినప్పుడు ఇటువంటి వాతావరణం కొంత ఉంది. కానీ అప్పుడు కూడా ఇంత హరాకిరి లేదు. జార్ఖండ్ విడిపోయినప్పుడు బీహార్ ప్రజలు ప్రతిఘటించలేదు. ఛత్తీస్‌గఢ్ విడిపోయినప్పుడు మధ్యవూపదేశ్ ప్రజలు ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు. రాజధాని షిల్లాంగ్‌తో మేఘాలయ విడిపోయినప్పుడు కూడా అస్సాంవూపజలు రెండేళ్లలో సొంత రాజధాని నిర్మించుకుని దిస్‌పూర్‌లో స్థిరపడ్డారే తప్ప మేఘాలయపై యుద్ధం ప్రకటించలేదు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మద్రాసు ప్రజలు విడిపోవడానికి వీల్లేదని పోరాడలేదు. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌ను విభజించినప్పుడు మహారాష్ట్ర ప్రజలు అలా ఎలా చేస్తారని ప్రశ్నించలేదు. ఎప్పుడయినా రాజధానుల విషయంలో కొంత వివాదం, చర్చ జరిగింది. ఆ తర్వాత సద్దుమణిగింది. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం విచివూతంగా ఉన్నది. విడ్డూరంగా ఉంది. ‘మీకు ఇష్టం లేకపోయినా సరే, మీపై మేం ఎంత దాష్టీ కం చేసినా సరే, మిమ్మల్ని ఎన్నిరకాలుగా వివక్షకు గురిచేసినా సరే మీరు మాతోనే పడి ఉండాల’న్న ధోరణి ఈ ఉద్యమంలో కనిపిస్తున్నది. ‘మేం అనుభవిస్తాం. కొల్లగొడ తాం. మీరు భరించి తీరాలి’ అన్న మెజారిటీ దురహంకార ధోరణి ఈ ఉద్యమాల్లో కనిపిస్తున్నది. ‘సీమాంవూధలో జరుగుతున్నది ఇక్కడి రాజకీయ పార్టీల జూదంలో భాగం. విభజనకు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావన ఏమీ లేదు. విద్యార్థులు, ఉద్యోగుల్లో మాత్రమే హైదరాబాద్ గురించిన ఆందోళన ఉన్నది. రాజకీయ పార్టీలు పోటీపడి వెనుక నుంచి విద్యార్థులను, ఉద్యోగులను ఎగదోస్తున్నాయి. రాజకీయంగా ఒకరిపై ఒకరు స్కోర్ చేయడానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామాలూ చేస్తున్నారు’ అని విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రుడొకరు చెప్పారు.

నిజమే. విభజన అంతసులువైన విషయం కాదు. ఐదున్నర దశాబ్దాలుగా హైదరాబాద్‌తో జీవితాలు పెనవేసుకుపోయినవారికి ఇప్పుడు హైదరాబాద్ తమది కాకుండా పోతున్నదంటే కొంత బాధ ఉండడం సహజం. కానీ విభజన అనివార్యమని గత పదేళ్లుగా తెలుస్తూనే ఉన్నది. ఇవ్వాళ కాకపోతే మరో పదేళ్లకైనా ఈ ఉద్యమాలు ఏదోఒక రూపంలో మళ్లీ మళ్లీ తలెత్తుతాయని అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఇవ్వకపోతే రేపు ఎన్‌డియేవూపభుత్వమో, మరో పార్టీనో ఇచ్చి తీరవలసిన సమయం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర నినాదం ఒక ప్రజాస్వామిక హక్కు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే గత పుష్కరకాలంగా ఉద్యమాలు జరిగాయి. గతంలో ఏ రాష్ట్ర నినాదానికీ లభించనంత రాజకీయ మద్ద తు లభించింది. మెజారిటీ పార్టీలు తెలంగాణ ఏర్పాటు చేసి తీరవలసిందేనని లేఖలు ఇచ్చాయి. తీర్మానాలు చేశాయి. పార్లమెంటులో, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పక్షాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ ప్రకటనలు చేశాయి. ఇంత జరిగిన తర్వాత.. ఇప్పుడు ఈ ఆందోళన ఎందుకు? ఒక ప్రజాస్వామిక హక్కుకు వ్యతిరేకంగా, ఒక ప్రజాస్వామిక ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగేది ఎటువంటి ఉద్యమం అవుతుంది? ఎవరి ఉద్యమం అవుతుంది? భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఉద్యమాలు జరుగలేదు. చర్చిల్ నాయకత్వంలో కొంత మంది సామ్రాజ్యవాద ఆధిపత్య దురహంకార శక్తులు మాత్రమే దేశానికి స్వాతంత్య్రం ఇవ్వడానికి వ్యతిరేకంగా చివరివరకు ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు ఆంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని ఏమని నిర్వచిస్తారు?

రెండురోజుల క్రితం చంద్రబాబునాయుడు పాత్రికేయుల సమావేశం చూసి మురిసిపోయాం. ఇంతకాలానికి చంద్రబాబు మాటమీద నిలబడ్డాడని సంబరపడ్డాం. నిజానికి ఆయన తెలంగాణ ప్రజల ఆనందంలో పాలుపంచుకోలేదు. కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదు. అయి నా స్థూలంగా విభజనను అంగీకరించారు కాబట్టి ఆనందించాం. కానీ ఆ నమ్మకం వమ్ముకావడానికి ఇరవై నాలుగు గంటలు పట్టలేదు. ‘హిందుస్థాన్ టైమ్స్’అనే ఇంగ్లిష్ పత్రిక చంద్రబాబు ‘లోపలి మనిషి’ని బట్టబయ లు చేసింది. తెలంగాణను అడ్డుకోవడానికి ఆఖరు నిమిషం వరకు ఆయన చేసిన ప్రయత్నాలను ఆ పత్రిక బయటపెట్టింది. మరోవైపు ఆంధ్రవూపాంత టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత అనుమతితోనే రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. మొన్న వైఎస్సార్‌కాంక్షిగెస్ ఎమ్మెల్యేలు చేసిన పనే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు. సీమాంధ్ర పార్టీల నేతలు తెలంగాణలో ఉండే అవసరాల కొద్దీ, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ నినాదాన్ని సమర్థిస్తారు తప్ప, వారి బుద్ధిమారలేదని అర్థం అవుతున్నది. వైఎస్ జగన్ అయినా, చంద్రబాబు అయినా ఎప్పటికీ తెలంగాణను భుజాన వేసుకుని మాట్లాడలేరని తేలిపోయింది. వాళ్ల ప్రథమ ప్రాధాన్యత తెలంగాణ కాదని రుజువయిపోయింది. వీరిద్దరే కాదు.. మరో మహానాయకుడు ఉన్నారు-లోక్‌సత్తా నేత జయవూపకాశ్ నారాయణ్. తెలంగాణ ఏర్పాటు విషయంలో నోటితో నవ్వుతున్నారు, నొసటితో వెక్కిరిస్తున్నారు. ఆయన తన ఉక్రోషాన్ని దాచుకోలేదు. ‘రాష్ట్ర విభజన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలపడం తప్పనిసరి’ అట! తీర్మానం చేసేట్టు ఒప్పించాలట! రాజ్యాంగంలోని మూడవ అధికరణం స్ఫూర్తి ఇదేనట. అంబేద్కర్‌కు, రాజేంవూదవూపసాద్‌కు ఇంకా అనేక మంది రాజ్యాంగ నిర్మాతలకు చదువురాక, అర్థం కాక మూడవ అధికరణాన్ని రాశారని ఈయన అనుకుంటున్నారేమో! మెజారిటీ ప్రాంతాల దాష్టీకానికి, ఆధిపత్య రాజకీయాలకు ఏ ప్రాంతమూ బలికాకూడదనే ఉద్దేశంతోనే, విస్తృతమైన చర్చ జరిగిన తర్వాతనే రాష్ట్ర విభజన అధికారాన్ని కేంద్రం చేతిలో పెట్టారు రాజ్యాంగ నిర్మాతలు. అయితే అసెంబ్లీకి తెలియకుండా విభజన జరుగరాదన్న స్పృహతో నివేదన (ఫన్స్) అంశాన్ని పొందుపర్చారు. కొన్ని బలహీన క్షణాల్లో ‘లోపలిమనుషు లు’ ఎక్కడో ఒకచోట బయటపడిపోతారు. అందుకే ఆయన విభజనను సమర్థిస్తూనే తన ‘తేలుకొండి’ని బయటపెట్టారు.

కేంద్రమూ, రాజకీయ పక్షాలు ప్రజలను ఒప్పించాలని చెబుతున్నారు. ఎవరు ఒప్పించాలి? చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్, జేపీ….సీమాంవూధలో తమ పార్టీల కార్యకర్తలను ఒప్పించే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? విభజనకు మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నాలను ఇసుమంతైనా చేశారా? వీరు ‘బీ- ఫామ్’ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలను వీరే కట్టడి చేయనప్పుడు కాంగ్రెస్‌ను తిట్టిమాత్రం ఏమిటి ప్రయోజనం? వీళ్లు విభజనకు కట్టుబడి, నిలబడి, కాంగ్రెస్ ఒక్కటే రాజకీయం చేస్తే అప్పుడు ఆపార్టీని బోనులో నిలబెట్టవచ్చు. కానీ అన్ని పార్టీలూ ఆ తాను ముక్కలే. సీమాంధ్ర రాజకీ య ప్రయోజనాలకు పుట్టిన శిశువులే. అందుకే ఇన్ని వేషాలు, ఇన్ని కుప్పి గంతులు. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఎవరి పార్టీలో మరోసారి రుజువయింది. తెలంగాణలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నప్పుడు, ఉద్యోగులు జీత భత్యాలు తీసుకోకుండా సమ్మెలకు దిగినప్పుడు, వందలాది మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు, తెలంగాణ విషయంలో ఇక్కడి ప్రజలు పదేపదే భంగపడినప్పుడు.. ఎప్పుడూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు బాధపడలేదు. నొచ్చుకోలేదు. చలించలేదు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయలేదు. ఉద్యమంతో మమేకం కాలేదు. కనీసం సొంతంగా ఉద్యమాలైనా చేయలేదు. ఇప్పుడు చూడండి.. ఆంధ్రా లో వాళ్లేం చేస్తున్నారో! ఎంతగా చలించిపోతున్నారో..! ఎన్ని వీరాలాపాలు వినిపిస్తున్నారో చూడండి. తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబు ‘సిట్ అంటే సిట్, స్టాండప్ అంటే స్టాండప్’, మొరగమంటే మొరగడం చేశారు. చంద్రబాబు ఇక్కడి టీడీపీ నాయకులతో అస్తమానం ఉద్యమం చేస్తున్నవారిపై దాడులు చేయించారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కొంత జ్ఞానోదయమైంది. ఆ పార్టీని విడిచిపెడుతున్నారు. తెలంగాణలో సీమాంధ్ర పార్టీలలో ఉంటున్న మిత్రులంతా ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. చంద్రబాబు అయినా, జగన్ అయినా, జయవూపకాశ్ అయినా, కిరణ్ అయినా మనుషులే ఇక్కడ. మనసులు అక్కడే. వాళ్ల రాజకీయ మూలాలూ అక్కడే. వాళ్లను తప్పు పట్టవలసింది ఏమీ లేదు. తప్పు పట్టాల్సిందల్లా ఇప్పటికీ తెలంగాణ లో ఆ పార్టీలను పట్టుకుని వేలాడుతున్నవారిని. నిలదీయాల్సిం ది ఆ పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను!

రాజకీయ పక్షాలే కాదు, మీడియా కూడా నూటికి నూరుపాళ్లూ ఇటువంటి పాత్ర నే పోషిస్తున్నది. కొన్ని పత్రికలు రెండు ప్రాంతాలకు రెండు పత్రికల్నిస్తున్నాయి. అక్కడ ఉద్యమాన్ని రెచ్చగొట్టే శీర్షికలు పెడుతున్నాయి. ఇక్కడ ‘జై తెలంగాణ, సై తెలంగాణ’ శీర్షికలు పెట్టిన పత్రికలు, అక్కడ ‘రాష్ట్రం రెండు ముక్కలు’ అని శీర్షికలు పెట్టాయి. రాజకీయ నాయకులకు నీతులు చెప్పే పత్రికలు, యాజమాన్యాలు స్వయంగా ఆ నీతులు పాటించడం లేదు. ఇక్కడొక వేషం, అక్కడొక వేషం వేస్తున్నాయి. కొన్ని చానెళ్లు సీమాంధ్ర ఉద్యమ ప్రచారాన్ని ఉన్మాదస్థాయికి తీసుకెళుతున్నాయి. అక్కడ ఉద్యమాలు జరుగుతున్న చోట లైవ్‌లు పెట్టి, అక్కడి కుర్రాళ్లు ఎంతమాటంటే అంతమాట టీవీల్లో నేరుగా ప్రసారం చేస్తున్నాయి. సచివాలయంలో వరుసగా రెండు రోజులు ర్యాలీలు జరిగాయి. వీటిని టీవీల్లో చూసిన జనాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ‘మీడి యా తెలంగాణ మనోభావాలమీద దుర్మార్గంగా దాడిచేస్తున్న ది. మన తిండి తిని మంది పాటపాడే ఈ మీడియా మనకొద్దు. ఏదో ఒకటి చేయాలి సార్’ అని ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు బాధపడ్డారు. ‘అక్కడ విగ్రహాల విధ్వంసాన్ని సంబరంగా చూపిస్తున్నారు. ఇక్కడ విగ్రహాలు కూలినప్పుడు ఏడుపుగొట్టు సంగీతం పెట్టి మరీ తెలుగుభక్తి వ్యాఖ్యానాలు జోడించి ప్రసారం చేశారు. హైదరాబాద్‌లో ఉండి వాళ్లు ఇంత నిర్లజ్జగా రెచ్చిపోతుంటే ఏమీ చేయలేమాసార్’ అని మరో విద్యార్థి నాయకుడు ఫోను చేశారు. విభజన సాఫీగా జరిగేందు కు మీడి యా దోహదం చేయాలి. ఇంతకాలం తర్వాత, రెండు రాష్ట్రాల ఏర్పాటుపై ఒక నిర్ణయం వచ్చిన తర్వాత కూడా మీడియా పాతబుద్ధులు మానకపోవడం విచారకరం. ‘సీమాం ధ్ర రాజకీయ నాయకత్వం, మీడియా అంతా మరో చారివూతక తప్పిదం చేస్తున్నారు. విభజన సీమాంవూధకు ఒక అద్భుతమైన అవకాశం. పోటీపడి అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు వస్తాయి. 1969లో, 1972లో విభజనను అడ్డుకుని తప్పు చేశాం. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు. హైదరాబాద్‌లో మన వ్యాపారాలు, అస్తులు ఎవరయినా ఎత్తుకుపోతారా? ఎందుకీ రాద్ధాంతం? బలవంతంగా ఎంతకాలం కలసి ఉండగలం? హైదరాబాద్ మీద వ్యామోహంతో మన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడయినా మేలుకోకపోతే ఎలా?’ అని సీనియర్ బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇటువంటి వివేకం సీమాంధ్ర నాయకత్వాలకు, మీడియాకు ప్రసాదించాలని వేడుకుందాం.

kattashekar@gmail.com

This entry was posted in ARTICLES.

Comments are closed.